ᐅఫాల్గుణం
ᐅఫాల్గుణం
పుబ్బ, ఉత్తర అనే నక్షత్రాలకే పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అని నామాంతరాలున్నాయి. వాటిలో ఉత్తర ఫల్గుణి బుద్ధి వికాసాన్ని, ధైర్యస్త్థెర్యాలను, నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్రవచనం. ఈ నక్షత్రంలో జన్మించిన ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు అర్జునుడు, బృహస్పతి. వీరికి 'ఫాల్గుణభవులు' అని పేరు. అర్జునుడు ధైర్యస్త్థెర్యాలతో 'విజయుడు'గా నిలిచాడు. ఇతడికి 'ఫల్గుణుడు' అనే పేరు ఈ నక్షత్రం వల్లనే ఏర్పడింది. బుద్ధికి ప్రధాన నిర్వచనంగా దేవతల గురువైన బృహస్పతిని చెబుతారు. అంతటి గొప్ప వ్యక్తి జన్మించిన ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి 'ఫాల్గుణమాసం' అని పేరువచ్చింది.
వాతావరణ ప్రభావంతో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడువారి పోయే కాలమిది. ఆశలన్నీ ఆవిరైపోయిన చోటే కొత్త అవకాశం పుడుతుందని నిరూపిస్తూ, కొత్త చిగుళ్ల రూపంలో ఆశలను, ఆత్మస్త్థెర్యాన్ని కలిగిస్తుందీ మాసం. సంవత్సరంలో చివరి రుతువైన శిశిరంలో చివరి మాసమిది. అయినా ఆ అంతం మరో కొత్త సంవత్సరం ఆరంభం కావడానికి నాంది అవుతుంది. శుక్ల పాడ్యమి నుంచి ద్వాదశి వరకు తొలి పన్నెండు రోజులూ లక్ష్మీసహిత నారాయణమూర్తిని పూజించాలని శాస్త్రవచనం. పన్నెండు రోజులూ పన్నెండు నెలలకు ప్రతీక. ఇలా పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం వస్తుందని నమ్మకం. దీనికి 'పయోవ్రతం' అని పేరు. ఈ పన్నెండు రోజులూ పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసంలో గోదానం, ధాన్యదానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి.
ఈ మాసంలో ప్రధానంగా పూజించాలని చెప్పే దేవత, వారణాసి(కాశీ)లో వెలసి ఉన్న డుం(ఠి)ఢి 'వినాయకుడు'. ఈయనను ఈ మాసంలో రెండు వేర్వేరు రోజుల్లో పూజిస్తారు. అవి శుక్లపంచమినాడు అవిఘ్నవ్రతం (విఘ్నాలు కలగకుండేటందుకు), శుక్ల చతుర్దశినాడు పుత్ర గణపతివ్రతం (సంతానాన్ని అపేక్షిస్తూ). శుక్లపక్ష ఏకాదశి 'ఆమలక్యైకాదశి' ఆ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరిఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషధగుణాలున్నాయి. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. అంత గొప్పతనం ఉన్న ఉసిరికి ఈ మాసంలో అంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఉంది. ఆశ్వయుజమాసం (ఆరు నెలల క్రితం)లో పుష్పించే ఈ పంట ఈ ఆరు మాసాల్లో పూర్తి పక్వదశకు వచ్చి సంపూర్ణమైన ఔషధ గుణాలను సంతరించుకుంటుంది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశికీ దీనికీ ముడి పెట్టారు పెద్దలు. అదీకాక, ఉసిరిచెట్టును విష్ణురూపంగా భావించడం తెలిసిందే.
శుక్లద్వాదశి: గోవింద ద్వాదశి అని దీనికి మరో పేరు. ఈ రోజు గోవింద నామస్మరణ చేస్తూ గంగానదిలో (కుదరనివారు ఇతర జల వనరుల వద్ద) స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే ఆరోగ్యప్రదమనీ అంటారు.
పూర్ణిమ: 'మహాఫల్గుణి' అని, 'డోలికా పూర్ణిమ' అని, 'హోలికా పూర్ణిమ' అనే పేర్లున్న రోజు ఇది. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని వూయలలో ఉంచి వూపుతారు. కాబట్టి దీనికి డోలికా పూర్ణిమ అని పేరు. ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం పాటిస్తారు. ఉత్తరహిందూ స్థానంలో రాక్షసపీడ తొలగిపోవడం కోసం 'హోళికా' అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు (బహుళ పాడ్యమి) వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందిస్తారు. ఉత్తరాదిన పౌర్ణమి మరునాటి నుంచీ నెల ప్రారంభంగా గణన చేస్తారు కొందరు. ఆ ప్రకారం చూస్తే ఈ రోజునుంచే వారికి వసంత రుతువు ప్రారంభం అయినట్లు లెక్క. దక్షిణాదిన దీనిని 'ఫంగుని' అని పిలుస్తారు. మధుర మీనాక్షిదేవికి, సుందరేశ్వర స్వామికి కల్యాణం జరిగిన రోజుగా ఇది ప్రసిద్ధం. అందుకే ఈ రోజున దక్షిణాది దేవాలయాల్లో కల్యాణవ్రతం జరుపుతారు. కాబట్టి 'కల్యాణపూర్ణిమ' అని వ్యవహరిస్తారు.
బహుళ అష్టమి: సీతాదేవి జన్మదినంగా పేర్కొంటారు. జనక మహారాజుకు భూమి దున్నుతుండగా సీత దొరికిన రోజుగా చెబుతారు.
అమావాస్య: ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు. అయినా దీన్ని 'కొత్త అమావాస్య' అని పిలుస్తారు. ఉత్తరాంధ్రలో ఈ రోజునే కొత్త నాగళ్లను ప్రారంభించి 'ఏరువాక' సాగుతారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్టి, 'కొత్త అమావాస్య' అని పిలుస్తారు.
ఈ రోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణ, పిండప్రదాన, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ఎందరో నమ్ముతారు.
- అయ్యగారి శ్రీనివాసరావు