ᐅప్రేమారాధన




ప్రేమారాధన 

విశ్వేశ్వరా విశ్వాధారా! నీవు వేదాలకు కూడా అతీతుడవని అంటారు. మరి అలాంటప్పుడు నేను నీ దరి చేరగలనా? నిన్ను పొందగలనా? నీ దరి చేరే దారి చూపవా... దామోదరా!

విశ్వేశ్వరా, నువ్వే విశ్వం. విశ్వాన్ని సృష్టించినవాడివీ నువ్వే. ఈ నీ సృష్టిలో అణువణువునా నీ స్వరూపమే గోచరిస్తోంది. నీ ప్రేమతత్వమే ప్రకాశిస్తోంది. అందుక్కారణం స్వయంగా నువ్వే ప్రేమమయుడవట. అందుకేనేమో ఈ సృష్టిలో ప్రతిప్రాణీ ప్రేమమూర్తిగా గోచరిస్తోంది. ప్రతిచోటా నీ ప్రేమ స్వరూపమే ప్రతిబింబిస్తోంది.
జలచరాలను, భూచరాలను, ఆకాశంలో ఉండే ఖేచరాలను ఇలా సకల జీవుల్నీ నువ్వే సృష్టించావు. వింతవింతలైన పలురకాల రంగులతో కనువిందు చేసే పూలనిచ్చే పూలమొక్కల్ని సృష్టించావు. అమృతంతో పోల్చదగిన తీయని రసాలతో నిండిన ఫలాలనిచ్చే వృక్షజాలాన్ని సృష్టించావు. అమూల్యమైన ఖనిజ సంపదలున్న కొండల్ని గుట్టల్ని పుట్టించావు. మధురమైన జలధారలతో పరుగులిడే సెలయేళ్లతో, నదీ నదాలతో నిండిన నేలను ఇచ్చావు. రకరకాల పంటల్ని సమకూర్చగల శక్తిని పుడమి తల్లికిచ్చావు. ఔషధాలతో నిండిన వృక్షజాతిని ప్రసాదించావు. తల్లివై తండ్రివై మాకు కావలసినవన్నీ ఇస్తున్నావు. మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పోషిస్తున్నావు- ఈ విషయాలన్నీ పెద్దల సాంగత్యంలో దయతో వారు చెప్పగా విని తెలుసుకున్నాను. కృతజ్ఞతగా నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. సేవిస్తాను. కాని ఎలా... నువ్వెక్కడున్నావు, ఎలా ఉంటావు? తెలియలేకున్నాను తండ్రీ!

ఈ సృష్టిలో ప్రతిప్రాణీ, ప్రతివ్యక్తీ, ప్రతి పదార్థమూ, ప్రతి వస్తువూ అన్నీ నువ్వే. అన్నింటిలోనూ నువ్వే ఉన్నావు. అంతటా నీ రూపమే గోచరిస్తోంది. ఎక్కడ చూసినా నువ్వే. జీవులన్నింటిలోనూ నువ్వే. నీ తేజస్సే. నీ ప్రకాశమే అంతటా కోటి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. నీ తేజస్సును పంచుకొనే సూర్యచంద్రులు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. నీ ఆనతి మేరకే కాలం తిరుగుతూ ఉంది. రుతువులు చరిస్తూ ఉన్నాయి. నీ ఆజ్ఞానుసారమే దిక్కులు ఏర్పడ్డాయి. గ్రహాలు చరిస్తూ ఉన్నాయి. నీ ఆదేశానికి లోబడే దిక్పాలురు, ఇంద్రాగ్ని యమవరుణులు వాయువు తమతమ కార్యాల్ని నిరంతరమూ నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉన్నారు. సాగరాలు చెలియలికట్టలు దాటకుండా ఉండటానికి, మేఘాలు రుతువులను అనుసరించి వర్షించడానికి నీ ఆదేశమే కారణం- ఈ విషయాలన్నీ పురాణాలు, శాస్త్రాలు చదివి తెలుసుకున్నాను ప్రభూ.

విశ్వాకారా! నీ గురించి నాకిప్పుడు కొంచెం కొంచెం తెలియవచ్చింది. నువ్వు విశ్వేశ్వరుడవు. విశ్వపాలకుడవు. విశ్వమే నీవు. నీవే విశ్వానివి. విశ్వాత్మవు నువ్వే. పరమాత్మవు నువ్వే. విశ్వమంతటా చరాచర వస్తు సముదాయంలో నిండి నిబిడీకృతమై నువ్వే ఉన్నావు. నిక్షిప్తమై ఉన్నావు. నువ్వు అగోచరుడవు. అగమ్యుడవు. అయినా కొందరికి సులభంగా కనిపిస్తావు. దొరుకుతావు. కొందరికి అందనివాడవు. వెదికినా దొరకవు. నువ్వు అజేయుడవు. అయినా భక్తులకు వశుడవు.

ప్రభూ, పరమాత్మవు నువ్వయితే, నేను జీవాత్మను, ఈ జీవాత్మ పరమాత్మకంటే భిన్నమైనది కాదనీ, జీవాత్మ పరమాత్మలు రెండూ ఒక్కటే అనీ సజ్జనుల సహవాసంలో తెలుసుకున్నాను. నిన్ను దర్శించాలనీ నీతో మాట్లాడాలనీ నిన్ను ప్రేమించాలనీ ఆరాటపడుతున్నాను. అందుకోసం నిన్నే పతిగా, స్వామిగా, ప్రభువుగా ఆరాధించి ప్రేమించిన రాధాదేవి, గోదాదేవి, మీరాబాయి మొదలైన మహిళామణులు చూపిన మార్గంలోనే పయనించి నీ ప్రేమను పొందాలని ప్రయత్నిస్తున్నాను. నిన్ను సఖునిగా సేవించి తరించిన కుచేలునిలోని మైత్రీభావాన్ని ఆలంబనగా చేసుకొని నీకు మిత్రుడినై నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు, హనుమంతుడు తదితర పురాణ పురుషులు చూపించిన భక్తిమార్గాన బయలుదేరి నీ ప్రేమను పొందగోరుతున్నాను.

అంతర్యామీ, నా అంతరాత్మను గ్రహించి నన్ను అనుగ్రహించడానికా అన్నట్టు నిన్ను చేరుకోవడానికి దగ్గరి మార్గాన్నీ నాకు నువ్వే చూపించావు తండ్రీ. అందుకే నీ రూపంతో భాసించే, నీ రూపంతో ప్రకాశించే, నీ రూపంతోనే నిండి ఉన్న సమస్త జీవుల్ని మానవుల్ని మానవేతర ప్రాణుల్ని- సేవించాలన్న నిశ్చయానికొచ్చాను. నిర్మలమైన, పరిశుద్ధమైన, పరిపూర్ణమైన మనసుతో సకల ప్రాణులకూ సేవచేస్తాను. అందర్నీ ప్రేమిస్తాను. అందర్నీ నాతో సమానంగా భావిస్తాను. ఎవర్నీ ద్వేషించను. అందరిలోనూ అంతర్లీనమై ఉన్న నీ ప్రేమజ్యోతిని దర్శిస్తాను. నాలో ఆ ప్రేమజ్యోతిని వెలిగించుకుంటాను. ఆ శక్తిని నాకు ప్రసాదించు ప్రభూ!

- కాలిపు వీరభద్రుడు