ᐅఅందుబాటులోనే ఆత్మజ్ఞానం



అందుబాటులోనే ఆత్మజ్ఞానం 

'తెలుసు' అనుకోవడం వేరు. నిజంగా తెలియడం వేరు. ఏమీ తెలియనివారు- 'తనకే అన్నీ తెలుసు' అనుకుంటారు. ఏ ఒక్క విషయమైనా తెలిస్తే అప్పుడు- తనకు అంతవరకూ తెలిసినది ఏదీ లేదని, తెలుసుకోవలసింది ఎంతో ఉందని గుర్తిస్తారు. దీన్నే స్పృహ అంటారు. ఆ స్పృహలోకి వచ్చినవారు. ఎరుక కల(వాస్తవం తెలిసిన)వారు కావాలి.
ప్రాపంచికమైన మోహాలు, ఆశలు మనల్ని అడుగడుగునా లోభానికి గురి చేస్తుంటాయి. సుఖాలుగా, ఆనందాలుగా భావి(భ్రమి)ంచి వాటి మత్తులో ఓలలాడుతూ అవే శాశ్వతం అనుకుంటూ ఎందరో ఆ భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. ఆ పరంపరలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆపదలు ఏవి కలిగినా 'ఖ(క)ర్మ' అనే ఒక్కపదం ఉపయోగించి తప్పించుకోజూస్తారు. అది ఆత్మవంచన అని తెలిసినా పట్టించుకోరు. ఇంత జరుగుతున్నా వాటి మూలాలు తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించరు. తనకు ఏది కలిగితే దానిలోనే ఆనందం ఉందని, అదే భగవద్దత్తమని గ్రహించక, ఇంకా ఏదో... ఎక్కడో ఉందనుకుని ఎక్కడెక్కడో దేనికోసమో వెతుకులాడుతూ ఉంటారు. అలాంటివారు 'బంధితులు' అనిపించుకుంటారు. సృష్టిలో ఏదైనా భగవద్దత్తమైనదే, అందువల్ల తనకు కలిగిన ఇదే భగవత్ప్రసాదం- అని భావించి ఆనందించగలిగేవారు 'యోచనులు' అనిపించుకుంటారు. అలాంటివారే సృష్టిలోని వాస్తవాలను, ప్రకృతిలోని అమరికలు, అణువు మొదలు విశ్వం వరకు ఉండేవాటి ఉనికి తదితరాలన్నింటినీ పరిశీలిస్తూంటారు. ఆ పరిశీలనలో అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి. వాటికి సరైన సమాధానం చెప్పగలిగేదే నిజమైన విద్య.(విత్=తెలుసుకొనుట, యా=దేనికి=దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడమే విద్య) పై వాటిని తెలుసుకోవడానికి సాధారణ విద్య మాత్రం సరిపోదు. ఆత్మజ్ఞానం కావాలి. అది తెలియజెప్పడానికి సాధారణ గురువు సరిపోడు. 'యోగి' అయి ఉండాలి.

పండితులు, జ్ఞానులు, తపస్సంపన్నులు లాంటి వారెందరో ఉంటారు. పండితుడికి పాండిత్యం ఉంటుంది. కానీ జీవితంలోని నిమ్నోన్నతాలను తట్టుకునే స్థితి లేకపోవచ్చు. జ్ఞానులకు జ్ఞానం ఉన్నా అరిషడ్వర్గాలకు అతీతులు కాకపోవచ్చు. తపస్సంపన్నులు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే ఆ క్రియకు పూనుకొంటారు. అంటే... వాంఛలకు అతీతులు కారు. యోగి మాత్రం అలా కాదు. అన్నింటికీ అతీతుడు. మనశ్శరీరాలు రెండూ తాను కాదని తెలుసుకున్నవాడు. వాటిమీద మోహభావం వీడి నిర్మలత్వంతో, నిరహంకారంతో ఉండేవాడు. ఆత్మ, పరమాత్మ- రెండు తత్వాలనూ తెలిసిన వాడు. వాటి మధ్య భేదం, సంబంధం సమగ్రంగా తెలిసినవాడు. కాబట్టే మోహానికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్కలాగే ఉంటాడు. సమస్థితి, సంయమనం అతడి తత్వం. అతడు ఆత్మజ్ఞానం గురించి ఎరుకపరచే విధానమూ భిన్నంగా ఉంటుంది. భావగర్భితమైన, తార్కికమైన దృష్టాంతాలతో విషయాన్ని తెలియజేస్తాడు. శిష్యుడికి సహేతుకంగా అర్థం అయ్యేటట్లు బోధిస్తాడు. ఆ రకమైన గురుశిష్యుల సంబంధసారమే ఉపనిషత్తులు. (ఉప-ని-సత్- గురుని సమీపంలో శిష్యునిచే లెస్సగా పొందదగినది). ఆ బోధనలో ఆత్మజ్ఞానంతో పాటు, అనుభవసారం నిండి ఉంటుంది. 'నీవు చూస్తున్న ఈ దృక్ప్రపంచం సత్యమని భావించకు. అలా అయితే బంధితుడవవుతావు. దృశ్యాన్ని మిథ్యగా తలచు. ముక్తుడవవుతావు' అని బోధిస్తాడు.

జాబాలి, మైత్రేయుడు, దక్షిణామూర్తి, శరభుడు, వాసుదేవుడు, ముద్గలుడు, శాండిల్యుడు, యాజ్ఞవల్క్యుడు, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు మొదలైన ఎందరో యోగులు తమ అనుభవసారాన్ని రంగరించి చెప్పిన విషయాలు ఆయా వ్యక్తుల పేర్లతోనే ఉపనిషత్తులుగా ప్రసిద్ధి పొందాయి. వాటిని చదవడంవల్ల దుస్సహమైన జన్మ, జరా, బంధనాది దుఃఖాలు శిథిలమైపోతాయి. తద్వారా పరమానంద ప్రాప్తిని కలిగించే ముక్తిని ప్రసాదిస్తాయి. వాటిని చదవడానికి అవకాశం లేనివారు చింతించవలసిన పని లేదు. అలాంటివారి కోసమే ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని 'భగవద్గీత'గా బోధించాడు శ్రీకృష్ణభగవానుడు. దాన్ని చదివినా ఉపనిషత్తులు చదివినంత జ్ఞానం కలుగుతుంది. ఆ భగవద్గీత సారాంశం ఒక్కమాటలో చెప్పాలంటే- 'శరీరం అనుభవించే భోగత్యాగాలు అశాశ్వతమైనవి. ఆ శరీరంతోనే సమసిసోతాయి. అందువలన శాశ్వతమైనది తానుగాని, తన శరీరంగాని కాదని, నిత్యమైనది ఆత్మే అని తెలుసుకున్నవారే ఎరుకగలవారు. అలాంటివారిని ఏ అనుభవాలూ బాధించవు, బంధించవు. వారే ముక్తులు!

- అయ్యగారి శ్రీనివాసరావు