ᐅమనసు - సాధన
ᐅమనసు - సాధన
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం- వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. మనసు వలన సంకల్పం, బుద్ధి వలన నిర్ణయించే శక్తి, చిత్తం వలన జ్ఞాపకశక్తి, అహంకారం వలన ఆత్మశక్తి కలుగుతాయి.బంధానికిగానీ, మోక్షానికిగానీ మనసే ప్రధానం. మనసు ఓ మాయావి. మనిషికి కలిగే ఆనందం, దుఃఖం మనసు వల్లే కలుగుతాయి.
మనసు ఆహ్లాదంగా ఉందనుకోండి, జగత్తు అప్పుడే విచ్చిన గులాబీలా మనోహరంగా కనబడుతుంది. సాధారణంగా వీచే గాలి, చల్లని కొండగాలిలా హాయిగా శరీరాన్ని తాకుతుంది. నిప్పులు చెరిగే వేసవిలో ఆశ్రయించిన శీతల విడుదుల్లా అననుకూల పరిస్థితులు కూడా మనసుకు హాయినిస్తాయి. లోకులు ఆడే క్రూర పరిహాసమూ నవనీతమై ఎదను తాకుతుంది. ఆకలిగొన్నవాడికి పచ్చడి మెతుకుల నుంచే తృప్తి లభించినట్లు ఆనంద క్షణంలో సామాన్య జీవనం మధురంగా భాసిల్లుతుంది.
మనసు నిర్వేదంగా ఉందనుకోండి, అన్ని అనుకూలతల్లోనూ ప్రతికూలత కనిపిస్తుంది. మధుర భాషణంలోనూ వ్యంగ్యం గోచరిస్తుంది. పరిహాసానికి ఆడిన మాటా తూటాలా గుండెను తాకుతుంది. వసంత కోకిల కుహూరవాలు రోత పుట్టిస్తాయి. మధుర సంగీత బాణీలు తలనొప్పి కలిగిస్తాయి. కొద్దిపాటి కష్టమూ భరింపరానిదవుతుంది. 'ఎవరైతే మనోవైఖరులను మార్పు చేసుకోగలరో, వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలరు' అంటాడు ఓ ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త. సుఖాన్ని ఆనందించినట్లే, కష్టాన్నీ భరించే శక్తీ మనసుకు ఉంటుంది. ఆ మనసును సాధనతోను, వైరాగ్య నిగ్రహాలతోను పుష్టిగా చేసుకున్న సాధకుడే నిజమైన బలశాలి! అదే గీతాచార్యుడు ప్రవచించిన సమస్థితి. 'మనసు కోరిన అనుచితమైనదాన్ని కాదన గలగడమే మనోనిగ్రహ'మంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి.
'మనసును జయిస్తే సమస్త ప్రపంచాన్నే గెలిచినట్లు' అంటాడు ఓ సుప్రసిద్ధ తత్వవేత్త. ఈ జగత్తులో కష్టసుఖాలు చాలా మటుకు మనసు కల్పించుకున్నవే! తినగ తినగ వేపాకునూ మధుర పదార్థంగా రుచింపజేయగల అమోఘ శక్తి మనసుకుంది. భావనామాత్ర ప్రతిభచేత విశ్వాంతరాళాలను క్షణంలో చుట్టి రాగల మనశ్శక్తి అపూర్వం. మనోబలం ద్వారా ఆత్మశక్తి చేకూరుతుంది. అప్పుడు ఎదలోను, ఎదుటివారిలోను ఉన్న అంతర్యామిని సాధకుడు దర్శించగలుగుతాడు.
జ్ఞానాన్ని స్వీకరించేందుకు మనసు అనుకూలంగా ఉన్నప్పుడు మానవుడు ఎన్నో విజయాలు సాధిస్తాడు. బలహీనమైన మనసు అపజయాలకు, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. సామాన్యుల జీవితాలు మనసుకు అధీనమై ఉండగా, మహనీయులకు మనసే అధీనంలో ఉండటం విశేషం!
- గోపాలుని రఘుపతిరావు