ᐅఆధ్యాత్మికానందం




ఆధ్యాత్మికానందం 

'అద్దాలమేడలో ఉన్నవాడు దారినపోయే వాళ్లమీద రాళ్లు రువ్వరాదు' అని మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే వాళ్లు తిరిగి రాళ్లు రువ్వితే ఆ మేడకే నష్టంకాబట్టి. మనలో ఎన్నోకొన్ని లోపాలు, బలహీనతలు ఉంచుకుని ఎదుటివాళ్లను విమర్శిస్తే... అవి వెనుదిరిగి మనకే తగులుతాయి. ముందుగా మన లోపాలను సరిదిద్దుకున్న తరవాతే అవతలివాళ్లకు నీతులు చెప్పాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకామె వచ్చి తన కొడుకు విపరీతంగా మిఠాయిలు తింటున్నాడనీ ఈ వ్యసనం మాన్పించమని అర్థించిందట. పదిరోజుల తరవాత అబ్బాయిని తీసుకురమ్మని స్వామీజీ కోరారట. ఆమె అలాగే పదిరోజుల తరవాత వస్తే ఆ బాలుడికి నచ్చజెప్పి పరమహంస ఆ వ్యసనం నుంచి విముక్తి కలిగించారట. ఆమె ఆశ్చర్యపోతూ 'ఈ పని మీరు మొదట్లోనే చేయవచ్చుకదా' అని అడిగిందట. దానికాయన బదులిస్తూ 'అమ్మా నాక్కూడా మిఠాయిలు తినే అలవాటుంది. ముందుగా నన్ను నేను సంస్కరించుకుంటేగదా ఇతరులకు బోధించే నైతిక హక్కు వస్తుంది' అన్నారట. ఇది చాలామందికి తెలిసిందే అయినా- ఎంతో పరమార్థం ఇందులో దాగి ఉంది.
ఆధ్యాత్మిక పరిణతి సాధించినవారికి మాత్రమే నిగ్రహం, నిబద్ధత, నిజాయతీ వంటి లక్షణాలు అబ్బుతాయి. చాలమంది 'పుడతారు... పెరుగుతారు... మరణిస్తారు' అన్న ప్రకారమే బతుకుతారు. కొందరు మాత్రమే తమ జీవితాలను నియమబద్ధంగా మలచుకొని పరులకు ఆదర్శప్రాయులవుతారు. భగవంతుని కొలవడానికి భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలను అనుసరిస్తారు. త్యాగయ్య, అన్నమయ్య వంటివారు భక్తితో, ఎందరో శాస్త్రవేత్తలు జ్ఞానంతో, బుద్ధుడిలా వైరాగ్యంతో మోక్షాన్ని పొందుతారు.

మనం మరణించాక కూడా ప్రజల నాలుకల మీద బతికి ఉండాలంటే మంచి రచనలు చేయాలి... లేదా మన జీవితాలే రచనలుగా మారేలా జీవించాలి! పరమ పవిత్రమైన ఆధ్యాత్మికత ఈ రోజుల్లో స్వార్థ, వాణిజ్య, ఆర్థిక శృంఖలాలకు చిక్కి విలవిల్లాడుతోంది. అక్రమ మార్గాల్లో నానాగడ్డీ కరచి దోచుకున్న ధనంతో కోట్లాది రూపాయలు వెచ్చించి తిరుపతి వేంకటేశ్వరుడికో లేక మరొక దేవతకో బంగారు కిరీటం, వజ్రాల వడ్డాణం సమర్పించినంత మాత్రాన చేసిన పాపాలు పోయి పునీతులవుతారా? మహా అయితే- కుహనా భక్తుల నుంచి జేజేలు లభిస్తాయి. నోములూ వ్రతాలూ, గుళ్లూ గోపురాలు, పూజలూ పునస్కారాలు లక్ష్యసాధనకు మార్గాలేకాని లక్ష్యాలు కావు. ఆధ్యాత్మికత అంటే విశిష్టమైన, విలక్షణమైన జీవనవిధానం... ఓ దివ్యానుభూతి! దీనికి విరామం, వియోగం ఉండవు. ఆత్మ పరమాత్మల సంయోగమే గమ్యం. 'అహంబ్రహ్మాస్మి' అన్నదే ధ్యేయం, ఆత్మసమర్పణే అంతిమలక్ష్యం. ఈ పయనంలో ఎదురయ్యే కలతలు, కన్నీళ్లు, కష్టాలు వారినేమీ చేయలేవు. కర్తవ్యపాలనను మరువరు. కఠోరదీక్షతో, వజ్రసంకల్పంతో ముందుకు దూసుకుపోతారు. సుఖం, సంతోషం, ఆనందం మధ్యనున్న సన్నని గీతల్ని వారు చెరిపేస్తారు. నిజం, సత్యం, వాస్తవం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. ధర్మం, ఆపద్ధర్మం, విశేష ధర్మాలమధ్య వ్యత్యాసాలను తెలుసుకుంటారు. ఆపై భావాతీత స్థితికి చేరుకుంటారు. ఈ జీవితం 'నట్టనడి నాటకం' అని నమ్ముతారు. కలుషితకాసారంలో పుట్టిన కలువలు, కమలాలకు ఆ కాలుష్యం ఎలా అంటదో- అలాంటి స్థితికి చేరుకుంటారు. కళ్లు మూసుకుని అంతరిక్షంలో విహరించి విశ్వవిన్యాసాన్ని వీక్షిస్తారు. తామెంత అల్పులో గుర్తిస్తారు. అలా... అలా మనోనేత్రంతో లోకాలు, లోకస్థులు లోకేశుల పరిధులు దాటి ఇహాన్ని పరాన్ని ఏకంచేసి పెంజీకటికావల దాగి ఉన్న పరమేశ్వర తత్వాన్ని గ్రహిస్తారు. ఆ స్థితిలో ఇక వెలుపల, లోపల దాపల అన్న భేదాలే ఉండవు. ఎటుచూసినా అనుభవైకవేద్యమైన ఆధ్యాత్మికానందమే!

- కిల్లాన మోహన్‌బాబు