ᐅక్షమాగుణం
క్షమ అంటే ఓర్పు. ఇతరుల వల్లా బాహ్యప్రపంచం వల్లా కలిగిన కష్టనష్టాలు ద్వేషభావం లేకుండా సహించగల శక్తి.
ఇది సజ్జనుల లక్షణం మాత్రమే కాదు- లౌకిక జీవితంలో సుఖశాంతులకు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతికీ సామాన్య మానవుడికి ఎంతగానో ఉపకరించే గుణం, ఆచరణ యోగ్యం. కష్టసాధ్యమేగాని అసాధ్యం కాదు. క్షమాగుణం వికసించిన వ్యక్తిత్వానికీ, పరిణతికీ నిదర్శనం. క్రోధానికి, క్షమాగుణం సరిగ్గా వ్యతిరేకం. దానికిది విరుగుడు.
అభిమన్యుడికీ, విరాటరాజు కూతురు ఉత్తరకూ కలిగిన సంతానం పరీక్షిత్తు. కలియుగారంభంలో, కురువంశం ప్రతిష్ఠ నిలబెట్టేలా అరవై సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యం చేసిన ధర్మప్రభువు. అంతటివాడూ అకస్మాత్తుగా 'నేటికి ఏడు రోజుల్లోగా పాముకాటువల్ల చనిపోతావు' అని శాపానికి గురయ్యాడు.
కారణం? ఒకనాడు పరీక్షిత్తు వేటకు వెళ్లాడు. ఒక లేడిని బాణంతో కొట్టాడు. గాయపడిన లేడి పారిపోయింది. రాజు దాని వెనక పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళిన తరవాత, అక్కడ తపస్సు చేసుకొంటున్న శమీకుడనే ముని కనిపించాడు. 'మునీశ్వరా! ఇటుగా వచ్చిన లేడి ఎటు పారిపోయిందో చెప్పగలరా?' అని అడిగాడు రాజు. శమీకుడు కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన బదులివ్వలేదు. అలసి సొలసి ఉన్న రాజుకు చాలా కోపం వచ్చింది. దగ్గరే పడిఉన్న ఒక చచ్చిన పామును తన వింటి కొప్పుతో ఎత్తి, ముని మెడలో వేశాడు. అయినా శమీకుడిలో ఉలుకూ పలుకూ లేదు. రాజు తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఈ సంఘటన చూసిన కృశుడనే ముని వెళ్ళి ఈ విషయాన్ని శమీకుడి కుమారుడు, మహా తపస్వీ అయిన శృంగి మునికి చెప్పాడు.
ఎక్కడో కీకారణ్యంలో ఎవరి జోలికీ పోకుండా, కేవలం ఆవు పొదుగుల మీద మిగిలిపోయే పాల నురగను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ, మౌనంగా తపస్సు చేసుకొంటున్న తన తండ్రిని రాజు అలా నిష్కారణంగా అవమానించటం శృంగి సహించలేకపోయాడు. 'నేటినుంచీ ఏడు రోజుల్లో తక్షకుడనే సర్పం కాటుకు గురై పరీక్షిత్తు యమలోకం చేరుగాక!' అని శాపం పెట్టాడు. శపించిన తరవాతే తండ్రి దగ్గరికి వెళ్లాడు. ధ్యానం వీడిన తరవాత ఆయనకు శృంగి శాపం విషయం తెలిసింది. ఆయన ఎంతో విచారించాడు. కొడుకును మందలించాడు. 'నాయనా, నీలాంటి తపస్వికి క్రోధం కూడదు. దానివల్ల తపం చెడిపోతుంది. ధర్మకార్యాలకు ఆటంకం కలుగుతుంది. క్షమాగుణం లేని తపస్వి తపమూ, మదించినవాడి ధనమూ, ధర్మబాహ్యుడైన రాజు అధికారం చిల్లికుండలో నీటిలాగా నష్టమైపోతాయి. కేవలం క్షమాగుణం లేని కారణంగా, చూడు ఎంత తప్పు చేశావో! తెలిసీ తెలియకుండా, పరీక్షిత్తులాంటి ధర్మవర్తనుడైన మహారాజును శపించి, దేశానికే పెద్ద అవాంతరం తెచ్చిపెట్టావు!' అన్నాడు. వెంటనే, పరీక్షిత్తుకు జరిగిన విషయం తెలుపుతూ, తక్షకుడినుంచి ప్రాణరక్షణకు తగిన సన్నాహాలు చేసుకోవాల్సిందిగా సందేశం పంపాడు.
క్షమాగుణం విశిష్టతను ప్రపంచంలో ముఖ్యమైన మతాలన్నీ ముక్తకంఠంతో నొక్కి చెప్పాయి. బుద్ధుడు చెప్పిన అహింసలో- అపకారికి ఉపకారం నెపమెన్నక చేయటం భాగమే. జైన మత ప్రవక్త మహావీరుడు 'నీ పట్ల అపరాధం చేసినవాడిని నువ్వు శిక్షించాలనో, హింసించాలనో వధించాలనో భావించవద్దు. అలా చేస్తే నువ్వు శిక్షించేదీ, హింసించేదీ, వధించేదీ నిన్నే!' అంటాడు. మహమ్మదీయుల అల్లాకు ఉన్న అతి విశిష్టమైన దైవీగుణం- తన శరణు కోరిన భక్తుల అపరాధాలను క్షమించి కాపాడే క్షమాగుణమే. ఏసుక్రీస్తు తనను సిలువ వేసి హింసించిన వారిపట్ల ఈ క్షమాగుణాన్నే ఆదర్శప్రాయంగా ప్రదర్శించాడు. 'తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు చేస్తున్నదేమిటో వీళ్లకే తెలియదు!' అని ప్రార్థిస్తాడు. క్షమాగుణం మానవ సంబంధాలను దృఢపరుస్తుంది. చిటికెడు క్షమ, గంపెడు పగను చల్లార్చటమే కాదు- ప్రేమగా మారుస్తుంది. మన సద్గుణాలు మరొకరి సుఖంకోసం కాదు. అవి మన జీవితాలనూ ఆనందమయం చేస్తాయి. 'నేను తప్పు చేశాను' అని తెలుసుకొని క్షమాపణ కోరగలగటం నిర్మల హృదయుడి లక్షణం. అలా కోరినా, కోరకపోయినా ఇతరుల తప్పులను ఉపేక్ష చేసి మరచిపోగలగటంలో మరింత ఔన్నత్యం ఉన్నది.
అపారమైన మేధాశక్తీ, ఘటనాఘటన సమర్థతా, సిరిసంపదలూ, కీర్తి ప్రతిష్ఠలూ అన్నీ ఉన్నా- ఆ ఒక్క క్షమా గుణం కొరవడితే, భూమిమీదే నరకం చూడవచ్చు, సాటివారికి చూపించవచ్చు. ఆ ఒక్క గుణం అలవరచుకొంటే అతి సామాన్యుడు కూడా ప్రశాంతమైన, సుఖమయమైన జీవితం గడపవచ్చు.
- ఎం.హనుమంతరావు