ᐅబుద్ధిజీవి
ఇంద్రియాలకన్నా మనసు, మనసుకన్నా బుద్ధి, అంతకుమించి ఆత్మ అంతస్తుల ప్రకారం మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఆత్మ కనిపించని వస్తువు. దానికదే ప్రకాశిస్తుంది. అయినా, ఆత్మను తెలుసుకోవటానికి మనసును, బుద్ధిని మనిషి ఉపకరణాలుగా వాడుకోవాలి. మనసు అనేది లేకపోతే మనిషి అనేవాడు అసలు ఉండడు. అది రెండువైపులా పదును కలిగిన కత్తిలాంటిది. అజ్ఞానమనే చీకటిపొరను ఛేదించటానికి, భవబంధాల నుంచి బయటపడటానికి మనసు సాధనం.
భౌతికమైన కోరికలు, క్షణికమైన సుఖాలు అనుభవించటానికి మనసును వాడుకోవటంవల్ల మనిషి ఎలా దిగజారతాడో మహాభారతం మనకు చెబుతున్నది. నహుషుడు అనే చక్రవర్తి నూరు యజ్ఞాలు చేసి ఇంద్రపదవిని చేపట్టాడు. మూడు లోకాల ఆధిపత్యం చేజిక్కించుకున్న ఆ చక్రవర్తికి అహంకారం పెరిగిపోయింది. సింహాసనంతోపాటు దేవేంద్రుడి పట్టమహిషి శచీదేవి తన పట్టపురాణి కావాలని పట్టుపట్టాడు. కామాంధుడైన నహుషుడు రుషులతో పల్లకి మోయించి శచీదేవి మందిరానికి బయలుదేరాడు. కామాతురుడై అగస్త్యమహర్షిని కాలదన్నాడు. కామ్యకర్మవల్ల కలిగిన పుణ్యంకాస్తా కరిగిపోయింది. 'సర్ప సర్ప' అంటూ తనను అదిలించిన నహుషుడిపై ఆగ్రహించి ఆ రుషి ఘోరంగా శపించాడు. ఘట సర్పమై నహుషుడు అడవిపాలయ్యాడు.
ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. అజగరం అయి పడివున్న నహుషుడు భీమసేనుణ్ని బంధించాడు. తన ప్రశ్నలకు తగిన సమాధానం చెబితేగాని, భీముణ్ని విడిచిపెట్టనని ధర్మరాజును నిర్బంధించాడు. యుధిష్ఠిరుడు సరైన సమాధానాలు చెబితేగాని, నహుషుడికి శాపవిమోచనం కలగదు. నహుషుడు మనసుమాట విని ధర్మం తప్పాడు. ధర్మాత్ముడైన పాండవాగ్రజుడు ధర్మం చెప్పాడు.
ఇంద్రియాలు గుర్రాల్లాంటివి. పదేపదే మనసును తమవైపు లాగుతాయి. కళ్లెం బిగించి మనిషి మనసును అదుపుచేయాలి. బుద్ధి సారథిలాంటిది. చాకచక్యంగా రథాన్ని నడిపి గమ్యం చేర్చగలవాడే తెలివైన సారథి. మనసును మాత్రమే నమ్ముకుంటే మనిషి జీవన రథం, నహుషుడిలా బోల్తా కొడుతుంది మధ్యంతరంగా. బుద్ధిని ఆశ్రయించి మసలుకొనేవాడు బుద్ధిజీవి.
మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం- కనిపించని పరికరాలు, మనసు వెంట పరుగులెత్తే మనిషి ఊబిలో దున్నలా, విషయాల విషవలయంలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంటాడు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితినుంచి బయటపడటానికి బుద్ధిని ఉపయోగించాలి. ఏది తగునో ఏది కాదో బుద్ధిని అడిగి తెలుసుకోవాలి. సంశయించేది మనసు. నిశ్చయించేది బుద్ధి. సరైన నిర్ణయం తీసుకుని తనదైన శైలిలో జీవించటం బుద్ధిమంతుడి లక్షణం. మనసు, బుద్ధి, అహంకారం మూడు చిత్తవృత్తులకు మూలధారం చిత్తం. చిత్తవృత్తాన్ని నిరోధించటమే యోగం అంటాడు పతంజలి. బుద్ధిని మనసుకు బానిస చేయకుండా ఆత్మపక్షం చేయటమే యోగం.
బుద్ధిమంతుడైన హనుమంతుడు మంత్రి కావటంవల్లే సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడి స్నేహం లభించింది. దేహబలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించుకోవచ్చు. సుఖశాంతులతో జీవించనూవచ్చు. ఎంతటి శ్రీమంతుడైనా బుద్ధిజీవికి సామంతుడే!
- వి.రాఘవేంద్రరావు