ᐅప్రతి అడుగూ అటువైపే...




ప్రతి అడుగూ అటువైపే... 


ఆధ్యాత్మిక సాధనలో అహానికి చోటు లేదు. నిజానికి గురు శుశ్రూష, సాధన అంతా అహాన్ని తొలగించుకునేందుకే. 'నేను'ను నిర్వీర్యం చేసి, నిశ్శేషంగా మిగిలేందుకే. గురువులు శిష్యులకిచ్చే శిక్షణలో అడుగడుగునా, అహాన్ని దూరీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. అదే ప్రధానంగా నిలుస్తుంది. ఎక్కడికక్కడ మదపుటేనుగును అణచేందుకు మావటి ఉపయోగించే అంకుశంలా గురువు శిష్యుణ్ని అహంకార రహితుణ్ని చేసేందుకు నిర్మొహమాటంగా కాఠిన్యాన్ని ప్రయోగిస్తుంటారు. శిష్యుడు ప్రతి విషయంలోనూ తన తల నేల వరకూ దించగలిగినప్పుడే జ్ఞానం అతని తల నిమురుతుంది. శిరోప్రవేశం చేస్తుంది.
భూస్థాయిలోని అహంతో అనన్యం, అప్రతిహతం, అప్రమేయమైన ఆత్మను అందుకోలేం. అందుకే దాన్ని (అహాన్ని) భూస్థాపితం చేస్తే గానీ కనీసం ఆత్మవైపు పయనించే అర్హత లభించదు. నేను, నాది అనే రెండు కొమ్ములు తగిలించుకుని పశు స్థాయిలో హుంకరించే మనిషి అరిషడ్వర్గాలనే గిట్టలతో సాధనా మార్గాన్ని కసబిస తొక్కితే గురువులు అంగీకరించరు. ఎందరో సద్గురువులు తామెంతో ప్రేమించే ప్రియ శిష్యుల్ని ప్రేమదండంతో, ఆత్మీయ అంకుశంతో అదిలించి, బెదిరించి దారిలోకి తెచ్చినవారే. శిక్షణ అనే బందెల దొడ్డిలో బంధించినవారే. చిన్నచిన్న పొర పాట్లను కూడా వారు అతి సూక్ష్మదృష్టితో పరిశీలించి పెద్దగా భావించి, వేళ్లతో సహా పెకలించి సరిదిద్దే ప్రయత్నం చేసిన వారే. సాధించిన వారే. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గురువర్యులైన మలయాళస్వామి వారి దగ్గర వ్యాసాశ్రమంలో సాధనా శుశ్రూషలు చేసేవారు. ఆ సమయంలో ఒకసారి ఆశ్రమ కార్యార్థియై ఎక్కడికో ప్రయాణమైపోతూ ఎవరి చేతో సామానంతా మోయించుకుని వెళ్తు న్నారు. అప్పుడు మలయాళస్వామి శిష్యుణ్ని వెనక్కు పిలిచి 'సామానంతా ఇతరుల చేతే మోయించి నీవు ఏ బరువూ అందుకోకుండా అలా వెళ్లడం పొరపాటు. కనీసం చిన్న వస్తువునైనా నీవు చేత బుచ్చుకోవాలి' అని బోధ చేశారు. ఈ చిన్న విషయం, తన భవిష్యత్ సాధనా జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని స్వామివారు చెప్పుకొన్నారు. నిరంకార సాధనకు, బోధనకు ఈ సంఘటన ఓ మచ్చుతునక.

నిజానికి సాధనామయ జీవితంలో ప్రతి శ్వాసా ఓ సాధనాంశమే అవుతుంది. ప్రతి అడుగును నియమానుసారంగా నిటలాక్షునివైపు చేరే దిశగా వేయడమే సాధన. ప్రతి శ్వాసనూ సేవగా ఆ సర్వజ్ఞుడికి అర్పించే సాంకేతిక జ్ఞానంతో చేయడం సాధన. మనం 'నేను' అనే పంజరంలో బంధించుకుని కుదించుకుని, నియంత్రించుకుని, ఆ ఇరుకు గదిని అస్తిపంజరాన్ని ప్రపంచంగా బతికేస్తున్నాం. నేను అనే అహాన్ని వదిలించుకుంటే, విడుదల చేసుకుంటే స్వేచ్ఛావిహంగం అయిపోతాం. విశ్వప్రపంచం మనది, విశ్వ శరీరం మనది అయిపోతుంది. నిజానికి అవధులులేని ఉపాధిలేని అనంతాత్ములం మనం. జ్ఞాన శరీరులం మనం. మనల్ని ఆ స్పృహలోకి తెచ్చేవాడు గురువు. అహాన్ని పక్కన పెట్టి అష్టాంగాలను ఆయన పాదాలముందు మోడ్చి శతకోటి ప్రణామాలతో శరణాగతులమవుదాం.

- చక్కిలం విజయలక్ష్మి