ᐅసంభవామి యుగే యుగే!
'ధర్మం గాడి తప్పినప్పుడల్లా, చెడును రూపుమాపటానికి, మంచిని కాపాడటానికి, ప్రతియుగంలో అవతరిస్తూఉంటాను' అంటాడు కృష్ణుడు అర్జునుడితో. అవతరించటం అంటే, స్వయం పరమాత్మ సమయానికి తగినట్లు ఓ రూపంలో దిగిరావటం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రూపాలు మానవవికాసానికి చిహ్నాలుగా చెప్పుకొన్నా, వాటి ద్వారా ఆనాటి పరిస్థితులు బాగుపడ్డాయి. ధర్మానికి ఆధారమైన వేదాల ఉద్ధరణ సాధ్యపడింది. అమృత మథనంలో కుంగిపోకుండా భూభాగం నిలబడ్డది. హిరణ్యాక్షుడి చెరలో ఉన్న భూదేవికి విముక్తి లభించింది. లోకకంటకుడైన హిరణ్యకశిపుడు అంతరించాడు. రాక్షసత్వం బలీయంకాకుండా పాతాళలోకానికి వెళ్లిపోయింది.
ఏ యుగంలోనైనా దైవీశక్తులకు ఆసురీశక్తులతో సంఘర్షణ తప్పనిసరి. ఆధ్యాత్మిక జీవితంలో భౌతికజీవితం రాజీ పడేదాకా ఆ రెంటినడుమ యుద్ధం కొనసాగుతూనేఉంటుంది. పరిపూర్ణమైన మానవత్వానికి ఓ సజీవ ప్రతీకగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నది రామావతారం. మానవ ధర్మాన్ని గుర్తు చేయటానికి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా అవతరించాడని పురాణ, ఇతిహాసాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఇప్పటికి తొమ్మిదిలక్షల సంవత్సరాలకు ముందు త్రేతాయుగంలో నాలుగో చరణంలో మర్యాదాపురుషోత్తముడు రాముడు అయోధ్యలో జన్మించాడని వాల్మీకి మహర్షి రాశాడు. ఆనాటి ఆ నగర వైభవాన్ని తన గ్రంథంలో చక్కగా వర్ణించాడు. రాముడన్నవాడు ఉన్నాడోలేడోనన్న వివాదం పక్కన పెడితే- ఆయన గుణగణాలు, రూప సౌందర్యాలు అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. రామరాజ్యం నేటి రాజకీయాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఒక తనయుడిగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా కుటుంబానికి, శిష్యుడిగా గురువుకు, వ్యక్తిగా సమాజానికి, సమ్రాట్టుగా దేశానికి ఎలా ఉపయోగపడాలో రాముణ్ని చూసి నేర్చుకోవాలి, అలా జీవించటానికి ప్రయత్నించాలి.
రామావతారానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మానవుడు ఇలా నడచుకోవాలని చెప్పటం వరకే కాదు; ఆ మానవుడు తానూ ఒక ఆత్మారాముడేనన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ 'ఎదుగుదల'ను గ్రహించి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. లేకపోతే, అవతారానికి అర్థమే లేకుండాపోతుంది. మానవుడు తననుతాను తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకుడిగా దేవుడు రాముడయ్యాడు. అంతేకాదు, మానవులంటే ఎంత ప్రేమ కలవారో రాముడు, ఆయన మాటలే చెబుతున్నాయి. రామావతారం పరిసమాప్తికానున్న సమయంలో బ్రహ్మదేవుడు పనిగట్టుకుని దిగివస్తాడు.మాయామానుష రూపుడైన నీవు సాక్షాత్ నారాయణుడివేనని గుర్తుచేస్తాడు. అందుకు రాముడు స్పందించిన తీరు మానవులందరికీ గర్వకారణం!
'ఆత్మానం మనుష్యాం మనయే!'
'నేను మనిషిని...'- ఎంత తీయనిమాట!
- వి.రాఘవేంద్రరావు