ᐅడబ్బు... జబ్బు!
ధనాన్ని అనర్థంగా భావించాలంటుంది వేదాంతం. ఎవరైనా లౌకికులు ఈ మాటను అంటే వాళ్లు అమాయకులనో, ఈ కాలంలో పుట్టవలసినవాళ్లు కాదనో భావించవలసివస్తుంది. ఈ రోజుల్లో డబ్బు లేకుంటే కాలు కదపడం కూడా సాధ్యం కాదు. ఈ రోజులనే కాదు, ఏ రోజుల్లోనైనా ధనానికి ఉండే ప్రాధాన్యం, ప్రాముఖ్యం అలాంటివి. వేదాంతానికీ, లౌకికానికీ ఇంత తేడా ఉండటానికి ప్రధాన కారణం వేదాంతం సర్వసంగపరిత్యాగం చేయమంటుంది. లౌకికం స్వార్థం కోసం ప్రయత్నించమంటుంది. కనుక ఇవి రెండూ భిన్నధ్రువాలుగానే కనబడటం సహజం.
ఈ విషయాన్ని కొన్ని వందల ఏళ్లక్రితమే గమనించిన భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో 'ఎవరి దగ్గర డబ్బు ఉంటే అతడే ఉత్తమవంశ సంజాతుడుగానూ, పండితుడుగానూ, అన్నీ తెలిసినవాడుగానూ, గుణవంతుడుగానూ, గొప్ప వక్తగానూ, అందగాడుగానూ కీర్తిపొందుతాడు... అందువల్ల అన్ని గుణాలూ డబ్బును ఆశ్రయించుకొని ఉంటా'యంటాడు.
భవిష్యత్తు అవసరాలకోసం డబ్బు కూడబెట్టవలసిందే. ఇందులో ఏ దోషమూ లేదు. కానీ, తన దగ్గర ధనం కూడింది కదా అని గర్వించి, ఆ ధనమదంతో మానవత్వాన్ని మరచి, హద్దులు మీరినప్పుడు అనర్థం ఏర్పడుతుంది.
ధనమదం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే బాణమహాకవి రచించిన 'కాదంబరి' కథాకావ్యాన్ని ఒకసారి గుర్తుచేసుకోవలసిందే. ఆ కథలో చంద్రాపీడుడు ఒక యువరాజు. అతనికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో అనుభవజ్ఞుడైన శుకనాసుడనే మంత్రి యువరాజుకు కొన్ని హితోపదేశాలు చేస్తాడు. వాటిలో ఏయే దుర్గుణాలు ప్రజాపరిపాలకునిలో ఉండకూడదో వివరిస్తూ ధనమదాన్ని గురించి చెబుతాడు. అతడు చెప్పిన విషయాలు కేవలం పరిపాలకులకే కాదు సామాన్య జనులకూ ఆచరణయోగ్యాలే-
'ధనమదం ఎంతో అనర్థదాయకమైంది. అది రానురాను పెరుగుతుందే కాని తగ్గదు. అది ఉన్నవాడు కళ్లు ఉండికూడా గుడ్డివాడవుతాడు. దర్పమనే జ్వరంతో బాధపడుతుంటాడు. ఆ జ్వరానికి మందు లేదు. ప్రతిరోజు ఎన్నిమార్లు స్నానం చేసినా ధనమదపు కల్మషం తొలగిపోదు. నీళ్లు చల్లితే నిప్పు ఆరిపోతుందంటారు కానీ, సముద్రంలోనే పుట్టే బడబానలం సముద్రంలోని నీళ్లతో ఆరిపోవడం లేదు కదా! అందువల్ల ధనమదం అనే అగ్ని ఎంతటి ప్రశాంతమనస్వినైనా దహించకమానదు. అది ఎన్ని నీళ్లు పోసినా చల్లారదు. ధనమదం ఉన్నవాడికి ఇతరులు చెప్పే మంచిమాటలు వినబడవు. వినబడినా ఏనుగులా మదంతో తల ఊపుతారేగాని ఆచరించరు. హితం చెప్పేవాళ్లను అవమానిస్తారు. అసత్యాభిమానాల్ని పెంచుకొంటూ ఉన్మాదుల్లా వ్యవహరిస్తారు. పరిచయం ఉన్నవాళ్లను కూడా గుర్తించనట్లు నటిస్తారు. గొప్పవాళ్లనూ లెక్కచేయరు. మంచి రూపాన్ని ఆరాధించరు. శీలాన్ని పరిగణించరు. పూజ్యులను గౌరవించరు. ధర్మాన్ని అనుసరించరు. త్యాగభావనను ఆదరించరు. పండితులను గుర్తించరు. మంచి అలవాట్లు పాటించరు. సత్యం మాట్లాడరు. ఏ ప్రమాణాన్నీ ఒప్పుకోరు. ఈ ధనమదం అనేది దురాశ అనే విషవృక్షానికి దోహదం చేసే జలధార వంటిది. ఇంద్రియాలు అనే మృగాలను చంపడానికి వేటగాడు పిలిచే పిలుపులాంటిది. సాధుస్వభావాన్ని చంపే వధ్యశాల వంటిది. సన్మార్గం అనే చంద్రుణ్ని కబళించే రాహువులాంటిది. ధనమదం ఉన్నవాళ్లు దుష్టుల మాటల్ని విని, శిష్టులను నాశనం చేస్తారు. అన్నింటిలోనూ డబ్బునే చూస్తారు. అందంగా కనబడుతున్నా లోక వినాశనకృత్యాలు చేస్తారు. తాము పతనమవుతున్నామని తెలుసుకోలేరు. తమ స్వేచ్ఛావిహారమే పరిపాలన అనుకుంటారు. ఇతరులను అవమానించడమే దయ అనుకొంటారు. దేవతల్ని అవమానించడమే తమ మహాశక్తిగా భావిస్తారు. హితం చెప్పేవాళ్లపై మండిపడతారు. వృద్ధులు చెప్పేమాటలను పనికిరానివని తిరస్కరిస్తారు. తమలోని దుర్వ్యసనాలను సమర్థించేవారినే చేరదీస్తారు. పోషిస్తారు. వారి మాటల్నే వింటారు. వారితోనే సహవాసం చేస్తారు. అందువల్ల ఇన్ని అనర్థాలకు మూలమైన ధనమదాన్ని నీవు దరిజేరనీయరాదు!'
శుకనాసుని ఈ సదుపదేశం లోకంలోని ధనమదాంధులను ఉద్దేశించినదే. కనుక మనమందరం మదం లేని ధనవంతులమైతే మనకూ, లోకానికీ శ్రేయస్కరం.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ