ᐅవికాస ధాత
గురుబోధను శిష్యుడు శిరోధార్యంగా భావించాలి. గురువు చేసే బోధనలు అమృతప్రాయమై శిష్యుని జీవనయానంలో ఉన్నత పథానికి చేర్చే సోపానాలుగా ఉపకరిస్తాయి. విద్యార్జన చేసే సమయంలో ఆచార్యుని పలుకులు కొన్ని సందర్భాల్లో కటువుగా అనిపించినా, అకళంకమైన ఆయన బోధనాసారం మాత్రం నవ్య నవనీత సమానమై అలరారుతుంది. గురువు శిష్యుడికి ఎప్పుడూ సన్మార్గాన్నే ప్రబోధిస్తాడు. హితకరమైన పనులనే చేయమని, సమాజానికి 'నేను సైతం' అన్న చందాన ఎంతో కొంత ఉపయోగపడమని ఉద్బోధిస్తాడు.
ప్రాచీనకాలంలో గురుశుశ్రూష చేస్తూ శిష్యులు ఆశ్రమాల్లో విద్యను ఆర్జించిన విధానానికీ, నేడు అధునాతన పద్ధతుల్లో సాగుతున్న గురుబోధన పద్ధతులకూ ఎంతో వ్యత్యాసం ఉన్నా- ఆచార్యదేవుని అంతిమ లక్ష్యం ఒక్కటే! తన దగ్గర విద్యను ఆశించి సన్నిధికి వచ్చిన శిష్యుడికి విజ్ఞాన గరిమను ప్రసాదించే విషయబోధ చేస్తాడు గురువు. ఉన్నత విద్యతోపాటు సాంఘిక జీవనసౌందర్యానికి మెరుగులద్దే అమూల్యమైన నైతిక విలువల్నీ గురువు శిష్యుడికి చిన్ననాటనే బోధిస్తాడు.
కొంతమంది గురువులు జీవితానికి అవసరమైన విషయాలపై అవగాహన ఏర్పరిస్తే, కొందరు గురువులు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను కరతలామలకం చేస్తారు. ఆదిశంకరులు, శ్రీమద్రామానుజాచార్యులు, మహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రీస్తు వంటి ఆధ్యాత్మిక గురువులు తమతమ సైద్ధాంతిక విశ్లేషణతో మతానికి, ఆత్మకు అనుసంధానమైన అంతర్యామి గురించి కొత్త విషయాలను తమను ఎల్లవేళలా అనుసరించి ఉండే శిష్యులకే కాక జగతిలోని జనులందరికీ తేటతెల్లం చేశారు. ఈ భక్తిమార్గ ప్రబోధకులు మహత్తరమైన ముక్తిమార్గాన్ని చూపిన స్తవనీయ చరితులు. అరిస్టాటిల్, ప్లేటో వంటి తత్వనీతిజ్ఞులు మానవ జీవన వికాసానికి అనుగుణమైన కమనీయ బోధనలతో, కొంగ్రొత్త ఆవిష్కరణలతో వినూత్న బాటలు వేశారు. ఎన్నో విషయాలను ఆవిష్కరించే విద్యాబోధనతోపాటు, జీవన గమ్యానికి అత్యంత ఆవశ్యకమైన క్రమశిక్షణను అణువణువునా రంగరించి శిష్యుడు జీవితంలో ఉన్నత సోపానాలు అధిరోహించడానికి ప్రధాన కారణంగా నిలిచే విమల యశస్కుడు గురువే!
గురువు శిష్యులందరికీ ఒకేవిధమైన విద్యను బోధించినా, వారిలోని ప్రత్యేకమైన ఆసక్తినీ, అనురక్తినీ గ్రహించి విలక్షణమైన రీతిలో ఆ శిష్యుడిని తీర్చిదిద్దటం మనకు పురాణకాలం నుంచీ ద్యోతకమవుతుంది. రాజులకు ముఖ్యమైనవి యుద్ధవిద్య, రణతంత్రం. మహాభారతంలో కౌరవ పాండవులకు రాజగురువుగా ద్రోణాచార్యుడు తన అద్వితీయ బోధనాపటిమతో, ప్రత్యేక శిక్షణా సరళితో సాక్షాత్కరిస్తాడు. భీమ దుర్యోధనులకు గదాయుద్ధాన్ని, అర్జునుడికి విలువిద్యను, నకుల సహదేవులకు అశ్వవిద్యను, ఇలా... గురువైన ద్రోణుడు వారి వారి అభిరుచిని బట్టి, వారి భువనైక ప్రతిభకు పదును పెట్టడం సాదృశంగా ద్యోతకమవుతుంది.
గురువు దివ్య వాక్కుల ప్రాభవాన్ని, శిష్యుడిపై ఆయన చూపగలిగే అగణిత ప్రభావాన్ని ఎంత చెప్పుకొన్నా తక్కువే! ఈ ధరిత్రిపై జనించడానికి తల్లిదండ్రులు కారకులైతే, గురువు ప్రజ్వలించే జ్ఞానప్రేరకుడు. గురువు వికాస ధాత! ప్రగతికీ, శ్రేయానికీ మూలభూతిగా నిలిచే లోక కల్యాణ ప్రదాత! విశాల విశ్వానికి తిమిరాన్ని దూరంచేసి వెలుగులు ప్రసాదించేది నింగిలోని వేవెలుగుల భానుడైతే, శిష్యుడి అజ్ఞానమనే తమస్సును తొలగించి విజ్ఞానజ్యోతులతో ప్రకాశింపజేసే జ్ఞానసూర్యుడు ఈ భువిలోని ఆచార్యుడు.
- వెంకట్ గరికపాటి