ᐅబక్రీదు పర్వదినం




బక్రీదు పర్వదినం 

గతంలోని ఘనతను, మంచిని, త్యాగాల్ని చిత్తశుద్ధితో స్మరించుకొంటున్నప్పుడు మనిషిలోని అహం తలవంచుతుంది. ప్రేమభావం ప్రభవించి. పుడమి పునీతమవుతుంది. శాంతి వెలుగుల జీవనానికి అరుణోదయం జనుల మధ్య అవతరిస్తుంది.
విశ్వప్రభువుకు ఇష్టమైనవి త్యాగం, సత్యం, ధర్మం, దయ, పరోపకారం, ప్రేమ, విశ్వశ్రేయం వంటివి. వివేకం, సిరిసంపదలు, సంతానం- ప్రసాదించిన దైవం విశ్వాసిని పరీక్షిస్తాడు. దైవపరీక్షలో ఔన్నత్యాన్ని, అసమాన త్యాగభావాన్ని వ్యక్తంచేశారు ప్రవక్త ఇబ్రాహీమ్. ఆయన ఇస్లామ్ ఇతిహాసంలో చిరస్థాయిగా నిలిచారు. ముస్లిములు ప్రవక్త ఇబ్రాహీమ్ పవిత్ర జీవితాన్ని, ఆపదల్లో ఆయన ప్రదర్శించిన అనంత నిర్భయత్వాన్ని, దైవభక్తిని, సేవాపరత్వాన్ని, అత్యంత అభినందనీయమైన త్యాగాన్ని స్మరిస్తూ ఈదుల్ అజ్‌హా (బక్రీదు) జరుపుకొంటారు. అజ్‌హా అంటే విశ్వవిభుడికి సమర్పించే బలిదానమని అర్థం.

సుమారు నాలుగువేల సంవత్సరాల నాడు- అరేబియా దేశం విభిన్న మార్గాల్లో నడిచే జనులవల్ల అల్లకల్లోలంగా ఉండేది. బహుదేవతారాధన సర్వత్రా ప్రబలింది. సామాజిక న్యాయం వూపిరి కోల్పోయింది. ఆ దేశ పాలకుడు నమ్రూద్ గుణశూన్యుడు. దురహంకారాంధుడు. తానూ దేవుణ్నే అని ప్రకటించుకొన్నాడు. ఇలాంటి తరుణంలో ఆ దేశంలో హజ్రత్ ఇబ్రాహీమ్ అనే ప్రవక్త సకల చరాచర సృష్టికి మూలకారకుడైన విశ్వవిభుని మాత్రమే పూజించాలని ప్రబోధించారు. ఐహిక విషయాలపట్ల ఆసక్తి మనిషిని సత్యమార్గాలనుంచి తప్పిస్తుందని తెలియజెప్పారు. దైవ ప్రసన్నతకోసం ఏ త్యాగానికైనా విశ్వాసి సిద్ధం కావాలని తన ఆధ్యాత్మిక భావాలకు భాష్యం పలికారు. ఇబ్రాహీమ్ మాటలోనూ మనసులోనూ తొణికిసలాడిన ప్రబోధం, మంచితనం, కర్తవ్యనిష్ఠ, హితవు నేరాలయ్యాయి. ఆ దేశాధిపతి ప్రవక్తకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. హజ్రత్ ఇబ్రాహీమ్ ధర్మపత్నిని వెంటపెట్టుకొని ఇంటిని, కన్నవారిని, ఉన్న వూరిని, స్వదేశాన్ని వీడి బహుదూరం వెళ్లారు. దైవధర్మాన్ని బోధిస్తూ ప్రేమ, సమత్వాల ఔన్నత్యాన్ని విశదపరుస్తూ, తాత్విక సౌరభాల్ని వెదజల్లుతూ పెక్కుచోట్ల సంచరిస్తూ నిత్య పథికుడయ్యారు. సూడాన్, పాలస్తీనా, ఈజిప్టు వంటి వివిధ దేశాల్లో పర్యటించారు. వృద్ధాప్యం పైబడుతోంది. తన అనంతరం దైవ కార్యనిర్వహణకు, దివ్య సందేశ సంపదల్ని ప్రజలకు అందించేందుకు తనకు సంతానాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. కోరిక ఫలించింది. అందాల మగబిడ్డ కలిగాడు. కాని, భార్యాబిడ్డల్ని ఎడారిలో వదిలి రమ్మని దైవం ఆజ్ఞాపించినట్లు ఇబ్రాహీమ్ భావించారు. అయినా ఆ విషాద బాధాగ్ని ఆయన్ను తాకలేదు. కనీసం గుక్కెడు జలమైనా దొరకని ఎడారిలో భార్యాబిడ్డల్ని వదిలారు. నీటి దప్పికవల్ల బాధపడుతున్న ఆ పసిబాలుడు తనకాలి మడమలతో ఇసుకమీద రాసిన చోట బ్రహ్మాండమైన వూట ఉబికి వచ్చింది. 'ఆబె జమ్ జమ్' పేరుతో ఇప్పటికీ ముస్లిములు ఆ పవిత్ర జలాన్ని తీర్థంగా సేవిస్తుంటారు. ఆ ఎడారిలో ఆనందాల సుమవర్షం కురిసింది. ఆ ప్రాంతమే దివ్యకాంతులు విరజిమ్మే నేటి మక్కా నగరం.

దైవాదేశాన్ని అనుసరించి హజ్రత్ ఇబ్రాహీమ్ తిరిగి వచ్చారు. తనయుడు ఇస్మాయీల్ సహాయంతో మక్కాలో కాబా గృహం నిర్మించారు. ఒకరోజు హజ్రత్ ఇబ్రాహీమ్ తన కుమారుడు ఇస్మాయీల్ కంఠాన్ని స్వహస్తాలతో ఖండిస్తున్నట్లు కలగన్నారు. ఇది దైవాజ్ఞగా భావించారు. విషయాన్ని తండ్రి కుమారుడికి తెలుపగా- కుమారుడు హర్షామోదాలతో దైవాజ్ఞను నెరవేర్చండన్నాడు. దైవనామస్మరణ చేస్తూ ఇబ్రాహీమ్ కుమారుని మెడ జుబహ్ చేయడానికి (కోయడానికి) ఉద్యమించాడు. వెంటనే దైవవాక్కు వినిపించింది- 'ఇబ్రాహీమ్! నీ త్యాగాలు ఫలించాయి. ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణుడవయ్యావు. నీ ఉత్తమ ప్రవర్తన ప్రసన్నత కలిగించింది' అని.

బక్రీదు పర్వదినాన సౌదీ అరేబియాలోని మక్కానగరంలో హజ్ ఆరాధన జరుగుతుంది. ఆధునిక ప్రపంచంనుంచి క్రౌర్యాన్ని, అన్యాయాన్ని, అవినీతిని, అణచివేతను తొలగించాలని, అందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంకావాలని బక్రీదు పర్వదినం పిలుపిస్తోంది. ఇస్లామ్ చరిత్రలో ప్రేమకు, త్యాగానికి చోటు ఉన్నంతవరకు- హజ్రత్ ఇబ్రాహీమ్ స్థానం పదిలం.

-డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా