ᐅక్షీరసాగర మథనం
పురాణాల్లోని గాథలన్నీ కాలక్షేపం కోసం రాసిన కట్టుకథల్లాగా పైకి కనిపిస్తాయి. లోతుగా తరచిచూస్తే వాటిలో అంతరార్థాలుంటాయి. వాటివెనక ఏదో ప్రయోజనం తప్పక ఉంటుంది. వ్యాసాది మహాద్రష్టలు సాక్షాత్కరింపజేసుకున్న దర్శనాలు కథల రూపంలో ఇన్ని యుగాలు నిలబడటం వాటి అజరామర సందేశాలకు నిదర్శనంగా భావించవచ్చు. కొన్ని కథల్లోని సంకేతాలు మనిషి మేధకు కూడా అందవు. మనిషి హేతువు వాటిని వేళాకోళం చేయడం పరిపాటి అయిపోయింది.
అటువంటి గాథల్లో క్షీరసాగర మథనం ఒకటి. అసలు పాలసముద్రం ఉంటుందా? ఉంటే అది మానవ నేత్రాలకు కనిపించాలికదా? అందులోని అమృతం కోసం మందర పర్వతాన్ని వేసి మధించడం సాధ్యమేనా? అది కవికల్పన. ఒక రుషి వూహ అనిపించక మానదు.
ప్రళయకాలంలో పాలసముద్రంపై అనంతమనే (ఆదిశేషువు) సర్పంపై విష్ణువు నిద్రిస్తుంటాడు. పురాణాల్లో ఇది ఒక గొప్ప విచిత్రమైన సాంకేతిక చిత్రం. కొందరు భక్తుల ఇళ్లలో ఆ చిత్రం దర్శనమిస్తూ ఉంటుంది. ప్రాచీన కవులు, పండితులు మూఢనమ్మకంతో గ్రహణ సమయాల్లో సూర్యచంద్రుల్ని రాహుకేతువులనే పెద్ద సర్పాలు కబళిస్తాయని రాసినట్లు ఆధునికులు భావిస్తుంటారు. ఇప్పటికీ గ్రహణాలు అందుకే వస్తున్నాయని నమ్మేవారున్నారు. అటువంటివారే ఈ పాలసముద్ర మథనం కథనం సృష్టించారని ఆధునికులు దాన్ని కొట్టిపారేస్తారు.
విష్ణువు భౌతిక శరీరంతో నిజమైన పాలసముద్రం అలలపై భౌతిక సర్పం పడగలపై నిద్రించాడన్నది వారి కల్పన అని ఆధునికులు నవ్వుకొంటారు. ఈ కథల వెనక ఆధ్యాత్మిక, సాంకేతిక పరమార్థం ఏదీలేదని హేతువు మనకు చెబుతుంది ధీమాగా. ఒక్కసారి వారు ఉపయోగించిన పదాలు పరిశీలిద్దాం. విష్ణువు నిద్రించిన పాముపేరు అనంతుడు. మరొకపేరు ఆదిశేషువు. (కాలానికి ఆది, చివర అని అర్థం). విష్ణువు అంటే సర్వవ్యాపక దైవం. మహావిష్ణువు ప్రళయకాలంలో 'అనంతం' పైన శయనిస్తాడు. సముద్రం అంటే చిరంతన అస్తిత్వానికి సంకేతం. వేదాల్లో కనిపించే సముద్రాలన్నీ కేవలం సంకేతాలు. పాలు నిరపేక్ష మాధుర్యానికి, ఆనందానికి సంకేతం. వేదంలో వామదేవుని మంత్రంలో 'మధు'గా వర్ణించినవి పాలు. అనంతపరివ్యాప్తమైన తన తీయని అస్తిత్వమే, ఒక ఆనందమే పాలసముద్రం. భౌతికమైన పాలు కాదు. భౌతికమైన సర్పం కాదు. ప్రళయానంతరం భౌతిక రూప సృష్టిలో (మందరగిరి) అస్తిత్వసాగర మథనం జరుగుతున్నవేళ దుష్టత్వం కాలకూటం రూపంలో ప్రజ్వరిల్లవచ్చు. భగవంతుడే దాన్ని స్వీకరిస్తాడు. అనంతరం మానవాళికి మిగిలేది అమృత మహార్ణవమే.
ఇన్ని యుగాల మానవజీవన మహాప్రస్థానంలో అమృతత్వమే చివరి భవితవ్యం. దానినే వేదమంత్రంలో 'మృత్యోర్మా అమృతంగమయ' అని ద్రష్టలు వర్ణించారు. యాదృచ్ఛిక, కాల భేలన, విధి సంఘర్షణల విషవలయాల్లో చిక్కుకున్న మానవాళి, మృత్యువు వెన్నాడే ఈ లోకపు అచ్చపు చీకట్లనుంచి విముక్తి పొంది, అమృత భవితవ్య సుమధుర తీరాలు చేరగలడు అని వేదద్రష్టల దర్శనం. వారి ఆశీర్వచనం అదే. అమృతత్వాన్ని పొందడం మనిషికి సాధ్యమనే వేదం చెబుతుంది. అది అసంభవమని మనమే భావించి, మృత్యు వ్యూహాల్లోనే పరిభ్రమిస్తున్నాం. వేదం మనుషుల్ని 'అమృతత్వపు పుత్రులు' అని సంబోధించడం వెనకగల అర్థం అదే.
అమృతత్వాన్ని మనం నమ్మగలిగినప్పుడు ఈ పాలసముద్ర మథనం కల్పిత కథకాదు, ఆధ్యాత్మిక పరమార్థాన్ని దాచుకొన్న ఒక అద్భుత ప్రతీక అని తెలుసుకోగలుగుతాం. పురాణ కథలను కథలుగానే చదివి ఆనందించే శైశవదశనుంచి పెద్దదైన మనసుతో, అంతఃస్ఫూర్తి ప్రజ్వలిత ప్రజ్ఞాప్రాభవంతో వాటిని అర్థం చేసుకోగలిగితే మనకు మిగిలేది సచ్చిదానందమే. మృత్యురహిత స్వర్గమే. నిరంతర అమృత ధారలే!
- కె.యజ్ఞన్న