ᐅశరణాగతి



శరణాగతి 

భగవంతునిపైనే భారమంతా వేసి భక్తితో జీవించడమే శరణాగతి. దైవమా... నీవే తప్ప ఇతరాలేమీ తెలియని వాడనని భావించడం పరిపూర్ణ భక్తికి తార్కాణం. శరణాగతినే భక్తియోగమనీ అంటారు. శరణాగతి చేసే సాధకుడు పసివాడితో సమానం. తల్లి తప్ప ఇతరులెవరూ తెలియని పాపాయిలాంటివాడు భక్తియోగి. ప్రతి అవసరానికీ తల్లిపై ఆధారపడటం తప్ప పసివాడికి మరేమీ తెలియదు. ఆకలైతే తల్లే పాలు పట్టాలి. స్నానం తల్లే చేయించాలి. ఆరాటపడే పాపాయిని తల్లే అక్కున చేర్చుకోవాలి. చివరికి జోలపాట పాడి నిద్రబుచ్చాలి. ఇలా దైనందిన జీవితంలో పసిపాప ప్రతి అవసరానికీ తల్లిపై ఆధారపడినట్లే, సర్వం విస్మరించి భగవంతుడిపై ఆధారపడి భక్తుడు జీవిస్తాడు. అలాంటి జీవనసాధనతో శరణాగతి చేసిన భక్తుడు పరమపద సోపానాలను తేలిగ్గా అధిరోహించగలుగుతాడు. భేషజాలు, గర్వం, దేహచింతన కలిగినవారు భగవంతుని పూజించినా సాఫల్యత లభించదు. కాపాడాల్సిన వాడివు నీవే సుమా అని వేడుకొన్న భక్తుడికి మరణం సంభవించినా అదే భక్తిభావంతో- 'ఈ పాపకూపాన్నుంచి విముక్తి కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రీ!' అంటాడట. భిక్షాటనచేసి కడుపు నింపుకొనే యోగులకు జోలెలో పడిన పరమాన్నానికీ రొట్టెతునకకూ తేడా తెలియదు. భగవంతుడిపై నుంచి దృష్టిని మరల్చగలిగే ఆకలిని ఆపడమే యోగికి అవసరం. రుచులతో వారికి సంబంధం ఉండదు. దైవకృపవల్ల దొరికిందే యోగికి చాలు. ఎందుకంటే పరమాన్నంకన్నా పరమాత్ముడిపై భక్తి- సాధకుడికి అత్యంత రుచికరమైంది. రామనామమే రుచికరమైందని కంచెర్ల గోపన్న అంటాడు.
శరణాగతి చేయడంలో హనుమంతుడి కన్నా మించిన భక్తులు లేరని ప్రతీతి. శ్రీరాముణ్ని హనుమంతుడు ఆరాధించిన తీరు ఇతరులకు సాధ్యం కానిది. దేవాలయానికి వెళ్లి మూర్తిని దర్శించుకొని కాపాడమని కోరేవాడు శరణాగతి తెలియనివాడు. నిజమైన భక్తుడికి భగవంతుడిపై ఆరాధన తప్ప మరేమీ ఉండదు, తెలియదు. ఎన్నో సంవత్సరాల తరవాత కనిపించిన ఇష్టులను చూసినంత సంతోషం, పులకింత... ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ భక్తుడికి కలుగుతాయి. భగవంతుడిపై అలాంటి ప్రేమ... నిర్వచనానికి అందనిది.

రావణాసురుని సంహారం తరవాత పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు ఒకసారి హనుమంతుణ్ని ఇలా ప్రశ్నించాడట- 'హనుమా! నీకూ నాకూ ఉన్న అనుబంధం ఎలాంటిదంటావ్?' అని. హనుమంతుడి సమాధానమే శరణాగతి తత్వానికి నిజమైన నిర్వచనం. 'శ్రీరామా... శారీరకంగా నీవూ నేనూ వేరు. భావనాపరంగా నీవు యజమానివి, నేను బంటుని. ఆధ్యాత్మికంగా నీవూ నేనూ వేరు కాదు. నీవే నేను... నేనే నీవు!' అని బదులిచ్చాడు. ఇదీ శరణాగతికి ప్రతీక. భక్తుడు సంపూర్ణంగా భగవంతుని వశం కావాలి. 'నేనూ భగవంతుడూ ఒకటే (అహం బ్రహ్మాస్మి)' అని భావించాలి. నిరంతరం మన మేలు కోరేవాడినీ, అడగకముందే ఇచ్చేవాడినీ ప్రేమించడం తప్ప మరేమీ అర్థించాల్సిన అవసరం ఉండదు. మనం దేనికి అర్హులమో ఏది మనకు అవసరమో తెలిసిన యజమాని ఉన్నాడనే భావన కలిగితే ఆ యజమానికి మనం ప్రయత్నం చేయకుండానే దాసులమైపోతాం. అలాంటి దాస్యత్వం భగవంతుడికి మనం చేయగలిగితే, శరణాగతి చేసినట్లే!

లంకలో రావణుడి ముందు హనుమంతుడు నిలబడి వుంటే రావణుడు నీవెవరివి అని అడిగాడు. నేనా? దాసోహం కోసలేంద్రస్య (కోసలాధీశుడైన శ్రీరామునికి దాసుడను) అన్నాడు. సర్వం త్యజించి దైవానికి ఆత్మసమర్పణ చేసుకోవడం కన్నా ఇంకేముంటుంది? ఆ ఆత్మ సమర్పణే శరణాగతి!

- అప్పరుసు రమాకాంతరావు