ᐅచిట్టిపొట్టి మెట్లు
ఆధునికత జీవితాన్ని పరుగుపందెంగా మార్చింది. దేనికీ సమయం లేదు... తిండికి, నిద్రకు, దాంపత్య జీవితానికి, చివరకు పిల్లల్ని కనేందుకూ! తల్లిదండ్రులు, అతిథి అభ్యాగతుల సేవ, బంధుప్రీతి, సంస్కృతీ సంప్రదాయం అనుసరణ... చాలావరకు మరుగున పడిపోయాయి. ఇక దైవం, ధ్యానం, జపం, తపం...! జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగమనికానీ, అసలు జీవితమే అదనిగానీ చాలామందికి తెలీదు. తెలుసుకునే అవకాశమూ లేదు. కారణం సమయాభావం. అదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో ఎందరో... ముఖ్యంగా యువత... భక్తిపట్ల, ఆధ్యాత్మ జీవితంపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ధ్యానం చేయాలనే అభిలాష వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిజాయతీగా భగవంతునిపట్ల ఉన్ముఖులై, అయినా ఎప్పుడు భక్తి సాధనలు చేయాలో అర్థంకాక అయోమయ స్థితిలో ఉండిపోతున్నారు. కారణం... వారికి సమయం దొరకడంలేదు. దొరికింది చాలటంలేదు. ఓ గంటసేపు ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యానం చేసుకునేందుకు వీలు కుదరటంలేదు. అసలే అంతంతమాత్రంగా, ఛాయామాత్రంగా ఉన్న భక్తి ఇక ఏమాత్రం సాధన చేయకపోతే బలపడేదెన్నడు? గమ్యం చేరేదెన్నడు? కొందరు ఆసక్తితో, కొందరు నిజభక్తితో, అందరూ సమయాభావంతో...! ఈ సమస్యకు పరిష్కారం?
స్వామి శివానంద ఈ సమస్యకో పరిష్కారం సూచించారు. అనివార్యమైన పనులతో గడచిపోతున్న 'రోజు'లో ఆధ్యాత్మిక సాధనలకు గంటో రెండు గంటలో లభించడం కష్టమే. నిజమే. కానీ చేస్తున్న పనుల మధ్య అప్రయత్నంగా అప్పుడప్పుడు ఒకటి రెండు నిమిషాలు ఖాళీ ఉండటం వాస్తవమే. ఆ కొద్ది సమయాల్ని ఏం చేయాలో తోచక కార్యాలయాల్లో అయితే పక్కవారితో మాట్లాడేందుకో, ఇంట్లో అయితే టీవీ చూసేందుకో ఆసక్తి చూపుతారు. అలాంటివే మరేవైనా అప్రధానమైన పనులూ కావచ్చు. అంతకంటే, మరికాస్త ముఖ్యమైన పనులు చూసుకునేంత దీర్ఘ సమయం కాదుకాబట్టి అలా సరదాగా గడిపేందుకు మొగ్గు చూపుతారు. సహజమే. విజ్ఞులు ఆ చిట్టిపొట్టి కాలపు ముక్కలను అతకమంటారు. ఎలాగంటే ఎప్పుడు ఏ కొన్ని నిమిషాలో అక్కర్లేదు. క్షణాలు దొరికినా కళ్లు మూసుకుని, చేతులు ఒళ్లో పెట్టుకుని దైవ చింతనలో ఉండిపోవడమే. అది ధ్యానమా, జపమా, స్మరణా, చింతనా, ఆలోచనా... ఏదైనా కావచ్చు. దాని కేంద్ర బిందువు భగవంతుడై ఉండాలి. అంతమాత్రాన... ఏమవుతుంది? ఎంతో అవుతుంది. ఎంతైనా అవుతుంది. పైసాపైసా కూడితే రూపాయి అవుతుంది. చుక్కచుక్కా పడితే బిందె నిండుతుంది. ఇది కూడా అంతే. అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా చింతన చేయటం అలవాటు చేసుకుంటే ముందుగా చింత తీరుతుంది. ఎందుకంటే ఏ కాస్త ఖాళీ దొరికినా వ్యతిరేక భావనలతో చింత చేస్తూపోవడం లేదా దొరికిన వ్యక్తులతో ఆ ధోరణిలో మాట్లాడటం మనలో చాలామందికి అలవాటు. అలా కొద్దికొద్దిగా నామస్మరణో, ధ్యానమో అలవరచుకుంటే ఆ చిన్నచిన్న క్షణాలు, నిమిషాల కూడిక రోజులో కనీసం గంటో, ముప్పావు గంటో అవుతుంది. గంటా రెండు గంటలూ కూర్చున్నా ధ్యానం కుదరటంలేదనే బెంగ ఈ చిన్న చిన్న ప్రయత్నాలతో తీరుతుంది. ఈ చిరుచిరు ప్రయత్నాల కూర్పు, పేర్పు దీర్ఘకాల ప్రయత్నానికి సహాయకారి అవుతుంది. ఈ బుడిబుడిమెట్లు ఎక్కే ప్రయత్నం- పై విశాల పరమ ప్రాంగణ అధిరోహణకు దోహదం చేస్తుంది.
నిత్య జీవితంలో అడపాదడపా అప్రయత్నంగా మనకు లభించే చిన్నచిన్న తీరిక సమయాలనూ ఈ రీతిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. బస్సు, రైలు ప్రయాణాల్లో దొరికే దీర్ఘ సమయాలే కాదు. ఆటోల్లో వెళ్లే సందర్భాల్లో పక్కన దారి, గమ్యం గమనించే తోడు ఉండినట్లయితే గమ్యాన్ని చేరేదాకా మనం నిమీలిత నేత్రులమై ఉండవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు కార్యక్రమం మధ్యమధ్య వచ్చే ప్రకటనల సమయాల్లోనూ మనం కళ్లు మూసుకుని చింతనో, ధ్యానమో చేసుకోవచ్చు. మరీ స్వల్ప సమయమైతే వీలైనంత జపం చేసుకోవచ్చు. మూసుకున్న కళ్ల వెనక అందమైన, అద్భుతమైన ప్రపంచాన్ని సృజించుకుని ఆనందంగా విహరించవచ్చు. హృదయ మధ్యంలో పరమపురుషుడు విరాజమానుడై ఉన్న దృశ్యాన్ని ఆనందించవచ్చు. లేదా నిరామయంగా, నిరాకారంగా మహామౌనాన్ని ఆస్వాదించవచ్చు. అనన్యతను, ఆకాశాన్ని అనుభూతి చెందవచ్చు.
- చక్కిలం విజయలక్ష్మి