ᐅవిశ్వవిభుని ప్రేమ
ఉన్నతమైన ఆలోచనల్ని, ఆశయాల్ని దరిచేర్చుకొన్నవారే గొప్పవారు. అందరి మంచితోనూ అందరి ఆనందం ఉందని గ్రహించినవారే నిజమైన శ్రీమంతులు. అశాశ్వతమైనవేవో, శాశ్వతమైనవేవో, భగవంతునికి ఇష్టమైనవేవో వీరు గ్రహించగలరు. వారి జీవితాల్లో ఆధ్యాత్మిక అందాలు విరబూస్తాయి. ఇలాంటి మహావ్యక్తుల వల్లనే సామరస్య భావమాధుర్యాలు జీవం పోసుకొంటాయని లోకహితైషుల ఉద్బోధ.
ప్రపంచంలో విద్యాపారంగతులు ఉంటారు. విజ్ఞానఖనులూ ఉంటారు. కాని 'మానవప్రేమ'ను గ్రహించి ఆచరణలో పెట్టగలిగేవారికోసం అన్వేషించవలసి వస్తోంది. మనం వేరు, వారు వేరు అని మానవుల మధ్య అడ్డుగోడలు కట్టేవారు కనిపిస్తారు. వారి సంకుచిత ధోరణుల ఇంపైన మాటలు ఆసక్తిగా వినేవారూ ఉన్నారు. ఫలితంగా ధర్మేతరశక్తులు తలెత్తుతున్నాయని శాంతికాముకుల ఆవేదన. సాటి మనుషుల్ని ప్రేమించడం, కష్టకాలంలో వారిని ఆదుకోవడం, మృదుభాషణం- ఇవన్నీ అశాశ్వతమైన వజ్రవైఢూర్యాలకన్నా విలువైనవనే మహాత్ముల ప్రబోధాల్ని ఆచరించడంలో విఫలమవుతున్నారు మనుషులు. తనను ఆరాధించేవారికన్నా, బక్కబతుకుల ఆర్తులను ఆదరించేవారినే భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడని తత్వవేత్తల అమృతవాక్కు. ఇదే, మతాల పవిత్ర భావాలకు జీవవాయువు. అందువల్లనే హృదయంలో మానవత్వం నిద్రపోతే దైవత్వాన్ని దూరంగా విసిరేసినట్లని మహర్షులు అన్నారు.
గతంలో జరిగిన కథ ఒకటి ఈ సందర్భంగా పరిశీలించదగింది. ఆ ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. పేరు స్వామిదాసు. రాత్రి ఇంట్లో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి ఏదో అలికిడికి మెలకువ వచ్చింది. ఏదో తేజఃపుంజం ఎగిరివచ్చి ఆ ఇంట్లో పడినట్లుంది. లేచి కూర్చున్నాడు. అతడి పక్కనే ఒక దేవదూత కూర్చొని పుస్తకంలో ఏదో రాసుకొంటున్నాడు. 'స్వామీ! తమరెవరో ఏమి రాస్తున్నారో, తెలుసుకోవచ్చా?' వినయంగా అడిగాడు దేవదూతను స్వామిదాసు. తాను దేవదూతనని, దేవుని ప్రేమకు పాత్రులైనవారి పేర్లు రాసుకొంటున్నానని సమాధానమిచ్చాడు దేవదూత. 'అందులో నా పేరుందా?' అడగడం భావ్యం కాదేమో అని సంకోచిస్తూనే స్వామిదాసు అడిగాడు. దేవదూత సమాధానమివ్వలేదు. అదృశ్యమయ్యాడు. అంతా వింతగా ఉంది. నా పేరు ఎందుకుంటుంది? దేవునికోసం నేనేమైనా ఎప్పుడైనా చేసిఉంటేకదా! సమాధానపడి పడుకొన్నాడు స్వామిదాసు. తెల్లారింది. రాత్రి జరిగింది ఏమిటో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న ఏ ఆలోచనా అతనికిలేదు. మళ్లీ రెండురోజుల్లో అక్కడే ప్రత్యక్షమయ్యాడు దేవదూత. అతనిచేతిలో పుస్తకముంది. అందులో దేవుని ప్రేమకు పాత్రులైనవారి పేర్లున్నాయి. చూస్తే, మొదటిపేరు స్వామిదాసుదే. స్వామిదాసు గుండె పులకించలేదు ఆనందంతో. పైగా తన పేరెందుకుందో ఆశ్చర్యం! 'నా తల్లిదండ్రులు నాకు నామకరణం చేశారేకాని దేవుడిపై సేవానిరతి నాలో లేదు. బాహ్యాచారాలు ఏవీ నేను పాటించలేదు. నియమనిష్ఠలతో పూజలు చేయలేదు...' పరిపూర్ణ చిత్తశుద్ధి తనలో తొణికిసలాడుతూంటే స్వామిదాసు దేవదూతతో అన్నాడు. దేవదూత చిరునవ్వుతో- 'నీవు సాటి మనుషుల్ని ప్రేమించావు కదా! కష్టసుఖాల్లో వారిమధ్య ఉన్నావు కదా! శక్తివంచన లేని సహాయం మానవాభ్యుదయం కోసం అందించడమే నీ జీవిత లక్ష్యమైంది కదా! నీ మనసు పునీతమైంది. నీవనుకొన్నట్లు దేవుడికి నీ సేవలవసరం లేదు. సేవలే అవసరమైతే చేయడానికి మేమంతా ఉన్నాం కదా! సర్వజనుల సుఖసంతోషాలు కోరి, ఏనాడూ ఉపకారం ఆశించని నీ సేవ అభినందనార్హమైంది... విశ్వప్రేమ తపస్వివి నీవు. నరులంతా నీ దృష్టిలో సమానం. దేవుని ప్రేమించడమంటే ఇదే. అందుకే ఆ విశ్వలోక ప్రభువు ప్రేమకు పాత్రుడివయ్యావు'- అని చెప్పి దేవదూత అదృశ్యమయ్యాడు.
ఈ కథ కల్పితమే కావచ్చు. తాత్విక ఔన్నత్యం కలిగిన ఈ కథ అందించే సందేశం అద్భుతమైంది. కథ మానవీయ విలువలకు భాష్యం చెబుతోంది. జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని బోధిస్తోంది. లోకప్రేమను చూడలేని అంధత్వం కారుణ్య చికిత్సద్వారా నివారణ అవుతుందనే అమృతభావాన్ని ఆవిష్కరిస్తోంది.
మతం అవసరమే కాని- పరస్పర ప్రేమ, సత్ప్రవర్తన, స్పందించే మనసు, శాంతిపూరిత జీవన సౌందర్యం... మరింత అవసరం. ఒక ప్రాణికి ఉపకారం చేస్తే, అది సాక్షాత్తు దైవసేవే. సాటి నరుల్లో ప్రేమ పల్లవించేలా నిజజీవితంలో అనుక్షణం సద్భావనల్ని ఆచరించి, ధరిత్రిని సుందరంగా నిలిపి భవిష్యత్తరాలకు అందించినప్పుడే మచ్చలేని విశ్వప్రగతి మనం సాధించినట్లు. దేవుని ప్రేమకు పాత్రులమైనట్లు.
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా