ᐅసత్యనిష్ఠ - ధర్మదీక్ష




సత్యనిష్ఠ - ధర్మదీక్ష 

కొంతమందిని తలచుకుంటే ప్రఫుల్ల మనస్కులమవుతాం. ఇంకొందరు గుర్తొస్తే, అప్పటివరకూ ఉన్న ఉల్లాససల్లాపమూ కల్లోలితమవుతుంది. దీనికి మూలభూతి వారివారి చిత్తవృత్తి, మనఃప్రవృత్తి అని వేరే చెప్పనక్కరలేదు. వీరందరిలోకీ ఘనులు ధర్మాన్ని ఆచరించేవారు, సత్యాన్ని సదా వ్రతంలా ఆచరించేవారే. ధర్మాన్ని ఆచరించని మనిషి ఈ ధరాతలం మీద తృణప్రాయుడేనన్నది వేదప్రోక్తం.
ధర్మానికి, సత్యానికి చక్కటి నిర్వచనాన్ని అందిస్తూ, తరతరాలకు అనిర్వచనీయమైన సందేశాన్ని చూపిన మహనీయులెందరో ఉన్నారు. హరిశ్చంద్రుడి పేరు వినగానే సత్యసంధతకు ప్రతిరూపం అనేందుకు ప్రతీకగా- ఎవరన్నా తాము నిజమే చెబుతున్నామన్నప్పుడు 'నువ్వేమన్నా సత్య హరిశ్చంద్రుడివా' అంటూ ఉంటారు. అలాగే, దానధర్మాలను ఆచరించేవారిని కర్ణుడితో పోల్చటం మనకు తెలిసిందే. ధర్మానికి ప్రతిరూపంగా ఎవరినన్నా ప్రస్తావించేటప్పుడు 'ఆయన అక్షరాలా ధర్మరాజే!' అనడం పరిపాటి. యుగధర్మం మారినా అత్యున్నత సుగుణాలకు వారు ప్రతిరూపాలై వెలుగుతూనే ఉన్నారు.

మహాభారతంలోని విరాటపర్వంలో ఒక ఉదాహరణ- ధర్మచరితుల గొప్పతనాన్ని మన కళ్లకు కడుతుంది. పన్నెండేళ్ల వనవాసం తరవాత పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తిచేసే సమయమది. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేసే తలంపుతో వారిని ఎక్కడ అన్వేషించాలని తలమునకలవుతూ తనను ప్రశ్నించిన దుర్యోధనుడితో భీష్మ పితామహుడిలా అంటాడు. 'సుయోధనా! పాండవులు ధర్మస్వరూపులు. ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడివారిలో పరోపకార బుద్ధి, నీతివర్తనంలో అనురక్తి, నిత్యమూ సత్యసంధులై ఉండే జనం, సమృద్ధిగా పాడినిచ్చే పుష్కలమైన గో సంపద, సతతమూ సస్యశ్యామలంగా పెరిగే పైర్లు, సుభిక్షమైన రాజ్య పాలన కనిపిస్తాయి' అంటూ- ఇటువంటి ఉత్తమ లక్షణాలు కలిగింది విరాట రాజ్యం కాబట్టి పాండవులు అక్కడే అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటారని నమ్మకంగా ప్రస్తావిస్తాడు. చివరికి భీష్ముడు చెప్పినట్లే, పాండవులంతా విరాటుడి రాజ్యంలోనే ఉంటారు. ఈ ఉదంతం ధర్మనందనుడి ధర్మనిష్ఠకు, పాండవుల ఆదర్శ జీవితానికి అద్దం పడుతుంది.

సత్య హరిశ్చంద్రుడి కమనీయ చరితం- సత్యనిష్ఠ గొప్పతనాన్ని భారతావని అంతటా మహాద్భుతంగా ఆవిష్కరించింది. ఇక్ష్వాక వంశజుడైన రాజశ్రేష్ఠుడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం, సత్యమే జీవితాలంబనగా అష్టకష్టాలు అనుభవించాడు. చివరికి భార్యాబిడ్డల్నీ అమ్ముకున్నాడు. అందుకే యుగాలు మారినా, ఆయన చెదరని కీర్తికి దీప్తిగా భాసిస్తూ ఉన్నాడు.

అందుకే ధర్మదీక్షలో సాగితే- అదే, ఈ ప్రపంచానికి రక్ష! ధర్మాన్ని నిరసించేవాడికి ప్రాయశ్చిత్తం లేదు. ఎవడో అధర్మంతో చరించి సుఖిస్తున్నాడని మనం ధర్మపథాన్ని వీడకూడదు. స్వర్గానికి, నరకానికి ఎంత భేదం ఉందో ధర్మానికి, అధర్మానికి అంతే తేడా ఉంది. భూతలం మీద మనం ఆచరించే ధర్మదీక్ష, స్వర్గారోహణకు సోపానం వంటిది. మనం చేసే ధర్మకార్యాలు జీవిగా మనకు పుణ్యఫలాలను ప్రసాదిస్తాయి. అదేవిధంగా సత్యవ్రతమే మనకు విహితమైన మతం, సదా సమ్మతం. అది సకల జనులకు హితం.

- వెంకట్ గరికపాటి