ᐅపవిత్ర రమజాన్ మాసం
తమస్సు నిండిన జీవితంలో వెలుగు నింపే మాసం. ఇరుకు హృదయాలకు, స్వార్థమతులకు సమాజంలో తావులేదని వివరించే మాసం. ప్రతి వ్యక్తి ప్రేమమూర్తిగా పరివర్తనం చెందేందుకు అవకాశం కల్పించే మాసం. క్రమశిక్షణ, ఐకమత్యం, త్యాగం, సహనశీలం, భక్తిపరాయణత్వం, ఐహికవాంఛల్ని అదుపులో ఉంచుకొనే నిగ్రహం, రాగద్వేషాలకు అతీతంగా సర్వమానవ సౌభ్రాత్రాన్ని కాంక్షించడం- వంటి పవిత్ర గుణాల్ని పెంపొందించే పవిత్రమాసం రమజాన్ నేటినుంచి ప్రారంభమవుతోంది.
రమజాన్ చాంద్రమాన మాసం. చంద్రోదయంపై ఆధారపడి ఉంటుంది. షాబాన్ మాసంలో అమావాస్య తరవాత కనబడే నెలవంకను చూసిన పిమ్మట వేకువజామునుంచి రమజాన్ మాసానికి చెందిన సుప్రశాంతశోభ ఆరంభమవుతుంది. ఈ మాసంలో ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం ఉండేవారు ఉషఃకాలానికి ముందే నాలుగు అయిదు గంటల మధ్య అన్నపానీయాల సేవనం పూర్తిచేస్తారు. దీన్ని 'సహరి' అంటారు. ఇక సూర్యాస్తమయం దాకా పచ్చినీళ్లు సైతం ముట్టరు. ఇది కఠిన నియమం. సూర్యాస్తమయం కాగానే ఉపవాస విరమణ జరుగుతుంది. దీన్ని 'ఇఫ్తార్' అంటారు. ఉపవాస వ్రతం రమజాన్ మాసమంతా జరుగుతుంది. ముస్లిములంతా ఒకేసారి రోజా (ఉపవాసవ్రతం) పాటిస్తారు. దైవాన్ని ఆరాధిస్తారు. హృదయాలు నిరంతరం దైవంవైపు మరలి ఉంటాయి. దైవం కోసం ఉపవాసం. ఇరవై నాలుగు గంటలు దైవంతో సాన్నిహిత్యం. త్రికరణశుద్ధిగా ఉపవాసం ఉండటంవల్ల హృదయమాలిన్యం క్షాళితమవుతుంది. విశాల మానవత ఉదయిస్తుంది. ఇఫ్తార్ విందుకు ఇతరుల్ని ఆహ్వానిస్తారు. మానవ సంబంధాలు బలపడాలి. అందులో ఉన్న ఆనందం ఎనలేనిది అనే ఆలోచన సమైక్యదృష్టికి జీవం పోస్తుంది.
ఈ నెలలో ప్రతిరోజూ అయిదు వేళల నమాజే కాక, రాత్రి అదనంగా 'తరావీ' అనే ప్రత్యేకమైన నమాజు చేస్తారు.
సమస్త మానవాళి సన్మార్గదీపిక పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. రుజుమార్గం చూపే సత్యాసత్యాల్ని వేరుపరచే ఉపదేశాలు ఈ గ్రంథరాజంలో ఉన్నాయి. ఖురాన్ గ్రంథ పారాయణం మాసమంతా జరుగుతుంది. వేయి మాసాలకన్నా అత్యంత విలువైన రాత్రిగా ప్రతీతమైన 'లైలతుల్‌ఖద్ర్' ఈ మాసంలోనిదే. పాపచింతన హృదయాన్ని స్పృశించకుండా దైవప్రార్థన చేసేవారికి ఈ రాత్రి అనంత పుణ్యప్రదాయిని అని విశ్వసిస్తారు. దైవచింతనలో నిమగ్నమై ఉండే సదస్సులు, ధార్మిక చర్చాగోష్ఠులు రమజాన్ మాసమంతా కళకళలాడుతుంటాయి. స్వార్థాన్ని వీడిన పరోపకారం, చెలిమితో విద్వేషాన్ని పరాజితం చేయడం, పరమతసహన జ్ఞానవిభవం వంటి పవిత్ర ఖురాన్ బోధలను విశదీకరిస్తారు. అన్నింటినీ ఆచరించి అనంత పుణ్యప్రాప్తికోసం ముస్లిములు తపిస్తారు. ఈ నెలలో 'ఫిత్రా' పేరిట నిర్ణీతదానాన్ని భక్తిపూర్వకంగా చెల్లిస్తారు. ఫిత్రాదానం వల్లనే రమజాన్ పర్వదినాన్ని ఈదుల్‌ఫితర్ అంటారు. తమ వద్ద అవసరానికి మించి నిలువ ఉన్న ధనంలో రెండున్నరశాతం విధిగా చేయవలసిన దానాన్ని 'జకాత్' అంటారు. జకాత్ సంపన్నులకే నిర్దేశితమైంది. ఫిత్రా, జకాత్ దానాలు- పేదవారి కోసం ఉపయోగపడకపోతే అందులోని ఔన్నత్యం వ్యర్థమైనట్లే. బాధాతప్తులైన ముస్లిములు, ముస్లిమేతరులు అందరు ఈ దానాలు పొందడానికి అర్హులే. విశ్వవిభుడు ప్రతివ్యక్తి ప్రవర్తనల్నీ చూస్తున్నాడు అన్న విశ్వాసం, భీతి అందరినీ పాపాలకు దూరంగా ఉంచుతాయి. పుణ్యకార్యాల ఆచరణవల్ల స్వార్థరాహిత్యంవల్ల, ఆధ్యాత్మిక సౌరభాల వ్యాప్తివల్ల నరకద్వారాలు మూతపడి స్వర్గద్వారాలు తెరచుకొంటాయని ఇస్లామ్ విశ్వాసం.
దుష్కార్యాలకు పాపాలకు దూరంగా ఉండే విధంగా శిక్షణనివ్వడమే ఈ మాసం ఉద్దేశం. ఈ మాసంలోనే కాదు, మిగిలిన కాలమంతా ఉన్నత మానవత్వపు విలువలతో జీవితం గడపడానికి ఈ శిక్షణ సమున్నత స్ఫూర్తినిస్తుంది. కుటిల వ్యూహాలు వక్రగతులు తాకని విధంగా మాటలోనూ మనసులోనూ మంచితనం తొణికిసలాడాలన్నదే లక్ష్యం.
నెల అంతా విజయవంతంగా ధర్మోపాసనతో దైవచింతనతో గడిచేలా అల్లాహ్ సద్బుద్ధి ప్రసాదించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ముస్లిములు ఆహ్లాదం నిండిన హృదయాలతో షవ్వాల్ మాసం మొదటి తేదీ పండగ జరుపుకొంటారు. అదే రమజాన్ పర్వదినం.
అజ్ఞానం, అసత్యం, ఈర్ష్యాద్వేషాలు లేనిదై విశ్వప్రాంగణం శోభిల్లాలి. మనిషికి మనిషికి మధ్య ఇనుపగోడలు కట్టడం సైతాన్ చర్య. నిజాయతీ నిద్రపోతే దైవత్వం ఎంతో దూరంగా ఉంటుంది. దురాశమత్తులో పరవశిస్తే, అన్యాయం చేసేవారితో ఏకీభవిస్తే మనిషి ప్రవర్తన వచింపరాని అపఖ్యాతి పాలవుతుంది. భగ్నహృదయాల వ్యధను పంచుకొన్నప్పుడే మనిషి ఔన్నత్యం తెలుస్తుంది.
విశ్వశాంతి, మానవధర్మ పరిరక్షణ- వీటికోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడు మానవత్వానికి పర్వదినాలకు విపులార్థం సమకూరుతుందని రమజాన్ బోధిస్తుంది.
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా