ᐅవిశ్వమానవ విజ్ఞాన కోశం




విశ్వమానవ విజ్ఞాన కోశం 

భారతీయుల మహేతిహాసం మహాభారతం. అనేక శాస్త్రాలను, భౌతిక పారమార్థిక ప్రయోజనాలను సమీకరించి సమన్వయించిన ఉద్గ్రంథం. యుగాలనుంచి వేదాలు మొదలుకొని పురాణ, ఆగమ, ధర్మశాస్త్ర, జ్యోతిష, యోగాది విజ్ఞానాలను సమకూర్చిన ఇంతటి మహాసాహిత్యం ప్రపంచంలోనే అసామాన్యం.
మతదృష్టితోకాక- కావ్య, జ్ఞాన దృక్పథాలతో పరిశీలించవలసిన ఈ దివ్యసాహితి ప్రపంచ మేధావులెందరినో ఆకర్షించింది. ప్రధానమైన కురువంశగాథ ముఖ్యకథగా (ఆఖ్యానంగా) తీసుకొని, లెక్కకు మిక్కిలి ఉపాఖ్యానాలతో, బోధలతో, అబ్బురపరచే జ్ఞానాంశాలతో ఒక విశిష్ట ప్రక్రియగా తీర్చిదిద్దాడు వ్యాస భగవానుడు.

ప్రసంగానుప్రసంగంగా- వేదాంత గోష్ఠి, ధార్మికచర్చ ఎన్నోచోట్ల జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో 'భగవద్గీత' ఒకటి. ఇలాంటి గ్రంథాలే సనత్సుజాతీయం, యక్షప్రశ్నలు, నహుషప్రశ్న, భీష్ముడు బోధించిన అసంఖ్యాకాంశాలతో కూడిన శాంత్యనుశాసనిక పర్వాలు... ఈ భారత సముద్రంలోని ఉత్తుంగ తరంగాలు. వేటికవే ప్రత్యేక గ్రంథాలు. ఎన్నో గ్రంథాలను దాచుకున్న మహాగ్రంథమిది.

ఈ శాస్త్ర గ్రంథం పుట్టి కొన్ని వేల ఏళ్లు గతించాయి. ఇంతటి విస్తారకాలంలో ఈ గ్రంథాధారంగా ఎన్నో మహాకార్యాలు నెరవేరాయి. కర్మ జ్ఞాన భక్తి యోగాలతో కూడిన వేదాంతాన్ని నిత్యజీవితంలో సమన్వయించిన గొప్ప శాస్త్రమిది. సర్వోపనిషత్సారభూతమని ఆ గ్రంథమే చెప్పుకొంది.

'శ్రీ కృష్ణుడు ఈ గ్రంథం ద్వారా యుద్ధాలు చేయమని హింసనీ, తీవ్రవాదాన్నీ ప్రోత్సహించాడు' అనే కుబుద్ధి కోణం ఇన్నివేల ఏళ్లలో ఏ ఒక్కరికీ కలగలేదు. అంటే- ఈ గ్రంథంలో ఆ ఆలోచనే లేదన్నది స్పష్టం. అక్కడ ఉపదేశాన్ని పొందిన అర్జునుడు- ధర్మరక్షణ కోసం తన, పర భేదాలు లేకుండా, అవసరాన్ని అనుసరించి ధర్మయుద్ధం చేయవలసిన కర్తవ్యం కలవాడు. అందుకే 'స్వధర్మం' అనే గొప్ప శబ్దాన్ని ఆ శాస్త్రం ప్రయోగించింది.

'ఎవరికి వారికి పరంపరాగతంగా, సామాజికంగా ఒక ధర్మం ఉంటుంది. దాన్ని తప్పరాదు. ఆ స్వధర్మంలోనే జీవితాన్ని ముగించాలి. దానిని నిస్వార్థంగా, లోకక్షేమంకోసం, ఈశ్వరార్పణ బుద్ధితో చేసినవాడు చిత్తశుద్ధినీ, క్రమంగా ఆత్మజ్ఞానఫలమైన మోక్షాన్ని పొందుతాడు'- ఇదే గీత సారాంశం. యోధుడికి యుద్ధం ధర్మమైతే, సన్యాసికి వైరాగ్యం ధర్మం.

అందుకే భగవానుడి బోధనలను ప్రస్థానత్రయం (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత)లో ఒకటిగా అధ్యయనం చేసింది మేధావి వర్గం. పాలన ధర్మం, దేశరక్షణ ధర్మం కలిగిన ఒక యోధుడు, తనదైన న్యాయబద్ధ సంపాదనను, అన్యాక్రాంతంనుంచి తిరిగి గ్రహించడానికై సామ దాన భేదాది శాస్త్ర ధర్మాలను పాటించి, ప్రయత్నించినా సాధ్యం కాకపోతే, చివరి ఉపాయమైన దండనీతిని ప్రయోగించాడు. ఇది ఏ దేశంలోనైనా, ఏ నాగరిక సమాజంలోనైనా సాధారణాంశమే. ఒక దేశానికి రక్షణ వ్యవస్థ, శత్రు దేశాలతో అవసరాన్ననుసరించి యుద్ధం, దానికి తగిన సామగ్రిని సమకూర్చుకోవడం నేటికీ ఉన్నదే. ఆ పనికి కేటాయించినవారిని, దాని విషయంలో ఆ దేశ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తాయి. అంతమాత్రం చేత ఆ దేశం తీవ్రవాద, హింసావాద దేశం అనడం ఎంత అజ్ఞానమో, గీతాశాస్త్రాన్ని హింసాప్రబోధ గ్రంథంగా చూడటమూ అంతటి అవివేకమే!

మతానికి అతీతమైన తత్వశాస్త్రం- గీతాశాస్త్రం. దీని ఆధారంగానే గాంధీ మహాత్ముడు అహింసోద్యమాన్ని నడిపాడు. తిలక్ కర్మనిష్ఠను బోధించాడు. జ్ఞానవైరాగ్యంతో కూడిన వేదాంతం వైపు, త్యాగం వైపు ప్రయాణించడానికి ఈ గీతనే చుక్కానిగా ఆదిశంకరులు, రామానుజులు మొదలుకొని ఎందరో యతీంద్రులు శాంతి లక్ష్యంగా ప్రబోధించారు.

నిత్య జీవిత వ్యవహారంలో అనుష్ఠాన వేదాంతాన్ని సమైక్యం చేసిన దీని ఆధారంగానే స్వామి వివేకానంద ప్రపంచం కళ్లు తెరిపించారు. గీతలో బోధించిన దైవగుణసంపద, విభూతియోగం, విశ్వరూప సందర్శనం, గుణత్రయ విజ్ఞానం... వంటి విజ్ఞానాంశాలు భారతీయ మహోన్నత తత్వచింతనకు దర్పణాలు. ఈ దేశపు అత్యంత ప్రాచీన విజ్ఞానానికి ఆలవాలాలు. వీటిని వారసత్వ సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరం మానవాళిది.ఎవరి ధర్మాన్ని వారు పాటించాలని చెప్పే గ్రంథంవల్ల- హింసాదులు తగ్గుతాయి. ప్రతి ధర్మానికీ గౌరవం ఏర్పడుతుంది. ప్రతి పనినీ, ఆ పనిచేసేవారినీ మన్నించి ఆదరించే సమానత్వం సమృద్ధమవుతుంది. ఎవరికో చెప్పేముందు మనల్ని మనం తెలుసుకొని, పదిలపరచుకోవలసిన మనదైన విజ్ఞానకోశం 'భగవద్గీత'. మనకున్న అపార శాస్త్ర సంపదలో ఇది ఒక భాండారం.

- సామవేదం షణ్ముఖశర్మ