ᐅలక్ష్యం
విజయాలు సాధించడానికి, కలలు సాకారం చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకుంటే చాలదు. ఆ లక్ష్యసాధనకు తగిన కృషి, పట్టుదల ఉండాలి. అది ఉన్నవాళ్లే కార్యసాధకులు, విజేతలు.
దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులను కాలినడకన అడవిలోకి తీసుకువెళ్ళి సకల విద్యలు నేర్పించాడు విశ్వామిత్రుడు. రాజకుమారులైనా విద్యార్జనకోసం గడ్డిమీద శయనింపజేశాడు.
కార్యసాధకులు తమ ఆత్మవిశ్వాసంపై ఆధారపడి శ్రద్ధాసక్తులతో కార్యసాధన చేస్తారు. అంతేకానీ ఉపకరణాల మీద ఆధారపడరు అంటాడు వాల్మీకి మహర్షి. కార్యసాధకుడికి పరికరాలు, సౌకర్యాలు ప్రధానం కాదు. దీక్ష, శ్రద్ధ చాలా ముఖ్యం.
జీవితంలోంచి జీవం దూరమైపోకుండా- వైఫల్యాలు, కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు ప్రయాణించే మనిషి అవలీలగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. కోపతాపాలకు దూరంగా ఉంటూ... మంచి ప్రణాళిక రూపొందించుకుని, కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారినే గెలుపు వరిస్తుంది. వాళ్లే లోకంలో కీర్తిమంతులవుతారు.
'సమస్యలు వస్తాయనే సంశయంతో అల్పులు కార్యాన్ని ఆరంభించరు. మధ్యములు ఆరంభించి సమస్యలు రాగానే ఆ కార్యాన్ని విడిచిపెడతారు. ఉత్తములు సమస్య వచ్చినప్పుడల్లా తన కర్మ అని ఎవరినో నిందించకుండా రెట్టించిన ఉత్సాహంతో కార్యాన్ని పూర్తిచేస్తారు' అంటాడు భర్తృహరి. కృషి, పరిశ్రమ, క్రమశిక్షణే విజయానికి పునాదులు.
మనిషికి తనలో ఉండే బద్ధకమే అతిపెద్ద శత్రువు. ఉన్నతమైన లక్ష్యమే అసలైన బంధువు. బద్ధకాన్ని విడనాడిన మనిషి అందరికీ ఆరాధ్యుడవుతాడు. అతనిలో మేధ ఎల్లవేళలా ప్రకాశిస్తూంటుంది.
నిజమైన కళాకారుడు నిరంతరం సాధనలో మునిగినట్లు... లక్ష్యాన్ని ఏర్పరచుకున్న క్షణంనుంచే ఎవరైనా పనితో మమేకం కావాలి. అప్పుడే విజయలక్ష్మి సొంతమవుతుంది.
లక్ష్యం మనసులో ఉదయించగానే అది నెరవేరదు. దానికోసం అహర్నిశలు శ్రమించాలి. మరో ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. అపజయాలు వస్తే కుంగిపోయేవాళ్లు, ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని మార్చుకునేవాళ్లు దేన్నీ సాధించలేరు.
'ఆకు రాలిందని ఏడుస్తూ కూర్చున్నవాడు వసంతానికి స్వాగతం పలకలేడు' అంటారు కాళోజి.
గతాన్ని మరిచిపోయి, వర్తమానంలో జీవిస్తూ, విమర్శలను పట్టించుకోకుండా కృషిచేస్తూ, ముందుకు సాగే మనిషికి లక్ష్యం తప్పకుండా సిద్ధిస్తుంది.
ఎన్నో అద్భుతాలు సాధించి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వాళ్లందరూ నిరాడంబర జీవితం గడిపి, నిజాయతీగా విజేతలై అందరి మన్ననలు పొంది విశ్వఖ్యాతిని ఆర్జించినవారే.
ఏ ఫలాపేక్షా లేకుండా పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించాడు వ్యాసమహర్షి. పట్టుదలతో సృష్టికి ప్రతిసృష్టి చేసి తిరుగులేని పురుషప్రయత్నం ఎంత గొప్పదో నిరూపించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి పీఠమలంకరించి ఆచంద్రతారార్కమైన కీర్తిని గడించాడు. బోయవాడైన వాల్మీకి లోకానికి రామాయణ మహా కావ్యం అందించి మహాకవిగా పేరుపొందాడు. అందుకే ఉన్నతమైన లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఎవరైనా లోక విఖ్యాతులవుతారు.
- విశ్వనాథ రమ