ᐅవివేక దర్శనం
ᐅ'వివేక' దర్శనం
భారతదేశం ఏనాటికీ అంతరించదు. ఒకవేళ అంతరిస్తే, ప్రపంచంనుంచి ఆధ్యాత్మిక మాధుర్యం, నైతిక పరిపూర్ణత్వం అంతరించిపోతాయి. మతం చాటే సత్యంపట్ల ఆదరణ, ఆశయ, ఆదర్శ దీప్తిరేఖలు అస్తమిస్తాయి. వాటిస్థానంలో కామం, విశృంఖల విలాస జీవనం క్షుద్రదేవతలుగా ప్రజలను తమ గుప్పిట్లో బంధించి ఆట ఆడిస్తాయి. అటువంటి సమాజంలో ధనమే చీకటిపూజారిగా, మోసం, దగా, బలప్రయోగం, పోటీ క్రతువులుగా, మానవాత్మ బలిపశువుగా మారతాయి. అటువంటి సంకేతాలను మనం చూస్తూనే ఉన్నాం. శ్రమించే మానవాళి బాధలోని శక్తి అనంత మహిమాన్వితం. విద్వేష పాటవంకన్నా... ప్రేమ అనంత బల సంపన్నమైనది.
గతం మానవాళికి ఎంతో మేలు చేసింది. కొంత అపకారమూ జరిగింది. మంచిని స్వీకరించగలగాలి. భవిష్యత్ భారతావని ప్రాచీన భరతభూమి కన్నా ఎన్నో రెట్లు మహనీయమై పరిఢవిల్లి తీరుతుంది. గతం గొప్పదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. భవిష్యత్తు అంతకన్నా మహోజ్జ్వలంగా భాసిస్తుంది.
భారతదేశం శారీరక దారుఢ్యంతో కాకుండా, ఆత్మశక్తితోనే సమున్నత శిఖరాలు చేరుకొంటుంది. వినాశనం అనే పతాకంతో కాకుండా శాంతి ప్రేమలనే కేతనంతో, సంపద శక్తితో కాకుండా పారమార్థిక మహత్వంతోనే అభ్యుదయం సాధిస్తుంది.
రైతులు నాగళ్లతో దున్నే పొలాలనుంచి, మత్స్యకారుల, పారిశుద్ధ్య కార్మికుల పూరిళ్లనుంచి, దుకాణాలనుంచి, కర్మాగారాలనుంచి, విపణి వీధులనుంచి, అడవులు, తోటలు, పర్వతాలనుంచి నవ భారతావని ఆవిర్భవిస్తుంది. భారతావని అనే జాతీయ నౌక యుగాలుగా ఘన సంస్కృతీ నాగరికతలను మోసుకొని వెళ్తోంది. ప్రపంచాన్ని సుసంపన్నం చేసే అఖండ నిధులూ నిక్షేపాలతో జీవన సాగరంపై శతాబ్దాలుగా ప్రయాణి స్తోంది. అన్ని బాధల ఉత్తుంగ తరంగాలను దాటించి వేలాది భారతీయ ఆత్మల్ని అవతలి కాంతి తీరానికి చేర్చింది. కాని, నేడు ఆ ఓడకు చిల్లు పడింది. అది ఎవరి పొరపాటో, కారణమేమిటో తెలుసుకోవడం ముఖ్యం కాదు. ఆ ఓడలో మనమంతా ఉన్నప్పుడు ఏం చేస్తామో అదే ఇప్పుడు చేద్దాం. ఒకరికొకర్ని శాపనార్థాలు పెట్టుకోవడం, ఒకరితో ఒకరు పోట్లాటలకు దిగడం సమస్యకు పరిష్కారం చూపదు. అందరం కలిసి ఒక్కటై, ఓడకు పడిన చిల్లులను మూసివేయటానికి శాయశక్తులా ప్రయత్నించవద్దా? అందుకోసం మన రక్తాన్ని ధారపోద్దాం. మన ప్రయత్నం విఫలమైతే, మనమంతా మునిగి ప్రాణాలు కోల్పోతాం. వివేకానందుడు ఈ మాటలు చెప్పి శతాబ్దం దాటింది. కాని, పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది.
దారిద్య్రం, తిరోగమనం, వైఫల్యాలు, ఈతిబాధల రూపంలో, కాలదేవత వదిలి వెళ్లిన అవశేషాల వెనుక దాగిన జాతీయ జీవన అగ్నిశిఖ రగులుతోంది. ఈ జాతి జీవనం మతం, భాష మతం, భావం మతం. రాజకీయాలు, సమాజం, పురపాలక వ్యవస్థ- అన్నీ మతం నీడలోనే ప్రక్షాళితం కావాలి. లేకపోతే, మనది గొప్ప దేశం అని ఎంత అరిచినా- మిగిలేది శూన్యం.
ప్రపంచానికి ఆధ్యాత్మిక వైభవోజ్జ్వల కాంతిరేఖ కావాలి. ఆ వెలుగు భారతదేశంలోనే ఉంది. మంత్రశక్తులతో, పిడివాదాలతో జీవితాన్ని తీర్చిదిద్దే వెలుగు లేదు. ఆ వెలుగు నిజమైన మతంలోని దివ్యస్ఫూర్తి ప్రాభవంలో ఉంది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యంలో ఉంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఈనాటి వరకు భారతదేశం క్షేమంగానే ఉంది. ఇప్పుడు కాలం ఆసన్నమైంది. శ్లాఘనీయమైన ధైర్యసాహసాలు నేటి తరానికి ఉన్నాయి. సమాజాన్ని నడిపించే మహత్కార్యాలు చేయగలమన్న విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే మనం కలలు కనే నవభారతావని ఇప్పుడే ప్రత్యక్షం అవుతుంది.
భారతదేశం వేదభూమి. విజ్ఞాన భారతి. ఆరాధ్యజనని. ఈ దేశపు మట్టి అతి పవిత్రం. దేశానికి మేలు చేయడం మనం మనకు మేలు చేసుకోవడం వంటిదే. ఈ మట్టినుంచే స్వర్గం పల్లవిస్తుంది. అప్పుడే విశ్వమానవ కల్యాణం పరిమళిస్తుంది!
- కె.యజ్ఞన్న