ᐅభక్తి-ముక్తి
అందరినీ సమానంగా ఆదరిస్తూ ప్రేమించేవాడే నిజమైన భక్తుడు. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అనే భేదభావంలేని భక్తుని జీవితం ఒక ప్రేమ ప్రవాహం. మనుషులను, పక్షులను, మృగాలను, ప్రేమించగలిగినవాడే ఉత్తమమైన ప్రార్థన చేయగలడు. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, ఏమీలేనినాడు భక్తి ఒకేలా ఉండాలి. ఈ సాధన కత్తిఅంచుపై నడక లాంటిది.
గుడిలో దైవం పాదాల చెంత పూలుపరచే ముందు మన ఇంటిలో ప్రేమ పరిమళాలు నింపుకోవాలి. భగవంతుని ఎదుట దీపాలు వెలిగించేముందు మన హృదయాలనుంచి దుష్కర్మల చీకట్లను రూపుమాపుకోవాలి. భగవంతుని ఎదుటనిలచి తలవంచి చేతులు జోడించడానికి ముందు తోటి మానవులపట్ల వినమ్రభావంతో తలవంచడం నేర్చుకోవాలి. గుడిలో దేవుని ఎదుట మోకాళ్లపై వంగి ప్రార్థించడానికి ముందు, విధివంచితులై అధోగతిపాలైనవారిని ఉద్ధరించడం అలవరచుకోవాలి. సానుభూతి అయినా చూపాలి. భక్తుడు తానుచేసిన పాపాలను క్షమించమని దేవుణ్ని అడగడానికి గుడికి వెళ్లకూడదు. తనపట్ల క్రూరంగా ప్రవర్తించి హింసించి పాపం చేసినవారిని క్షమించగలగాలి. అప్పుడు భక్తి ఉత్తమ ప్రార్థనగా హృదయంలోనుంచి ప్రజ్వరిల్లుతుంది.
ముక్తికోసం ప్రార్థించేముందు భగవంతుడు మనల్ని భూమిపైకి ఎందుకు పంపాడో ఆలోచించాలి. అందరూ కాకపోయినా కొందరి కళ్లనుంచి రాలే అశ్రుబిందువులనైనా స్నేహహస్తంతో తుడవగలగాలి. అది ముక్తికన్నా మధురం, ఆనందం కాదా? ఒక్క వ్యక్తి కష్టాలు రూపుమాపడానికి ఎన్నివేల శరీరాలైనా ధరిస్తానని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పేవారు. భగవంతుడే ఆనందంగా సృష్టిబంధాల్లో తనను తాను బంధించుకొన్నాడు. మనతోపాటే శాశ్వతంగా బంధితుడై ఉన్నాడు. ఆయనకు లేని ముక్తిని మనమెందుకు కోరాలి? హృదయం ఎండిపోయి, బీటలు వారినప్పుడు తొలకరి జల్లులా భక్తి మనపై వర్షించాలి. జీవితం సౌందర్యాన్ని, మాధుర్యాన్ని, ఆర్ద్రతను కోల్పోయినప్పుడు మధుగీతంగా భక్తి ఉప్పొంగాలి. క్షుద్రమైన కోరికలు మనసును భ్రమలు, దుమ్ము, ధూళితో కలుషితం చేస్తున్న వేళ- విద్యుల్లతలా భక్తి మెరిసిపోవాలి. విషాదవదనంతో, నైరాశ్యంతో మగ్గిపోతూ ఆ రూపంతో బయట ప్రపంచంలోకి వెళ్లి మనుషుల మనసుల్ని నిరుత్సాహపరచడం హీనాతిహీనం. చిన్నతగాదాలు, పెద్దయుద్ధాలు, సంఘర్షణల్లో అణగారిపోవడానికా ఈ దివ్యతేజోమయ ఆత్మ భువికి వచ్చింది!
మనలోని లోపాలను పదేపదే గుర్తుచేసుకొని, కుమిలిపోవడంవల్ల భగవంతునిపట్ల మన విశ్వాసం సన్నగిల్లుతుంది. చిట్టచివరికి గెలుపు మనదేనన్న గట్టి నమ్మకం, చిరునవ్వు, ఆత్మవిశ్వాసం- ఇవి మనకు సహాయదీపికలు. మన పురోగతిని అవి సులభతరం చేస్తాయి.
మన బలహీనతలను గుర్తించి వాటి ప్రభావంనుంచి తప్పుకొని ముందుకు అడుగువేస్తే అప్పుడే భక్తిదీపం నిండుగా వెలుగుతుంది. అందుకే ప్రార్థన. అదే అత్యుత్తమ భక్తి. అది ముక్తికన్నా ఎత్తయిన శిఖరం. అయితే అజ్ఞానం, అచేతననుంచి, రాక్షస అకృత్యాలు, అరాచకాలనుంచి ప్రపంచాన్ని, మానవాళిని విముక్తంచేసే భక్తి ఆ శిఖరానికే అగ్రం. భక్తి వ్యక్తిగత ఖజానా కాదు. అది విశ్వజనీన కాంతిరేఖ!
- కె.యజ్ఞన్న