ᐅమానవత్వమే మతం




మానవత్వమే మతం 

యుగయుగాలుగా మనిషి మతాల వైరుధ్యంతో, విభేదాలతో, కొట్లాటలతో రోజులు దొర్లిస్తున్నాడు. మత వైషమ్యాల వల్ల రక్తపుటేళ్లు పారాయి. స్త్రీ బాల వృద్ధులెందరో అమానుషంగా హతమారిపోయారు. ఏ మతమూ హింసను అనుమతించదు. ప్రతి మతమూ మానవత్వాన్ని మధురంగా బోధిస్తుంది, కర్తవ్యాలున నిర్వచించడానికి దారి చూపుతుంది.
మనుషుల్లో శిల వేసుకుపోయిన కరకు స్వార్థం సాధారణంగా వీటిని స్వీకరించదు. ఎవరి ఆధిక్యం కోసం వారు తమదైన పద్ధతుల్లో మత విస్తరణ ప్రయత్నాలు చేస్తుంటారు. యుద్ధాలకైనా సంసిద్ధులవుతారు తప్ప జీవకారుణ్యమే మతాల మూలకాండమనే సత్యాన్ని గ్రహించరు. అలాంటి సమయాల్లోనే మహాపురుషుల జననం జరుగుతుంది. ఎండి బీటలిచ్చిన మానవత్వపు మాగాణి నేలమీద వారు దైవబోధలనే అమృత వర్షాలు కురిపిస్తారు.

అలాంటి మహాత్ముడే గురు నానక్ దేవ్.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న తల్వాండీలో ఆయన జన్మించారు. తల్వాండీనే ఇప్పుడు సిక్కుల పవిత్ర క్షేత్రమైన 'నన్‌కానా సాహిబ్'గా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు తృప్త, కల్యాణ్ చంద్. తండ్రిని మెహతా కాలూగా అందరూ పిలిచేవారు.

నానక్ కారణజన్ముడనే సూచనలు బాల్యంలోనే స్పష్టంగా కనిపించేవంటారు. ఆయన మూఢ మతవిశ్వాసాలను తిరస్కరించేవారు. అందుకు రుజువే ఆయన తన ఉపనయన సంస్కారాన్ని గట్టిగా వ్యతిరేకించడం. అది క్షత్రియ కులాచారంగా వారింట్లో అందరూ పాటించేవారు. కానీ, నానక్ నిజమైన ఉపనయనం జంధ్యం ధరించడం వల్లకాక, దైవధర్మాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే లభిస్తుందని వివరించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. నాటితో ఆరంభమైన ఆయన దివ్యబోధలు, ఉషోదయంతో వెలువడే ఆదిత్య కిరణాల్లా ప్రపంచమంతటా వెలుగులు ప్రసరింపజేశాయి. అజ్ఞాన తిమిరంనుంచి బయటపడి ఎందరో ఆయన శిష్యులయ్యారు. సిక్కు అంటే శిష్యుడని అర్థం.

అన్ని మతాలూ గురువు గొప్పదనం గురించి, ప్రవక్తల ఘనత గురించి చెప్పినా- ఒక్క సిక్కు మతంలోనే గురువును పరమాత్మ స్వరూపంగా ఆరాధిస్తారు. 'వాహె గురు' వారి ఏకైక ధ్యానమంత్రం.

గురువు ఆజ్ఞ అంటే సిక్కులకు ప్రాణం కన్న మిన్న.

గురువు కోసం ప్రాణాలను గడ్డిపోచలుగా అర్పించిన ఘన చరిత్ర సిక్కులది. భారత దేశ మూలకాండంగా చెప్పదగిన 'హిందూ ధర్మం' నేటికీ వర్ధిల్లుతోందంటే, గురు తేగ్‌బహదూర్ అసమాన ప్రాణత్యాగమే కారణం.

గురు నానక్ దేవ్‌తో ఆరంభమైన 'మానవత్వ మతం' గురు అంగద్ దేవ్, గురు అమర్ దాస్, గురు రామ్ దాస్, గురు అర్జున్ దేవ్, గురు హర్‌గోబింద్, గురు హర్ రాయ్, గురు హర్ కిషన్, గురు తేగ్ బహదూర్, గురు గోబింద్ సింగ్ వరకు నిరాఘాటంగా కొనసాగింది.

గురు నానక్ దేవ్ దివ్యాత్మ తదుపరి తొమ్మిది మంది గురువుల దేహాల్లో ప్రభవించిందని సిక్కులు విశ్వసిస్తారు. అందువల్లనే మిగతా గురువులను వారి సంఖ్యతో నానక్‌దేవ్ అని వ్యవహరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు గురు నానక్ జయంతిని సిక్కులు వైభవంగా జరుపుకొంటారు.

గురునానక్ ఒక కొత్త ప్రపంచంలో సూర్యుడిగా అవతరించారు. ఆయన స్థాపించిన మానవత్వ మతమే నేటికీ దైవ ధర్మంగా ప్రవర్ధిల్లుతోంది. అదే సిక్కు ధర్మం.

ప్రస్తుతం శాశ్వత గురువు 'గురుగ్రంథ సాహిబ్'.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్