ᐅమౌనం పరమౌషధం
పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్నితోపాటు వాటి సృష్టికర్తయైన పరమాత్ముడు... ఎవరూ మనతో పలకరు. అయినా వారు మనకు చేసే మేలు అనన్యం.
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట ద్వారా భావాలను పలికించటం. భావాలు మనోగతమైనవి. తామర తంపరగా ఉద్భవిస్తూనే ఉంటాయి. అవే మనిషిని చంచలుణ్ని చేసి సంచలనానికి గురి చేస్తున్నాయి. మౌనం అంటే నోటితో మాట్లాడకుండా ఉండటమే కాదు. మనసు కూడా మాట్లాడక పోవటం. అదే మనోమౌనం. మనసును మనసుతోనే పరిశీలించుకోవాలి. అదే ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన 'పరిశీలించేవాడే పరిశీలనకుగురయ్యేవాడు'... ఆ పరిశీలనలో మనసు మౌనాన్నే ఆశ్రయిస్తుంది.
మనిషి తనకు తానుగానే సంసారం అనే బాధ్యతలో ఇరుక్కున్నాడు. అయినప్పటికీ నేను ఫలానా అనే అహంకారాన్ని తెలుసుకోగలగాలి. దానికి మౌనమే అసలైన ఆయుధం. ఆ మౌనంలోనే తనలోని వికారాలు, వైరుధ్యాలు చేసే రాక్షసకాండ అర్థమవుతుంది. ఆ జ్ఞానం కలిగిననాడు జీవితంలో ఏ రకమైన సంఘటనలు జరిగినా వికలం కాకుండా స్థిరచిత్తుడవుతాడు. ఒక వేదాంతి బుద్ధుడి దగ్గరకు వెళ్లి భగవంతుణ్ని నిర్వచించమన్నాడు. బుద్ధుడు మౌనాన్నే ఆశ్రయించాడు. భావాలు పలికిస్తాయేమోనని కళ్లుకూడా మూసుకున్నాడు. ఆ వేదాంతి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తనకున్న వేలకొద్దీ శిష్యులతోపాటు వచ్చి బుద్ధుని అనుసరించాడు. ఆ మహామౌనంలోనే భగవంతుణ్ని దర్శించగలమనే నిజాన్ని గ్రహించాడు.
ఒక రాజు జెన్ వేదాంతి అయిన హాక్యూన్‌ను మౌనం గొప్పతనం గురించి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరి సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన సభకు వచ్చి అందరినీ ఒకసారి కలయజూశాడు. మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆయన భాషించి ఉంటే తప్పు అర్థమే వచ్చేదేమో! ఎందుకంటే మౌనాన్ని అనుభవిస్తేనే అవగతమవుతుంది. మౌనంగా ఉండేవాడు ముని. ఆధునిక యుగంలో ఎందరో మహానుభావులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిర్డీసాయి వంటివారు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు. నిరంతరం మానసిక మౌనంతో ఉండేవారు.
గాంధీజీ ప్రతి సోమవారం మౌనం పాటించేవారు. మెహర్ బాబా తన జీవితంలో చివరి ముప్ఫైతొమ్మిది సంవత్సరాలు కఠోర మౌనం పాటించారు. 'పదాలు విపరీతంగా వృద్ధి చెంది అర్థరహితాలు అయిపోయాయి. సందేశాలు నిర్లక్ష్యమై విపరీతార్థాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ మౌనం' అని కాగితంపై రాసి చూపించారు. భగవంతుణ్ని అనుభూతి చెందాలన్నది ఆయన సందేశం. మౌనం ద్వారా అపార్థాలకు, కలహాలకు స్వస్తి పలకవచ్చు. నిశ్శబ్దంలో శరీరంలో ప్రతి గ్రంధీ సక్రమంగా స్రవిస్తుంది. ప్రతి నాడీ అవసరమైనంతవరకే స్పందిస్తుంది. ప్రతి కణమూ సమతుల్యతను సాధిస్తుంది. అందుకే మౌనానికి మించిన పరమౌషధం లేనేలేదు.
- డాక్టర్ డి. చంద్రకళ