ᐅఆనంద మరీచిక
ప్రతి మనిషీ ఆనందంగా జీవించాలనే కోరుకుంటాడు. అది మరీచికలా అందకుండా వూరించటం ఏమిటో అంతుపట్టడంలేదు. సచ్చిదానందం అంటే పరమాత్మ. ఈ జీవుడు ఆ దేవుడి అంశమే. అంశి ఆనందమైతే అంశ ఆనంద స్వరూపం కాకతప్పదు. మరి, పుట్టగానే ఏడ్వటం దేనికి? ఇందుకు తగిన కారణం ఉందా?
మనిషి పుట్టుక గురించి, సైద్ధాంతిక విభేదాలున్నా- వేదాంతి, విజ్ఞాని పరిణామక్రమానికి కట్టుబడే ఉన్నాడు. కోతినుంచి మానవుడు పుట్టాడని 'సైన్సు' వాదిస్తున్నది. మానవ జన్మ జీవచైతన్యం సాధించిన ప్రగతికి నిదర్శనంగా వేదాంతం చెబుతున్నది. మానవుడు దివ్యమానవుడై, భూలోకాన్ని స్వర్లోకంగా మార్చగలడని విజ్ఞానం, వేదాంతం తమదైన బాణీలో గళమెత్తి చాటుతున్నాయి. బహుశ, అందీఅందని ఈ ఆనందం ఏమిటో అంతుతేలేవరకు రెండువైపుల నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి.
అసలు ఆనందాన్వేషణ మనిషితోనే మొదలైంది. ఎందుకంటే- ఆలోచించేశక్తి, అనుభవించే అవకాశం, అనంతమైన జీవసముదాయంలో మనిషికి మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా జంతుసంతానం కేవలం ఆహార, నిద్రాభయ మైధునాలకు మాత్రమే పరిమితం. ఏది మంచో ఏది చెడో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలిగినా, అలా జరగకపోవటంవల్లే మనిషికి ఆనందం దూరమై, దుఃఖం ధృతరాష్ట్రుని కౌగిలిలా వూపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. బుద్ధిని పక్కనపెట్టి మనసు అస్తమానం ఇంద్రియాల వెంటపడి క్షణికమైన విషయసుఖాల కోసం వెంపరలాడుతున్నది. పెడదారి పట్టడం వల్లే మనిషికి ఆనందం ఒక మాయలేడిగా మారింది. ప్రకృతి ప్రసాదించిన జ్ఞానశక్తిని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని సద్వినియోగం చేసుకోలేక బాధపడుతున్నాడు. మనిషి దుఃఖానికి రాగద్వేషాలే పునాదిరాళ్లుగా ప్రగతి నిరోధకాలయ్యాయి. ఏడుస్తూ వచ్చినా, నవ్వుతూ బతికే మార్గాన్ని తుదిశ్వాసదాకా అనుసరించకపోవటం మరింత దురదృష్టకరం. ఈ విశ్వం, ప్రకృతిసిద్ధమైన వనరులు తనకే సొంతం కావాలన్న తపనవల్లే తనకు, ఆనందానికి నడుమ అగాథం ఏర్పడిందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను అనుకుంటున్నట్టు, సృష్టి అంతా గజిబిజి కాదు. అన్నింటినీ కలుపుకొంటూ అదొక నిర్దిష్ట పంథాలో ముందుకు సాగుతున్నది. సౌరశక్తి వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అమృతకిరణాలు భూమిపైన ప్రసరించి సస్యాలను సృష్టిస్తున్నాయి. అన్నగత ప్రాణులు పాడిపంటలమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. విశ్వచక్రం చక్కగా తిరగటానికి నిబంధనలు, అనుబంధాలు అంతర్గతంగా ఉన్నాయి.
పరిణామక్రమంలో ఉన్నతస్థానం చేరుకున్న మనిషి ఆలోచనల్ని, ఆశయాల్ని తన క్షేమంకోసమే పరిమితం చేయకూడదు. అది అందరి క్షేమంతో ముడివడి ఉన్నదని, పంచుకోవటంలో ఉన్న ఆనందం ఉంచుకోవటంలో లేదని ఎరుక కలిగిన క్షణం- నిజస్వరూపమైన ఆనందం అతడిలో ఒక ఆర్ణవమై వెల్లివిరుస్తుంది.
అన్నమయకోశం నుంచి ఆనందమయకోశం చేరుకోవటానికి, ఒంటిపిల్లి రాకాసి జీవితానికి స్వస్తిపలకటం తప్ప మరో మార్గంలేదు. అంతవరకు మనిషి జీవితంలో ఆనందం ఎండమావిగానే మిగిలిపోగలదు.
- ఉప్పు రాఘవేంద్రరావు