ᐅకృతజ్ఞత




కృతజ్ఞత 

కృతజ్ఞత అనేది మనిషి సుగుణాల్లోనే మకుటాయమానం వంటిది. హార్దిక బంధాలు అడుగంటి ఆర్థిక సంబంధాలు బలపడుతున్న ఈ రోజుల్లో దీని ప్రాధాన్యం పోనుపోను తగ్గిపోతోంది. కారణం- స్వార్థం! 'ఎప్పటికామాటలాడి...' ఆపై తప్పించుకొని తిరిగేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.
మన గ్రంథాల్లో కృతజ్ఞతకు కవులు పెద్దపీట వేశారు. రామాయణంలో శ్రీరాముడు సుగ్రీవుడితో మైత్రి నెరపి ఒకరికొకరు సాయం చేసికొనే ఒప్పందం కుదుర్చుకుంటాడు. సుగ్రీవుని అభ్యర్థన మేరకు దాశరథి వాలిని సంహరిస్తాడు. ఆ తరవాత సుగ్రీవుడు తన బాధ్యత మరచి కృతఘ్నుడై విందు విలాసాల్లో మునిగి, తాగి తూలుతుంటాడు. స్వతహాగా మృదుస్వభావి అయిన రఘురాముడు సహనం వహించి నిగ్రహం పాటిస్తాడు. అయితే సౌమిత్రి మాత్రం ఇది సహించలేక ఆగ్రహోదగ్రుడై సుగ్రీవుని నిలదీస్తాడు. ఆ ఘట్టంలో వాల్మీకి కృతజ్ఞత ఆవశ్యకతను రసరమ్యంగా వివరిస్తాడు.

కృతజ్ఞత లేనివాడి మృతకళేబరాన్ని శునకాలు సైతం ముట్టవని చెబుతారు. ఇక మహాభారతంలో కృతజ్ఞతకు మారుపేరుగా కర్ణుడు నిలిచాడు. సూతపుత్రుడని లోకం మొత్తం అతణ్ని అవమానిస్తుంటే అప్పటికప్పుడు అంగరాజును చేసిన సుయోధనుడికి కర్ణుడు యావజ్జీవితం రుణపడి ఉంటాడు. దుర్యోధనుడి దుర్మార్గాలనూ సహిస్తాడు. కృతజ్ఞత ముందు మాతృ, సోదరప్రేమలు వెలవెలబోతాయి. సొంత తమ్ముడు అర్జునుణ్ని సైతం నిర్జించడానికీ రాధేయుడు సిద్ధపడతాడు. తుదకు కురుక్షేత్రంలో వీరమరణం పొందుతాడు. అందుకే కర్ణుడు చరిత్రపురుషుడిగా శాశ్వత కీర్తి సంపాదించాడు. అలాగే శ్రీకృష్ణుడూ ఒకానొక సందర్భంలో తన వేలికి గాయమైతే చీర చింపి కట్టుకట్టిన ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో వరస చీరలిచ్చి ఆమె మానం కాపాడతాడు.

మరొక సందర్భంలో వాసుదేవుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని మరువక, స్నేహంకంటే కృతజ్ఞత ఎంతో గొప్పదని వ్యాఖ్యానిస్తూ అతనికి అష్త్టెశ్వర్యాలూ అనుగ్రహిస్తాడు. మనం ఇతరులకు చేసిన సహాయాన్ని నీటిమీద రాయాలి. పరులు మనకు చేసిన పరోపకారాన్ని రాతిమీద రాయాలి. మన గుండెల్లో శాశ్వతంగా నిక్షిప్తం చేసుకోవాలి. అవసరమైతే ప్రత్యుపకారానికి సిద్ధపడాలి. అపకారికి సైతం ఉపకారం చేయగలిగేవాణ్ని అత్యున్నతుడిగా భావిస్తారు.

కృతజ్ఞతకు పునాది విశ్వాసం. నాలుగు మెతుకులు విదిలిస్తే కుక్క జీవితాంతం మన వెంట తోకాడిస్తూ తిరుగుతుంది. యజమానికి ఎవరైనా హాని తలపెడితే కలబడుతుంది. అలాంటిది బుద్ధి, జ్ఞానంలో ఎంతో పరిపక్వత కలిగిన మనిషి కృతజ్ఞత విషయంలో ఎందుకు ప్రశ్నార్థకం అయ్యాడు? మతికీ మనసుకీ శ్రుతి కుదరక... కృతజ్ఞత పరమార్థం తెలియక...

- కిల్లాన మోహన్‌బాబు