ᐅతొందరపాటు



ᐅతొందరపాటు 

నిదానమే ప్రధానమని చెప్పినవారే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమయ్యే ప్రమాదం ఉందన్నారు. అంటే త్వరగా పనులు చక్కబెట్టుకోవాలని భావం. త్వరత్వరగా చేసేపనిలో విజ్ఞత, నైపుణ్యం కొరవడే అవకాశం ఉంది. ఇక తొందరపడి మాటజారితే అంతే! వెనక్కి తీసుకోలేం! ఆకలి వేస్తోందని చెట్టుపిందెలు కోసుకుంటే అవి తినటానికి పనికిరావు. వేగిరపాటుతో పనిచేసి తరవాత బాధపడితే లాభంలేదంటారు విజ్ఞులు. ఆత్రంగా చేసే భోజనం అనారోగ్యానికి కారణమవుతుందంటారు వైద్యులు. వేగిరపు ఆలోచనల్లో పరిపూర్ణత ఉండదు. నలుగురి ఆమోదం పొందాలంటే సమయం తీసుకుని నిర్ణయాలు చేయవలసి ఉంటుంది.
ప్రాకృతికమైన సమస్యల పరిష్కారంలో వేచిచూసే ధోరణి అవలంబించవచ్చునేమోగానీ, ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంశానికి సంబంధించి భిన్నమైన కోణముంది. సాధకులు మలిప్రాయం దాకా ఆగకుండా చిన్న వయసునుంచే ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని విజ్ఞులు సూచిస్తారు. అతివేగం, అవివేకాలే అన్ని ఆపదలకు మూలమనీ, ముందువెనకలు ఆలోచించి పనిచేసేవారినే విజయలక్ష్మి వరిస్తుందనీ భారవి చెబుతారు.

అనాలోచితమైన, తొందరపాటుతో కూడిన విపరీత ధోరణి మహాభారతకావ్యం ఆదిపర్వంలో గాంధారి పాత్రద్వారా వ్యక్తమవుతుంది. గాంధారదేశాధీశుడైన సుబలుడి తనయ గాంధారి. భర్త ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు కనుక ఆయన చూడలేని లోకాన్ని తాను చూడకుండా కళ్లకు గంతలు కట్టుకొని కడదాకా జీవించిన పతివ్రత, ధీరవనిత గాంధారి. తన నూరుగురు కుమారులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో మృతిచెందటంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంతో ఉందని భావించి, యాదవ కుల వినాశాన్ని కోరుతూ శ్రీకృష్ణుడంతటి వాడిని శపించిన మహిళ గాంధారి. సంతానం విషయంలో తోడికోడలు కుంతితో పోటీపడిన ఆమె కుంతికి తొలిబిడ్డడు (ధర్మరాజు) పుట్టినప్పుడు, తన చూలు సాఫల్యం కాలేదని భావించి తొందరపడి చేసిన అనాలోచిత చర్య ఓ వింత పరిస్థితికి దారితీసింది. వ్యాసుడంతటి మహనీయుడి అండ ఉంది కాబట్టి, ఆమె తన తొందరపాటు తాలూకు దుష్ప్రభావాన్నుంచి విజయవంతంగా బయటపడగలిగింది.

ఒకానొక శాపభయం కారణంగా పాండురాజు సంతానం కోసం తన భార్యలతో సంగమించలేకపోతాడు. సంతానంలేదని చింతిస్తున్న పాండురాజు అనుమతి మేరకు దూర్వాసుడిచ్చిన మంత్రప్రభావంతో గర్భం ధరిస్తుంది కుంతి. ఒకమంచి ముహుర్తంలో కుమారుని కంటుంది. అతడే ధర్మరాజు. కుంతి అదృష్టానికి అసూయ చెందిన గాంధారి, వ్యాసమహర్షి వర ప్రభావంతో తానూ గర్భం ధరిస్తుంది. ఏడాది గడిచినా కాన్పు కాకపోవడంతో ఆమె కాలహరణ భరించలేక గర్భాన్ని చేత్తో తాడనం చేసుకుంటుంది. ఖండమై పిండం నేలపై పడుతుంది. వ్యాసుడు ఆ పిండాన్ని సంరక్షించి దాన్ని నూటఒక్క భాగాలుగా విభజిస్తాడు. నేయినింపిన కుండల్లో వాటిని భద్రపరుస్తాడు. తనసూచన ప్రకారం వాటిని సంరక్షిస్తూ పరిపోషణ చెయ్యమంటాడు. అలా నేతికడవల్లో ఊపిరి పోసుకున్నవారే దుర్యోధనాదులు నూరుగురు, వారి సోదరి దుస్సల.

మానవులు క్లిష్ట సమయాల్లోనూ తొందరపాటు చర్యలకు ఉపక్రమించకూడదని గాంధారి తొందరపాటును వ్యాసుడంతటి వాడు సరిదిద్దటం వల్ల ఆమె సంతానం నిలబడిందనీ, సామాన్యులు ఆమెలా ప్రవర్తిస్తే విపరీత పరిణామాలు తప్పవన్న గొప్ప సందేశాన్ని మహాభారతం మానవాళికి అందిస్తుంది.

తొందరపాటు లేని, విచక్షణతో వివేకంతో కూడిన కార్యాచరణవల్ల అటు వ్యక్తికి, ఇటు సమాజానికి హితం కలుగుతుందని ధర్మశాస్త్రాలు తెలియజెబుతున్నాయి.

- గోపాలుని రఘుపతిరావు