ᐅపరమ పురుషుడు



ᐅపరమ పురుషుడు 


జీవితంలో ఆటుపోట్లు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు సహజం అని తెలిసినప్పటికీ సగటు మనిషి కేవలం సుఖాలనే కోరుకుంటాడు. ఎందుకు- బాధలంటే భయం... జీవితాంతం హాయిగా, నల్లేరుమీద నడకలా గడపాలన్న కోరిక...
సృష్టి మొదలై నాగరికత పెరిగాక జన్మంతా పూర్తిగా సుఖాలతోనే బతికినవారెవరైనా ఉన్నారా? మరి మానవుడు దుఃఖాలకు దూరంగా ఉండాలని ఎందుకు భావిస్తాడు? కష్టసుఖాల కలబోత జీవితమని తెలిసీ ఎందుకు విలపిస్తాడు? సమదృష్టి లోపం వల్లనే ఇలా జరుగుతుంది. ప్రాపంచిక విషయాలకు అధిక ప్రాధాన్యమివ్వడం, ప్రతి చిన్న అంశానికీ అమితంగా కుంగిపోవడం, లేనిపోని భయాలతో భవిష్యత్తును వూహించుకోవడం ఎందరికో పరిపాటి.
పారమార్థిక చింతన చాలావరకు పరిణతినిస్తుంది. ఇహం, పరం మధ్యనున్న సన్ననిగీత చెరిపెయ్యగలిగితే స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనే దృఢసంకల్పం చిగురిస్తుంది. పరిష్కారం లభించడానికి మార్గం సుగమమవుతుంది. ఈ పారమార్థిక చింతన అంతర్గతంగా అంతర్లీనంగా జరగాలి. నిరంతరం అంతర్మథనం కొనసాగుతుండాలి. ఆశావహ దృక్పథం అలవరచుకోవాలి. చెడు ఆలోచనలను దూరంగా ఉంచాలి. గతంలో ధర్మమూర్తులుగా వాసికెక్కినవారి జీవనశైలిని పరిశీలించాలి. కష్టాల్లో వారెంత మనోనిబ్బరం ప్రదర్శించారో ఆకళింపు చేసుకోవాలి. ఆత్మహత్య భావనను ఆదిలోనే తుంచెయ్యాలి. చీకటి వేకువకు ప్రాణం పోస్తుందని గ్రహించాలి. ఒకరోజు ఆహారం దొరకలేదని ఏ జంతువైనా ఎప్పుడైనా ఆత్మహత్యాయత్నం చేసిందా? అలాంటిది, దుర్లభమైన నరజన్మ పొంది స్వయంకృతాపరాధాల కారణంగా దీన్ని నాశనం చేసుకుంటున్నవారెందరో!

పరిణతి కోసమే పారమార్థిక చింతన అన్న సత్యం తెలుసుకుంటే స్థితప్రజ్ఞత దానంతటదే వస్తుంది. కష్టాలకడలిని జీవితమంతా ఈది సుఖాలతీరం చేరిన ప్రముఖులెందరో ఉన్నారు. వారి చరిత్రలు ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా పరిణతి సాధించిన మానవుడే పరమ పురుషుడవుతాడు.

- కిల్లాన మోహన్‌బాబు