ᐅమేలైన గుణం




మేలైన గుణం 

కొండ అంచుల మీద జాగ్రత్తగా డోలీని మోసుకుంటూ కూలీలు గిరిశిఖరాల్లో కొలువైన భగవానుడి కోవెల దగ్గరకు చేరారు. డోలీలో వృద్ధుడైన స్వామి విరజానందుడు... వెనక స్వామివారి శిష్యగణం.
విరజానందులవారు దిగగానే డోలీ మోసినవారికి భక్తితో నమస్కరించారు. శిష్యగణం నివ్వెరపోయింది. కూలీలు వినయంగా నమస్కరిస్తూ 'స్వామీ! మీరు దీవించండి... అదే మాకు శ్రీరామరక్ష! అదే మా భాగ్యం' అన్నారు.

'నాయనలారా! నన్ను కోవెల చేర్చిన భగవత్‌స్వరూపులు మీరు. నా పూజల పుణ్యఫలం మీకు దక్కుతుంది, సేవాభాగ్యంతో మీరు సంపన్నులయ్యారు' అంటూ కోవెల వైపు అడుగు వేశారు.

సేవలందుకోవడంలో కాదు- సేవించడంలోనే పరమార్థం ఉందన్న దానికి నిదర్శనం ఇది. రజోగుణం సేవలందుకోవడమే పరమార్థంగానూ, తమోగుణం పరులందించే సేవలతో సుఖించాలన్న ఆరాంటంతోనూ ఉంటుంది. సత్వగుణం సేవించడమే సంస్కార లక్షణంగా భావిస్తుంది.

అవతారమూర్తులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సేవించడంలోనే తరించారన్న ఘట్టాలను మనం విస్మరించకూడదు. 
అరణ్యవాస సందర్భంలో శ్రీరాముడు మున్యాశ్రమాల సేవలోనే తరించాడు. భరతుడు శ్రీరామ పాదుకలను సేవిస్తూ, అదే తన భాగ్యంగా భావించి రాజ్యపాలన చేశాడు.

రావణ వధానంతరం, శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన వేళ వానర ప్రముఖులను వివిధ రీతుల్లో కానుకలు ఇచ్చి సంతృప్తి పరచి ఆంజనేయుణ్ని మణిహారాలతో సత్కరించగా- స్వామీ! ఈ రాళ్ళు, రత్నాలు నాకెందుకు... నా మనసులో సదా నిన్ను నిలుపుకొని, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించుకొంటూ సేవించుకొనే భాగ్యాన్ని ప్రసాదించు' అంటాడు.

కనుకనే శ్రీరామచంద్రుని ఆలింగనా భాగ్యం పవన సుతుడికి దక్కింది.

మిత్రుడైన సుదాముడిని ఉచితాసనంపై అధిష్ఠితుని గావించి, సకల మర్యాదలు చేసి సేవించి, 'మిత్రమా! సేవాభాగ్యం కలిగించి, నన్ను, ద్వారకను తరింపజేశావు' అంటూ శ్రీకృష్ణుడు ఆనందభరితుడయ్యాడు.

అధికారం, ధనం, వ్యామోహం లాంటివి సహజంగానే సేవలందుకోవడంలోనే ఆనందం ఉంటుందన్న వికారానికి దారితీస్తాయి. అవేమీ శాశ్వతం కావు. మాయమైన మరుక్షణంలోనే అంతులేని క్షోభకు గురవుతుంది మనసు.

కౌశికుడనే విప్ర తపస్వికి తానొక శక్తి సంపన్నుడైన తపస్వినన్న అహం. మాంసం అమ్ముకుంటూ జీవనం గడిపే ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధన చేస్తాడు.

'నా వృత్తిధర్మం నేను చేస్తున్నాను. వృద్ధులైన నా తల్లిదండ్రుల సేవలో తరిస్తున్నాను... ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. వారి సేవాభాగ్యం లభించడం జన్మసుకృతంగా భావించాలి. ఆ భావనతో, భగవానునిలోని సృష్టి ధర్మాలను గ్రహించగలుగుతున్నాను. జీవితాన్ని సఫలం చేసుకుంటున్నాను...!'

ధర్మవ్యాధుడి మాటలతో జీవిత పరమార్థం బోధపడింది కౌశికుడికి. సుగుణాల మేలు కలయికతోనే వ్యక్తిత్వం పరిమళిస్తుంది. పరిమళించని వ్యక్తిత్వం అడవిలో మొలిచే పిచ్చిమొక్కలతో సమానం.

ఉత్తమమైన సుగుణం- కీర్తికాంక్షలేని సేవాగుణమే. 
జాతిపితను ఓ విదేశీయుడు అడిగాడు 'రవ్వంత విరామం దొరికినట్త్లెతే మీ భావజాలం ఏ దిశగా పయనిస్తుంది' అని ఆయన ఏం చెప్పారో తెలుసా? 
'విరామంలోనే కాదు. ఈ పూట ఏ హరిజనవాడను శుభ్రం చేద్దామా అన్న చింతన నాలో సదా ఉంటూనే ఉంటుంది' 
ఎల్లలెరుగని సేవాగుణం మహాత్ముడిది. 
ప్రతిఫలాపేక్ష లేని సేవ చిన్నదైనా కొండంత తృప్తినిస్తుందని గ్రహించాలి.

- దానం శివప్రసాదరావు