ᐅకరుణ




కరుణ 

లోకంలో సుందరమైనదేది అనే ప్రశ్నకు అనేక సమాధానాలు వినవస్తాయి. జ్ఞానం అంటాడొక విద్యావేత్త. న్యాయం అంటాడొక న్యాయమూర్తి. సత్యం అంటాడు వేదాంతి. ప్రకృతి అని పలుకుతాడు ఒక జ్ఞాని. ఉల్లాసం అంటాడొక మూఢుడు. వలపు అంటుందొక యువతి. అందం అంటాడో యువకుడు. స్వేచ్ఛ అని పలుకుతాడొక ఊహాజీవి. ఇవేవీ సరైన సమాధానాలు కావని 'కరుణ' మాత్రమే అందమైనదని సహృదయుడు, రసార్ద్రచిత్తుడు అయిన కవి భావిస్తాడు. 'సృష్టి కరుణామయం- జీవితం కరుణామయం.' ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలో విలీనమవుతుందని అంటారు కవి కరుణశ్రీ. కన్నీళ్ల విలువ తెలియనివాడు కవిత్వం రాయలేడంటారాయన.
కరుణ ఒక్కటే రసం అంటారు భవభూతి మహాకవి ఉత్తర రామచరిత్ర నాటకంలో. నిమిత్తభేదం చేత నీరు సుడులు, బుడగలు, అలలు మొదలైన అనేక రూపాలు పొందినట్లు- కరుణ కూడా అనేకరూపాల్లో కనిపిస్తుంది. క్రౌంచ పక్షుల జంట వియోగంనుంచి పుట్టిన శోకమే శ్లోకరూపం ధరించి రామాయణకావ్యం ఆవిర్భవించింది. కరుణ శోకమనే స్థాయీభావంవల్ల ప్రభవిస్తుంది.

భాగవతంలో సుదాముడనే మాలాకారుడు మధురానగరంలో శ్రీకృష్ణుని తనకు 'నితాంతాపార భూతదయ'ను ప్రసాదించమని ప్రార్థిస్తాడు. దయాగుణం లేనివాడి జన్మ వ్యర్థమంటాడు పోతన్న.

భగవంతుడు కరుణామయుడు. సృష్టిలోని ప్రాణికోటికై అందునా మానవాళిపై పరమాత్ముడు అపారమైన దయను ప్రసరిస్తూనే ఉంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ధ్రువుడు మొదలైన భక్తులందరినీ కరుణామృతం కురిపించి కాపాడిన భగవంతుడి గురించి పురాణాలు తెలియజెబుతున్నాయి.

జీమూతవాహనుడనే విద్యాధర యువకుడు గరుడుడికి ఆహారమవుతున్న నాగజాతి పట్ల కరుణాళువై శంఖచూడుడనే పన్నగ కుమారుడికి బదులు తానే ఆహారంగా వెళ్లడానికి సిద్ధమవుతాడు. పావురాన్ని రక్షించడానికి శిబి చక్రవర్తి తన శరీరమాంసాన్ని కోసి ఇవ్వడమూ కరుణ జన్యమే. అంధకార బంధురమైన ప్రపంచంలో బుద్ధ భగవానుడు, క్రీస్తుప్రభువు, గాంధీ మహాత్ముడు కరుణాళువులై లోకంలోని కాలుష్యాన్ని కడిగి మానవజాతిని పునీతం చేశారు. కరుణ హృదయాన్ని ఆర్ద్రంచేసి ప్రేమ, అహింస, పరోపకారం వంటి సద్గుణాలను వృద్ధిచెందించి మనుషుల్ని మానవతామూర్తులుగా తీర్చిదిద్దుతుంది. హింసామయమై, ఈర్ష్యాద్వేషాలతో కలుషితమై అస్తవ్యస్తంగా ఉన్న నేటి సమాజానికి కరుణ ఆవశ్యకమైన గుణం. కరుణ శాంతిని ఇస్తుంది. శుభాలను, సౌఖ్యాలను ఒనగూరుస్తుంది. 'కరుణలేని నరుడు గడ్డి బొమ్మ' అంటారు కరుణశ్రీ.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు