ᐅజ్ఞానానందం



జ్ఞానానందం 

మేధావి, మహాసచివుడు, వేదవేదాంగ విదుడు, వ్యాకరణ శాస్త్రకోవిదుడు, సంభాషణా చతురుడు, రాజకార్య నిర్వహణదక్షుడు, సర్వలక్షణ సంశోభితుడు.... అంటూ హనుమంతుణ్ని వేనోళ్ల కీర్తించింది- వాల్మీకి రామాయణం. ఆయన చేసిన ప్రతిపనిలోనూ అద్భుతమైన తెలివితేటలు, గొప్ప పరిణతి కనిపిస్తాయి రామాయణం అంతటా!
మరి అంతటి ప్రాజ్ఞుడు, సూక్ష్మగ్రాహి- మండోదరిని చూడగానే సీతగా ఎందుకు పొరపడ్డాడు? అంతటి భ్రాంతికి ఎలా లోనయ్యాడు? పచ్చి అబద్ధాన్ని పరమసత్యంగా భావించి ఆనందానికి లోనై సామాన్యుడి మాదిరి కుప్పిగంతులు వేయడం- హనుమ అంతటివాడికి తగునా? ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే- మండోదరి యౌవన సంపద, శారీరక సౌందర్యం వంటి భౌతిక కారణాలు కొన్ని కనపడతాయి. సర్వమోహిని అయిన అమ్మవారు అసలు కారణం! అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యంగా భ్రమింపజేసే ఆమె లీలామానుష విలాసం నిజమైన కారణం. 'సదసద్రూపధారిణి' అని ఆమెను స్తుతించడంలో రహస్యం అదే! సత్తు, అసత్తు రెండు వేషధారణలూ ఆమెవే! అసత్తులో సత్తు అనే భ్రాంతిని కలిగించి తన భక్తులను అడపాదడపా పరీక్షించడం ఆమె లీల. ఆ మాయలో చిక్కుకుని కొంతసేపు అయోమయానికి గురికావడం ఆమె అనుగ్రహంతో తేరుకుని సాధకుడు బయటపడటం... ఇదంతా ఆమెకు ఒక క్రీడ.

అసత్యం ఒకోసారి గట్టి నిజంలా ఎలా తోస్తుందో తెలియాలంటే- చైనా జానపదకథను మనం గుర్తు చేసుకోవాలి. మనిషి అద్దం కనుగొన్న తొలిరోజుల్లో పొలం దున్నుతున్న రైతుకు ఒక అద్దం ముక్క దొరికింది. అందులో కనపడ్డ మొహం ఎవరిదో అతనికి తెలియలేదు. చాలాకాలం క్రితం మరణించిన తన తండ్రి పోలికలు అందులో తోచాయతనికి. తన తండ్రే ఆ రూపంలో కనిపిస్తున్నాడని అతడు భావించాడు. అద్దాన్ని శుభ్రంగా తుడిచి ఇంటికి తీసుకెళ్లి భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టాడు. ప్రేమగా దాన్ని చూసుకుని మురిసిపోవడం, దాంతో ఏవేవో కబుర్లు చెబుతుండటం, తన తండ్రి కూడా తనతో సంభాషిస్తున్నాడని ఆనందించడం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అది అతని భార్య కంటపడింది. భర్తలేని సమయంలో ఆవిడ ఆ పెట్టె తెరచి చూసింది. అందులో కనపడిన అందమైన ముఖం చూసి ముందు దిగ్భ్రాంతికి లోనైంది. వేరే స్త్రీతో భర్తకు సంబంధం ఉందని తోచి లబోదిబోమంది. వెంటనే ఆ అద్దాన్ని తీసుకుని తన పుట్టింటికి పరుగెత్తింది. తల్లితో తన బాధంతా చెప్పుకొని ఏడ్చింది. ఆ తల్లి అద్దాన్ని పరీక్షించింది. 'ఛఛ! ఇంత ముసలిదానితో అల్లుడు వేరే కాపురం పెట్టాడంటే నేను నమ్మలేనే అమ్మా' అంటూ కూతురుకు సుద్దులు చెప్పింది.

ఈ కథ వింటుంటే మనకు నవ్వొస్తుంది. ఎందుకంటే, అద్దం గురించి మనకిప్పుడు బాగా అవగాహన ఉంది. అది జ్ఞానంగా మనలో స్థిరపడింది. సత్యాన్ని అసత్యాన్ని వేరువేరుగా గ్రహించడానికి ఆ జ్ఞానం తోడ్పడుతుంది. కనుక ఈ కాలంలో అలాంటి పొరపాట్లకు అవకాశంలేదు. ఆ కథలో అందరూ అజ్ఞానం కారణంగా భ్రమలో పడ్డారు. మొదట రైతుకు కలిగిన ఆనందం సైతం అసత్యమైనదే. భ్రాంతి మూలకంగా కలిగినది కాబట్టి నకిలీదే!

మండోదరి సీతలా కనపడటం ఒక మాయ. అది భ్రమ. భ్రమ సత్యం ఎలా కాలేదో, భ్రమ మూలంగా లభించే ఆనందమూ సత్యం ఎన్నడూ కాబోదు. నిజంగా సత్యాన్ని కనుగొన్నప్పుడు- అంటే అమ్మవారిని దర్శించినప్పుడు హనుమంతుడు ఈ మాదిరిగా కుప్పిగంతులు వేయలేదు సరికదా, కన్నీటితో సతమతమయ్యాడు. సాధనకు సంపూర్తి అది. పరిణతికి చిహ్నమిది. సాధన పూర్తయ్యేసరికి కలిగే మహద్భాగ్యమది. స్థితప్రజ్ఞకు అదే నిదర్శనం.

లోకంలో మరో తరహా సాధకులు కూడా ఉంటారు. సాధన ఇంకా పూర్తికాని స్థితిలో అనుకోకుండా వారికి కొన్ని సిద్ధులు కలగడం, తొందరపడి వాటిని ప్రకటించినప్పుడు లోకం అబ్బురపడి అవతార పురుషుడంటూ వారిని ఆరాధించడం, ఉత్సవాలు వూరేగింపులు సన్మానాలు ఆశ్రమాలు ఐశ్వర్యాలు... చివరకు పతనం పూర్తయి సాధన గంగలో కలిసిపోయి, అలాంటివారంతా సామాన్యుల్లో చేరి కనుమరుగైపోవడం ఇదంతా లోకంలో రివాజుగా జరిగే తంతు. పరిణతి సాధించినవాడు సత్యాన్నుంచి దూరంగా జరగడు. మనిషి అనుభవిస్తున్న నకిలీ సుఖాలకు, నిజమైన ఆనందాలకు మధ్య మాధుర్యం విషయంలో శాక్రిన్‌కి పట్టుతేనెకు ఉన్నంత తేడా ఉంది. అదీ హనుమంతుడి కథలో అంతరార్థం.

- ఎర్రాప్రగడ రామకృష్ణ