ᐅనిశ్శబ్ద శబ్దం
ᐅనిశ్శబ్ద శబ్దం
నిశ్శబ్దం సనాతనమైంది... భగవంతుడిలా. నిశ్శబ్దం అంతర్ముఖమైంది... ధ్యానిలా. నిశ్శబ్దం అనంతమైంది... ఆకాశంలా. ఏమిటి నిశ్శబ్దం? కర్ణపేయమైన, అందమైన, అవసరమైన శబ్దాన్ని కాదని నిశ్శబ్దాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆచరించాలి? ఎందుకు ప్రేమించాలి?
చెవులకు వినిపించేది శబ్దం. ఆంతర్యానికి అర్థమయ్యేది నిశ్శబ్దం. ఆత్మవరకూ సాగేది నిశ్శబ్దం. ప్రథమ శబ్దరూపమైన ఓంకారం నిశ్శబ్దంలోంచే ఉత్పన్నమైంది. శబ్దం భౌతికమైంది. నిశ్శబ్దం ఆంతరికమైంది. నిజమే... కదిలే చిత్రపటంలా ఉండే నిశ్శబ్ద సజీవ చలిత ప్రకృతికి శబ్దం ఒక సౌందర్యాన్నిచ్చింది. కొత్త చైతన్యాన్ని తెచ్చింది. జీవులు భౌతికంగా పరస్పరం అంతర్గత భావాలను తెలుపుకొనేందుకు ఒక అవకాశాన్నిచ్చింది. సప్తస్వర సమన్వితమైన సంగీతంతో ప్రపంచాన్ని స్వరరాజ విరాజమానం చేసింది. నీరాజనాలందుకుంది. అయితే నిశ్శబ్దం ఆది స్వరం. సుస్వర రాజీవం. ఆత్మకు మాత్రమే అర్థమయ్యే అతిశయ శబ్ద సౌందర్యం. త్రిభువనాల్లో ఏ శబ్దమైనా నిశ్శబ్దంలోంచి వచ్చిందే. మళ్లీ ఏ శబ్దమైనా నిశ్శబ్దంలో విలీనం కావలసిందే. అది అపస్వరంలేని అనంత స్వరం. నిశ్శబ్ద శబ్దం.
ఆధ్యాత్మిక సాధనల్లో చాలామంది శబ్దాన్ని ఆశ్రయిస్తారు. అంటే పైకి పెద్దగా మంత్రాలు, స్తోత్రాలు చదవటం, పారాయణాదులు చేయటం లాంటివి. అలా చేయకపోతే వారికి తృప్తి ఉండదు. అసలు అలాకాక మరోలా చేయలేరు కూడా. వేదాలు శ్రుతులే (వినగలగినవి) అయినా, స్వరబద్ధంగా, శ్రుతిపక్వంగా పాఠనం చేయదగినవే అయినా- గురుముఖతా లభించే మంత్రాదులు మాత్రం నిశ్శబ్ద సాధనకే పరిమితమయ్యాయి. పారాయణాదులైనా అంతే. స్తోత్రాలకు మాత్రం పైకి పఠించే వెసులుబాటునిచ్చింది శాస్త్రం. అవి కూడా మానసికంగా చేసినా తప్పులేదు. నిజానికి ఏ సాధనైనా, భౌతికమైన పాఠ్య పాఠాలైనా, పుస్తక పఠనమైనా నిశ్శబ్దంగా చదవటమే ఉత్తమమైన పద్ధతి. ఏకాగ్రతకు సంబంధించిన ఏ సాధనైనా నిశ్శబ్ద సమయంలోనే నిశ్శబ్దంగా చేయమని పెద్దలు సలహా ఇస్తారు. నిశ్శబ్దం మనసును ఏకాగ్రపరుస్తుంది. శబ్దం పారాడ జేస్తుంది. ఏకాగ్రత కొరవడ జేస్తుంది. అయితే శబ్దానికి శక్తి లేదా అంటే, మళ్ళీ అది వేరే అంశం. నిప్పు కాలుస్తుంది. మళ్ళీ దాని ప్రయోజనం దానికుంటుంది. శబ్దం అవసరమైందే. కానీ, ఎంతవరకు? ఎంతవరకు అవసరమో అంతవరకే. అతిశబ్దం, అనవసర శబ్దం మనిషిని చిరాకుపరుస్తాయి. అంతర్ముఖ ప్రియులు (బహిర్ముఖులు కూడా) నిశ్శబ్దాన్ని వెదుక్కుంటూ వెళ్లేవారేగానీ, శబ్దాన్ని వెదుక్కుంటూ వచ్చేవారుండరు. హిమాలయ సానువులను ఆశ్రయిస్తూ వెళ్లేవారు అధికభాగం- ఆ ఊర్ధ్వముఖ హిమపర్వత మధ్యంలో లభించే ఏకాంత నిశ్శబ్దాన్ని అభిలషించే, ప్రేమించే. సాధకుల్లోని అరిషడ్వర్గ ఆసురీగణాల్ని అంతమొందించేది, ఆధ్యాత్మిక కేంద్రాలను జాగృతపరచి ఆత్మవైపు ప్రకాశాన్ని పరచే నిశ్శబ్దంలోని ప్రశాంతతే. గురువులు అప్పుడప్పుడూ ఏకాంతాన్ని ఆశ్రయిస్తూ వెళ్లమని శిష్యులకు సూచించేది- ఏకాంత నిశ్శబ్దం శిష్యుల్లోని అలజడులను ఉపశమింపజేసి సాధనకు మరింత ఆయత్తపరుస్తుందనే. శబ్దకాలుష్యం ప్రకృతిలోని నిశ్శబ్ద సౌందర్యాన్ని కలుషితం చేస్తుంది. వికృతం చేస్తుంది. ప్రశాంతతను భంగపరుస్తుంది.
'నిశ్శబ్దం ఒకరు సృష్టించింది కాదు. అది విశ్వాంతరాళంలోని సహజసిద్ధ స్థితి. అత్యంత అమూల్యమైన కొన్ని కొన్ని సహజత్వాలను యథాతథంగా ఉండనివ్వడమే లోకానికి కల్యాణ కారకం'.
ప్రాపంచికంగా ఆలోచించినా ప్రస్తుతం శబ్దకాలుష్యం ప్రపంచాన్ని కల్లోలపరుస్తోంది. అనారోగ్యాన్ని కలగజేస్తోంది. ముఖ్యంగా గర్భస్త శిశువుల్ని అస్వస్థతకు గురి చేయటమో, అసలుకే మోసం తేవడమో చేస్తోంది. మనం చేసే ఒక అనవసర శబ్దాన్ని చేయకుండా అదుపు చేసుకోగలిగితే... అలా కొన్ని వందలు, వేలు, లక్షల మంది ఆలోచించగలిగితే... ఆలోచిద్దాం!
- చక్కిలం విజయలక్ష్మి