ᐅనిగ్రహ విగ్రహం



ᐅనిగ్రహ విగ్రహం 

ఆధ్యాత్మిక సాధకులకు సమస్యంతా నిగ్రహంతోనే. 
మనసు కళ్లెంలేని గుర్రం. మనిషి ఆశల రౌతు. గుర్రాన్ని అదిమి పెట్టి పట్టుకుని అదుపులోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా అది చంచలంగా ఉంటూ, మనల్ని ఏ బురద గుంటలోకో విసిరేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది.
పైగా, బుద్ధి- సందేహాలకు నిలయం. 
అసలు- దేవుడనే వాడున్నాడా, దేవుణ్ని మనిషి సృష్టించాడా, మనిషిని దేవుడు సృష్టించాడా? దేవుడి రూపం ఏమిటి, లక్షణాలు ఏమిటి, శక్తి సామర్థ్యాలేమిటి? పూజలు చేస్తేనే కరుణిస్తాడా, లేకపోతే అనుగ్రహించడా? అన్నింటికీ నువ్వే దిక్కని దేవుడి మీద ఆధారపడకుండా మనకున్న తెలివి తేటలతో, శక్తి సామర్థ్యాలతో బతుకును పండించుకోలేమా?

బుద్ధినిండా ఇలాంటి ప్రశ్నలే. 
వీటితో సతమతమవుతూ మనుషులు పూర్తి విశ్వాసులుగా జీవించలేకపోతున్నారు. ఈ విధంగా చూస్తే ఆస్తిక వేషధారుల్లో అధికులు నాస్తికులేమోననే సందేహం కలుగుతుంది.

రుషుల కాలంలో- ఆశ్రమ జీవితం క్రమశిక్షణాయుతంగా, రాజు-పేద తేడా లేకుండా ఒక చక్కని ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని ప్రతి విద్యార్థికీ సమకూర్చగలిగేది. అందువల్ల నిగ్రహం కోసం పాట్లు పడాల్సిన అవసరం సాధారణంగా ఉండేది కాదు.

భారతీయ ధర్మంలోనే, ఆ జీవిత సరళిలోనే అంతర్లీనంగా ఒక స్థితప్రజ్ఞత ఉంది. దానివల్ల సహజ నిగ్రహం దాదాపు ఆ సాధకులందరికీ సాధ్యపడేది.

కాలవాహినిలో జనసందోహాలు పెరిగేకొద్దీ- ధర్మనిష్ఠ లోపించడంవల్ల అరిషడ్వర్గాలు మనిషిని తమ అధీనంలో ఉంచుకోవటం ఎ క్కువైంది. తపోనిష్ఠకు అనేక ఆటంకాలు ఏర్పడుతూవచ్చాయి. సునాయాసంగా 'అంతర్యామి'ని సమాధిస్థితిలో చూడగలిగిన ము నులు, రుషుల స్థాయినుంచి తర వాతి తరాలవారు దిగజారిపోయారు. అప్పుడు వారిలో నిగ్రహాన్ని నిలబెట్టడానికి విగ్రహాల అవసరం కలిగింది. ఆ విధంగా విగ్రహ దేవతల్లో అధికం మానవ నిర్మితాలే.

మనిషి శరీరమే ఒక విగ్రహం. 'రామో విగ్రహవాన్ ధర్మః' అని కదా అన్నారు. కానీ, మనలో అధికులం 'విగ్రహవాన్ అధర్మః' గానే జీవిస్తున్నాం. అందువల్ల మానవ విగ్రహాల్లో 'అంతర్యామి' లోవెలుగుగానే ఉండిపోతున్నాడు.

నిజానికి మనం విగ్రహాలనుంచి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సందేశాల పట్ల అవగాహన లేకుండా ఉన్నాం. కోట్లాది ఆశాపరుల ప్రార్థనలు, కోరికలు వింటున్నాం. ఏ విగ్రహమూ నిగ్రహం కోల్పోవటం లేదు. కరిగి శిలాజంగా మారిపోవటంలేదు. మనం కూడా, మనకెదురయ్యే అనేక జీవన సమస్యల పట్ల విగ్రహంలాగానే నిగ్రహంగా ఉండాలి. సుఖం, దుఃఖం పట్ల నిరాసక్తంగా ఉండాలి. అలాంటి స్థితప్రజ్ఞత అలవరచుకొమ్మని ప్రతి విగ్రహమూ తమకు మొక్కే భక్తులకు మౌనసందేశమిస్తోంది. 
వేదాలు విగ్రహ దేవతలను కొలవమని ఎక్కడా చెప్పలేదు. అంతటా అన్నిటా ఉన్న పరమాత్మను విశ్వరూపుడని చెబుతూ ప్రకృతిని ఆరాధించి పూజించమన్నాయి. అదే మన కర్తవ్యం!

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్