ᐅవెయ్యేళ్లు వర్ధిల్లు!
మనిషి ఆయుర్దాయం వందేళ్లు. దైవీ లక్షణాలుగా భాసిల్లే కొన్ని సుగుణాలను పుణికిపుచ్చుకుంటే తరాల తరబడి నిలిచే కీర్తిప్రతిష్ఠలతో నిజంగానే వెయ్యేళ్లు వర్ధిల్లుతాం. మన అడుగు జాడలు భావితరాలకు మార్గదర్శకాలవుతాయి.
మానవ సహజగుణం ఏమిటి? బతికినంత కాలం గొప్పగా బతకాలన్నదే. గొప్పగా బతకడమంటే ఏమిటి?
సిరిసంపదలు, అధికారం, హోదా, గౌరవాదులు పొందటం గొప్పతనమనవచ్చునా?
గొప్పదనమనేది సుగుణసంపత్తి వల్ల వస్తుందేకానీ, మరేరకంగానూ కాదు.
సుఖవంతంగా, సుసంపన్నంగా బతకటం వరమే. దానికి సుగుణాలు తోడైతే పూలకు పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. సేవలందుకోవడం కంటే సేవించడంలోనే గొప్పతనముందని ఎన్నో ఇతిహాస పురాణాదులు, చరిత్రలు తెలియజేస్తున్నాయి.
సర్వాలంకార భూషితుడు, నారీజన మానస విహారీ, సాక్షాత్ భగవానుడైన శ్రీకృష్ణుడు-
- కటిక దరిద్రంతో బాధపడే కుచేలుని చూసినంతనే గాఢాలింగనం చేసుకుని, తన సింహాసనంపై కూర్చుండబెట్టి, పాదాలు ఒత్తుతూ కడుగుతూ ఆ తీర్థాన్ని తన శిరస్సుపై జల్లుకొని తన్మయత్వం పొందాడు.
'నాకు ఎంతటి మహద్భాగ్యాన్ని కలిగించావు మిత్రమా! ఏదీ... నా కోసం ఏం తెచ్చావు చెప్పు!' అంటూ చిరిగిపోయిన చేలంలో అత్యంత జాగ్రత్తగా, రొంటిలో మూటకట్టి దాచిన అటుకులను వెతికి, వెతికి తిన్నాడు భగవానుడు. అమృతంలా ఉన్నాయంటూ స్నేహితుణ్ని గొప్ప చేశాడు. శ్రీకృష్ణుడి మర్యాదలకు ఆనందపారవశ్యంతో కన్నీటి పర్యంతమయ్యాడు కుచేలుడు. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడే సేవించాడంటే, కుచేలుడెంతటి గొప్పవాడంటూ ఆశ్చర్యపోయారు అంతఃపుర పరివారం.
గొప్పతనమనేది ఆత్మీయ బంధాల వల్ల, గుణగణాల వల్లనే వస్తుందనేదానికి ఓ దివ్యమైన సందేశం ఈ ఘట్టం.
ప్రభువైన ఏసుక్రీస్తు దివ్యచరితలో మరో అద్భుత ఉదంతం మానవాళికి నిదర్శనంగా ఉంది.
ఆ రాత్రి పన్నెండు మంది శిష్యులతో విందుకు కూర్చుంటాడు కరుణామయుడు(లాస్ట్ సప్పర్). ఆయన పక్కనే కూర్చోవాలన్న తహతహ అందరిలోనూ. అదే వారు గొప్పగా భావించడం ప్రభువైన క్రీస్తు గమనించకపోలేదు.
క్రీస్తు ఓ పాత్రలో నీరు తీసుకొని వారి పాదాలు కడిగేందుకు ఉద్యుక్తుడయ్యేసరికి- 'వద్దు ప్రభూ! వద్దు! మేమే మీ పాదాలు కడగాలి' అంటారు నివ్వెరపోయి.
అందుకు ప్రభువైన ఏసుక్రీస్తు 'మీ అంతరంగాల్ని ఎరుగుదును. గొప్పగా బతకడమంటే ముందు మీ తోటివారిని గౌరవించండి, సేవించండి' అంటూ జీవితంలో గొప్పగా బతకడమంటే ఏమిటో తెలియజెబుతాడు.
తాము ఉన్నత సంస్కారులై ఉండటమేకాక- ఇతరుల్లోనూ సంస్కార బీజాలు నాటడం దైవీతత్వానికి నిదర్శనం. అటువంటివారే లోకబాంధవులు. ప్రతి మనిషీ ఆ దిశగా జీవన యానాన్ని మలచుకోవాలి. మహాత్మాగాంధీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. 'నీ సేవలు, శాంతియుత ఉద్యమాలు భారతావనికి ఎంతో అవసరం. దేశమంతా ఒకసారి పర్యటించు!' అంటారు గోఖలే. రైలుబోగీల్లో నలుమూలలా ప్రయాణం చేస్తారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నంతకాలం సూటుబూటులో ఉండేవారాయన. మాతృభూమి పర్యటన ముగించుకున్నాక గోఖలే ఎదుట హాజరయ్యారు. గోఖలే గాంధీజీని తేరిపార చూశారు. అంగీ లేకుండా, ఒక్క పంచెకట్టుతో అదీ మోకాళ్లనానుకొని ఉండేటట్లుగా- అత్యంత సాధారణ వ్యక్తిగా నిలబడి ఉన్నారు గాంధీజీ. 'నేడు భారత జాతిని అర్థం చేసుకుని నడిపించే నాయకుడివి నీవు. భారతీయుల స్థితిగతులను ఆకళింపు చేసుకున్నావు. భేష్' అంటూ ప్రశంసించారు. జాతి ఉద్ధరణ కోసం స్వసుఖాలను వీడిన మహాత్ముడు, జాతిపితగా భాసిల్లారు. ప్రపంచ దేశాలకే తలమానికమయ్యారు.
నాటి పురాణకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మహనీయులు మానవుణ్ని మాధవుడిగా మలచేందుకే శ్రమించారు. ఆ స్థాయి అందుకోవడానికి స్వార్థచింతన వీడాలి. 'నేను' అన్న కూపంనుంచి బైటపడాలి.
ఇతిహాస పురాణ శ్రవణాలు, భక్తి రచనలు, మహనీయుల గాథలు మనస్సుల్లో పరివర్తన తెచ్చేటందుకు ఉపకరించే ఉపకరణాలు. నిస్వార్థంతో చరించే మార్గం ఏర్పడితే గొప్ప, తక్కువ భేదాలు పొడచూపవు. సర్వ సమత్వ భావన ఏర్పడుతుంది. ఆ భావన ఏర్పడటమే- సుగుణాల మేలుకలయిక. అది అత్యున్నతమైన స్థితి. ఆ స్థితి జీవితాలను కలకాలం వర్ధిల్లేలా చేస్తుంది.
- దానం శివప్రసాదరావు