ᐅఅపరాజితుడు
'వినరో భాగ్యము విష్ణు కథ...' అంటూ భక్తులందరికీ సూచించాడు తాళ్లపాక అన్నమయ. విష్ణువు దేవాధి దేవుడు. దైవత్వానికి మరో పేరు శ్రీమహావిష్ణువు. విష్ణుసహస్రనామం ప్రకారం విష్ణువు ఆత్మలన్నింటికీ అతీతమైన పరమాత్మ. ఈశ్వరులందరికీ విష్ణువే పరమేశ్వరుడు. విశ్వాలనన్నింటినీ సృజించేవాడు. భూత వర్తమాన భవిష్యత్తులు లేనివాడు. కాలానికి (సమయాలకు) అతీతుడని విష్ణు సహస్రనామం వల్ల తెలుస్తోంది. పురాణాలను అనుసరించి విష్ణువు నీలమేఘ శ్యాముడు, చతుర్భుజుడు. శంకు చక్ర గదాధారి! మానవుల వూహకు, దృష్టికి భాషకు అందని రూపం తనదని విశ్వరూపయోగంలో పరమాత్మ వివరిస్తాడు. శివకేశవులిద్దరికీ భేదం లేదని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. విష్ణువే దశావతారలకు కర్త కర్మ క్రియ! మనకు ఉన్న చిరుజ్ఞానాన్ని అనుసరించి నాలుగు యుగాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నాం. విష్ణు సహస్రనామంలో విష్ణువును సహస్రకోటి యుగధారిణే... అని సంబోధిస్తారు. సహస్రకోటి యుగాల్లోని అవతారాల జ్ఞానం సామాన్యులమైన మనకు తెలియదు. ఆ దేవాధి దేవుని గురించి మనకు తెలిసింది సముద్రంలో నీటిబొట్టు చందమే!
సూర్యునిలోని అంతర్‌జ్యోతి విష్ణువేనని రుగ్వేదం తెలుపుతోంది. దిక్పాలకులను, ఇంద్రుని నియంత్రించేవాడు కనుక రుగ్వేదంలో విష్ణువును ఇంద్ర విష్ణువుగా వర్ణించారు. వ్యాసుడు వేదాలను సంపుటీకరణం చేయక మునుపే యస్కనిరుక్త అనే మహర్షులు విష్ణువును విశ్వంలోని అన్ని దిశలకు వెళ్లగలిగే (విష్ణు విశతే) శక్తిగలవాడిగా వర్ణించారు. ఆ రూపానికి అవధులు లేవని వారు తెలిపారు. విశ్వాంతరాళాల్లోని అన్ని సూర్యులను, లోకాలను, వెలుగులను, చీకట్లను, సర్వజీవరాశులను వైకుంఠం రాజధానిగా పాలించే విష్ణువు ఆదిదేవుడు అదృశ్యుడు! విష్ణువు ఒంటరి. ఆ పరమాత్మను నియంత్రించేవారెవరూ లేరు. లోక పరిపాలనలో ఆయనకు సహాయకులూ లేరు. ఎక్కడ అవధులు లేని ఆనందం ఉందో నాశనం లేని వ్యవస్థ ఉందో అక్కడ అపరాజితుడు ఉంటాడు. మానసిక ఆనందం కోసం సాధనచేసి ఆనందంగా జీవించే వారందరిలో విష్ణువు ఉంటాడని పురుషసూక్తం తెలుపుతోంది. ఆ దేవదేవుడు జ్ఞానానికి పరాకాష్ఠ. విష్ణువు శక్తి హద్దులు లేనిది. మిత్ర వరుణలాంటి మరుత్తుల ఊహకు అందని అందం ఆ దైవానిది. అనంతకోటి (అంతంలేని) సంపదలు గలవాడు.
విష్ణువు సనాతనుడు. ఇప్పుడు ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఎవరివల్లా జయించతరం కానివాడు. కాళిదాసు రాసిన హరివంశంలో విష్ణువు గురించిన విచిత్ర ప్రస్తావన ఉంది. సాధించగలిగితే అంతులేకుండా లభిస్తాడని కాళిదాసు అంటాడు. అంటే దైవం పదార్థమా ప్రాణమా తెలియని స్థితి అది! శ్వాసించడు. అనిమేషుడు (రెప్పలు వాల్చనివాడు)! పగలు రాత్రి లేని కాలాతీతుడు. ఇంతెందుకూ- హరివంశంలో కాళిదాసు చెప్పినట్లు అనిర్వచనీయుడు ఆ పరమాత్మ! విష్ణువు సర్వాంతర్యామే! వ్యాపించి ఉంటాడు. కాని ఎక్కడో... ఎవరూ కానలేని చేరలేని స్థలంలో కేంద్రీకృతమై ఉన్నాడు. సూర్యుని నుంచి వెలుతురు ఎల్లెడలా వ్యాపించి ఉన్నా, కేంద్రీకృతమైన సూర్యశక్తి ఆ మండలంలోనే ఉంది. ఆ స్థలం ఇతరులు చేరలేనిది. కళ్లతో చూడలేనిది. అందుకే విష్ణువును సూర్యనారాయణుడని సంబోధిస్తారు. విష్ణువు ఒంటరివాడే అయినా, ఆయన చుట్టూ మాయ ఆవహించిఉంది. ఆ మాయకు స్త్రీత్వం ఆపాదించారు. ఎప్పుడూ వెన్నంటి ఉండే ఆ మాయకు మరో రూపమే శ్రీలక్ష్మి! దిక్పాలకులకు అధినేత అయిన ఇంద్రుని రక్షించేవాడు, రక్షించాల్సిన వాడు శ్రీమహావిష్ణువు! రక్షణ అవసరమైన ఇంద్రుడు జయింపగలవాడు. అందుకే హిరణ్యకశపుడి కాలం నుంచి రావణుడి వరకూ ఇంద్రుణ్ని జయించగలిగారు. అలాంటి రాక్షసులను హరించి ఇంద్రుని రక్షించినవాడు హరి! ధర్మానికీ అధర్మానికీ విదుత్తముడైన విష్ణువును కీర్తించాలన్నది అన్నమాచార్యుల మాట. 'నీతో నాతో నారదునితో' కీర్తింపగలిగిన వాడైన శ్రీమహావిష్ణువు అరవిందాక్షుడట, గరుడధ్వజుడట! ఇంతెందుకూ... కరణం కారణం కర్తా ఆ శ్రీమహావిష్ణువే.
- అప్పరుసు రమాకాంతరావు