ᐅఓజస్కరుడే భాస్కరుడు
ᐅఓజస్కరుడే భాస్కరుడు
అఖండ సౌభాగ్యాలనిచ్చే దైవం సూర్యనారాయణుడు. సూర్యుడు లేనిదే భూమి లేదు. జీవకోటి లేదు. ప్రాణిలోని పంచభూతాలకు కారకుడు సూర్యుడు. అందుకే సూర్యుణ్ని ప్రత్యక్ష దైవమని సంబోధిస్తారు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యనారాయణ జయంతిని పర్వదినంగా చేసుకుంటాం. సూర్యుడు జన్మించిన సప్తమిని రథసప్తమిగా రుగ్వేదం చెబుతోంది. సూర్యుడు అదితి, కశ్యపులకు జన్మించినవాడు. అందుకే సూర్యుణ్ని కశ్యపాత్మజుడు, ఆదిత్యుడు అంటారు. రథసప్తమి తరవాత అష్టమిరోజున అంపశయ్యపై భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదిలాడు. ఈ అష్టమిని అందుకే భీష్మాష్టమి అంటారు.
మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. సప్తాశ్వాలతో కూర్చిన తన రథాన్ని రోదసిలో ఉత్తరం వైపు మరల్చడం వల్ల సప్తమికి రథసప్తమి అనే పేరు కలిగిందంటారు. సూర్యుడి రథాన్ని కాలానికి అనుగుణంగా సాగించగలిగే ఏడు అశ్వాలు ఏడు రోజులకు ప్రతీకలు. ఆ రథానికి ఉన్న పన్నెండు రథ చక్రాలు పన్నెండు మాసాలకు సంకేతాలు. సింహరాశి సూర్యుని నిజరాశి. సింహరాశి నుంచి కర్కాటక రాశి వరకు కొనసాగే రథగమనం మూడువందల అరవై రోజుల్లో ముగుస్తుంది.
రథసప్తమి రోజున సూర్యుణ్ని అరుణ (ఎరుపు) వర్ణమాలతో పూజిస్తారు. అరుణోదయ వేళకు ముందే స్నానంచేసి గాయత్రీ మంత్రసహిత భాస్కరవ్రతం చేస్తారు. సప్తమికి ముందు రోజైన షష్ఠినాడు ఒంటిపూట భోజనం చేయడం ఆచారం. రథసప్తమి ఉత్తరాయణ పుణ్యకాలానికి తొలిరోజు కనుక నదీస్నానం చేసి నదుల్లో దీపాలు సమర్పించి పితృతర్పణాలు వదలాలని గరుడ పురాణం సూచిస్తుంది. షష్ఠితొలగి సప్తమి ప్రారంభమయ్యే కాలాన్ని పద్మకం అంటారు. ఇదొక శుభయోగకాలం.
ఈ కాలంలో ఆదిత్య హృదయం చదివితే వేయి సూర్యగ్రహణ కాలంలో సూర్యుని స్మరించినంత పుణ్యం లభిస్తుందని గర్గ మహాముని సప్తర్షి మండలంలో ఎలుగెత్తి చాటాడని పద్మపురాణం వివరిస్తోంది. సూర్యుణ్ని సవిత్రుడనీ పిలుస్తారు. గాయత్రిని సావిత్రి అంటారు. ఈ గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలన్నీ సూర్యమండలంలో కేంద్రీకృతమై ఉంటాయని రుగ్వేదం చెబుతోంది. అందుకే సూర్యుణ్ని సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణ అని పూజిస్తారు. బీజాక్షర కేంద్రంనుంచి ఉద్భవించి రోదసిలో ఎల్లెడలా వ్యాపిస్తున్న కిరణాలు ప్రాణికోటికి తేజస్సును ఓజస్సును అందజేస్తాయి. అందుకే, భాస్కరుడు ఓజస్కరుడు.
సూర్యుడు జగత్తు సృజనకు మూలమని ఆదిత్య హృదయం చెబుతోంది. జగత్ప్రసూతిస్థితి నాశహేతువు సూర్యుడే! ఈ స్తోత్రంలో సూర్యుణ్ని త్రిగుణాత్మ ధారుడిగా సంబోధించారు. విరించి (బ్రహ్మ) నారాయణ (విష్ణు) శంకర ఆత్మలకు మూలస్థానం సూర్యమండలమే.
పాండవుల వనవాస కాలంలో ధర్మరాజుకు అక్షయ పాత్రనిచ్చి కాపాడిన దైవం ఈ ఆదిత్యుడే! రామరావణ యుద్ధకాలంలో అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయ పారాయణం వల్ల శ్రీరామచంద్రుడికి రావణ సంహారం సానుకూలమైందంటారు.
రథసప్తమి రోజు తిరుమలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారు ఆరోజు మలయప్ప స్వామిగా శ్రీదేవి భూదేవి సహితుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఆ ఊరేగింపులో సప్త వాహనాలు మలయప్ప స్వామిని అనుసరిస్తాయి. ఈ వేడుకలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. అందుకే రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవంగా అభివర్ణిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందే సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే రథసప్తమి వేడుకలు రాత్రి తొమ్మిది గంటలకు చంద్రప్రభ వాహన ఊరేగింపుతో ముగుస్తాయి.
మన దేశంలో ప్రసిద్ధి చెందిన సూర్యదేవాలయాలు రెండున్నాయి. ఒడిషాలోని కోణార్కదేవాలయం, తూర్పు గాంగేయ వంశరాజు నృసింహదేవుడు పదమూడో శతాబ్దంలో నిర్మించింది. రెండోది, మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఉంది. ఈ ఆలయాన్ని సూర్యనారాయణ ఆలయం అంటారు. ఇక్కడ సూర్యనారాయణుడు పద్మ ఉష ఛాయా సహితంగా దర్శనమిస్తాడు. సనక సనందనాదులు ఆలయ ద్వార పాలకులుగా ఇక్కడ దర్శనమిస్తారు.
- అప్పరుసు రమాకాంతరావు