ᐅమధు విషాదం
ᐅమధు విషాదం
విషాదం కొన్నిసార్లు అందంగా ఉంటుంది. మధురంగా ఉంటుంది. వాల్మీకి విషాదంతోనే మధురమైన రామాయణం ఉద్భవించింది. వ్యాస మహర్షి విషాద భావం కారణంగానే భాగవతం లోకానికి అందింది. అర్జున విషాద యోగమే భగవద్గీతకు నాంది పలికింది. ఇక ప్రేమికుల సంగతి చెప్పనే అక్కర్లేదు. బాధవాళ్లకు మధురంగానే ఉంటుంది. విషాదం బాధే అనుకుంటే ఇక కావలసిందేముంది? బాధే మధురం కదా!
నవ రసాల్లో కారం, చేదు కూడా ఉన్నట్టుగానే మనసు ఉత్పన్నంచేసే భావాల్లో విషాదమూ ఒకటి. తమాషా ఏమిటంటే, మనసు ఉత్పన్నం చేసినా ఆ మనసునే అది బాధలో ముంచెత్తుతుంది. అదే... విషాదంలో! కానీ అసలు విషాదం ఏమిటంటే, విషాదం మనిషికి బాధే. అంటే మనసుకు. నలిబిలి చేసే తీవ్రభావం. అదృష్టం ఏమిటంటే, ఆ విషాదం దాని పుట్టుపూర్వోత్తరాలు మన చేతుల్లోనివే. మనం పెంచి పోషించినవే. అంతకంటే ముఖ్యంగా విషాదం మనం నాటిన విత్తే. పెరిగి పెద్దయి, విస్తృతమై, ఊడలు దిగాక ఏదైనా దాని స్వేచ్ఛ కొద్దీ వెళ్తుందేమోగానీ బీజప్రాయం నుంచి రెక్కలు వచ్చేదాకా మన పెంపకంలోని బిడ్డే. పిల్లలు వారి ప్రవర్తన ద్వారా మనను బాధ పెడుతున్నారంటే, విషాదంలో ముంచేస్తున్నారంటే- ఆ పిల్లలు మనం పెంచినవాళ్లే. మన ప్రవర్తన, మనం కల్పించిన పరిసరాలు, పరిస్థితులు... అన్నీ. చాలా వరకు మన జీవన సరళికి ప్రతిబింబాలు వాళ్ళు. మన గతానికి నకళ్లు వాళ్లు. మన దురాశలకు మిగిలిన నిరాశలు వాళ్ళు. మన విషాదం కూడా అంతే. మనం పెంచి పోషించుకున్నదే. మన గుండెలో పాదుచేసి, కుదురుకట్టి, బీజం వేసుకోగా మొలిచిన పిచ్చిమొక్క. పదేపదే 'నెమరువేత' అనే విషజలంతో పెంచుకుంటున్న విషాద వృక్షం. విషవృక్షం. మనం పెంచుకున్నదే. మనం లాలించుకున్నదే. అది, గుండె తొట్టిలో లాలిపాటతో గోముగా పెరిగిన గారాల శిశువు. దానికి మన జీవితమే బలిపశువు. నిజం... ఇది మనం చేసిన తప్పే.
విషాదం బాధ కాదు. ఒక స్థితి. బాధను స్థిరం చేసే ఒకానొక తీవ్ర భార స్థితి. ఆ స్థితిలోకి మనకు తెలీకుండానే మనమే మనను మనం తోసి వేసుకుంటున్నాం. ఎందుకలా జరగాలి? మనకు ఆలోచన లేదు. మనకు ధైర్యం లేదు. మన మీద మనకు అదుపు లేదు. ఇంద్రియాలు ఎటు వెళ్తే అటు మనసును వెళ్ళనిస్తున్నాం. మనసు ఎటు వెళ్తే అటు ఆశలు పెంచుకుంటున్నాం. నిరాశలకు బీజం వేసుకుంటున్నాం. అదిచ్చే ఫలమే విషాదం. మనసును అదుపు చేసే బుద్ధి మనలోనే ఉంది కదా? మనతోనే ఉంది కదా? మనసు కంటే ఎన్నో రెట్లు బలీయమైన బుద్ధి శక్తిని ఎందుకు నిద్రాణంగా ఉంచేస్తున్నారు? ఎందుకు చైతన్యవంతం చేసుకోలేకపోతున్నాం? ప్రయోజనం పొందలేకపోతున్నాం. పక్వమైన ఫలాన్ని వదిలేసి కసుగాయను కొరుకుతున్నాం! వగరో చేదో కాక మాధుర్యమెలా దక్కుతుంది? రసాస్వాదనమెలా జరుగుతుంది? ఆలోచిద్దాం... అదీ బుద్ధిశక్తితో.. మనకు అర్థమైంది.. విషాదమైనా, వినోదమైనా మన మనసు చేసే కల్పనే అని. ఆ బీజ దశలోనే, ఆ వ్యవసాయ సాగు దశలోనే, ఆ ఎంపిక దశలోనే అప్రమత్తులమై ఉందాం. ఆ అవకాశం మనకుంది. మంచి విత్తులు నాటుకుందాం. మంచి ఆలోచనలను మాత్రమే అనుమతిద్దాం. మనసును మంచి నేస్తంగా మలచుకుందాం. నేస్తం ఎప్పుడూ న్యాయమే చేస్తుంది.
వాతావరణంలోని మార్పులను పక్షులు, జంతువులు ముందుగానే పసిగట్టేస్తాయి. బయటెక్కడో జరిగే వాతావరణ ఉపయోగాలను, ఉపద్రవాలనే మిగిలిన జీవజాలం గుర్తించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేటప్పుడు మనలోని, మనమే సృష్టించుకునే ఆలోచనల చిరుగాలుల్ని పసిగట్టి మనం నివారించలేమా? ఎందుకు సుడిగాలిగా మారనిస్తున్నాం? సునామీగా ఎదగనిస్తున్నాం? నిజమే... కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే, మన మనసుతో సంబంధం లేకుండానే బాధలు, వాటి తాలూకు విషాదం మనను చుట్టుముట్టేస్తాయి. దానికి ఆధ్యాత్మిక సాధనల ప్రభావం అడ్డుకట్ట వేస్తుంది. కష్టాలకు కాదు, కన్నీళ్లకు. కష్టాలను రాకుండా ఆపలేమేమో. కానీ కన్నీటిని ఆపగలం. కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే, విషాదాన్ని వినోదంగా మలచుకుంటే. దానికి ఆధ్యాత్మిక పథమే మంత్రదండం. సానుకూల దృక్పథం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ సృహ... ఈ అన్నింటి సమాహారమే ఆధ్యాత్మికత. వీటి పరిపోషకత్వానికి మనం శతథా ప్రయత్నించాలి. మనసును మనోహర ఉద్యానవనంగా మలచుకోవాలి. కలుపు మొక్కల్ని పీకేయాలి... కాదు కాదు... అసలు మొలకెత్తనివ్వకూడదు. అప్పుడు విషాదం మధురంగా ఉంటుంది.
- చక్కిలం విజయలక్ష్మి