ᐅక్షమాగుణం



ᐅక్షమాగుణం 

మనం ఒక్కొక్కప్పుడు అవమానానికి గురైనప్పుడు అవతలి వ్యక్తిమీద ఎలా కక్ష తీర్చుకోవాలా అనే ఆలోచనతో బాధపడతాం. పందులు మురుగు కాల్వల్లో పొర్లి పొర్లి వాటి ఒంటిమీద తీట పోగొట్టుకుంటున్నట్లు మనం పొర్లి పొర్లి బాధపడకూడదు. అలా దొర్లడం పశువుల లక్షణం. జంతు ప్రదర్శనశాలలో ఖడ్గమృగం బురదగుమ్మిలో పొర్లి పొర్లి దొర్లుతూంటే చూసిన బాలబాలికలు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, మనం అంటే కిట్టనివాళ్లు ఆనందిస్తూ అపహాస్యం చేస్తూంటారు. అలాంటి స్థితిలో మనం కాస్త ఓర్పు వహించాలి. మన బంధుమిత్రుల్లో ఎవరైనా అటువంటి దుర్ఘటనకు లోనైనప్పుడు మనం వారికి ఓదార్చే వాక్యాలు నాలుగు పలకాలి. ఒకవేళ వారు మన దురవస్థను చూసి గతంలో కేరింతలు కొట్టినవారైనా, మనం వారిని ఓదార్చడానికి వెళ్లినప్పుడు వారే సిగ్గుపడి మనల్ని క్షమార్పణ కోరకపోయినా వారంతట వారే పరివర్తన చెందుతారు. తమలో తామే పశ్చాత్తప్తులవుతారు. ఆ విధంగా వారిలో రగులుతున్న ప్రతీకార జ్వాలను చల్లార్చినవారమవుతాం. అప్పుడు వారిలోనూ మనలోనూ సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. రాత్రింబవళ్లు మనలోనూ వారిలోనూ ఏర్పడిన కుమిలి కుమిలి బాధపడే సమస్యకు పరిష్కారం సులభతరమవుతుంది. భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పిన మంచి మాటలు తండ్రి అయిన హిరణ్యకశిపుడికి రుచించలేదు. ప్రతీకార జ్వాలలతో కుతకుతలాడిపోయాడు. శరీరంలోని దుష్టాంగాన్ని వైద్యుడు ఖండించినట్లు వీణ్ని ఖండించేయాలనుకున్నాడు. చివరికి ఆ ప్రతీకార జ్వాలల్లోనే నరకేసరిచే హతుడై భస్మీపటలమయ్యాడు. (అతను చనిపోయాక ప్రహ్లాదుడే తండ్రి భౌతిక దేహానికి అంత్యక్రియలు జరపవలసి వచ్చింది.)
క్షమాగుణం అన్నది మార్పు చెందుతున్న సమాజానికి అద్దంపట్టాలి. కొన్ని సమయాల్లో క్షమాగుణం మిక్కిలి విలువైనదిగా తెలుసుకోవాలి. గతంలో మనం తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని నెమరువేసుకోవద్దు. అవతలివాళ్ల తప్పుల్ని సైతం ఎత్తిచూపడమూ తగదు. అలా అయితే బాధితులకు ఉక్రోషం తప్పుతుంది. పుండుమీద కారం జల్లకుండా ఉపశమనం కలుగుతుంది. తామూ అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. నిజాయతీగా తప్పుల్ని ఒప్పుకొని క్షమార్పణ కోరడం- మన గొప్పదనాన్ని ఇనుమడింపజేస్తుంది. బంగారానికి తావి అబ్బినట్లవుతుంది. అవతలివాళ్లు మనల్ని చూడగానే అప్రయత్నంగానే చేతులెత్తి నమస్కారిస్తారు. అప్పుడే ఎదుటివారిలోనూ పరివర్తన వస్తుంది. ఇంత మహోన్నత వ్యక్తిపై తొందరపడి కక్ష పెంచుకున్నామే అని బాధపడతారు. ఒక సాధువు శిష్యులతో వెళుతుంటే కొందరు వ్యక్తులు ఆ సాధువును అవహేళన చేస్తున్నారు. ఆయన సమాధానం చెప్పక మౌనం వహించాడు. 'అలా వాళ్లు తిడుతూంటే మౌనం వహిస్తారేమిటి స్వామీ?' అన్నారు శిష్యులు. 'ఆ తిట్లు నాకు తగిల్తేకదా బాధపడేది? అవి వారిదగ్గరే ఉండిపోయాయి. లోపలున్న అంతర్యామికి అవి తగలవు' బదులిచ్చారు స్వామీజీ. ఈ చెంపమీద కొడితే ఆ చెంప చూపించమంటాడు ఏసు ప్రభువు. క్షమాగుణం అంటే అలా ఉండాలి.

- బులుసు-జీ-ప్రకాష్