ᐅశాంతి తీరం
ᐅశాంతి తీరం
ఆధ్యాత్మిక రంగం యావత్తూ సుగుణాలు, సౌజన్యాలు, సౌమనస్యాల సౌగంధికోద్యానం. ఇక్కడ లొసుగులకు, లోపాయికారీతనాలకు, ఆవేశ కావేషాలకు తావు లేదు. అందుకే అన్ని రకాల ప్రాపంచిక ఎత్తుగడలకు, పొత్తులకు, కుయుక్తులకు విసిగిపోయిన మనిషి వాటి పవనాల కోసం, ప్రశాంత విశ్రాంతి కోసం చివరకు ఇక్కడికి చేరుకుంటాడు. ఎలాంటి ఒడుదొడుకులకు, మోసాలకు, లాభనష్టాలకు ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ ఉన్నది ఒక గురువు, లెక్కకు మిక్కిలి సహసాధకులు. ఈ అందరి పరమ లక్ష్యం పరమేశ్వరుడు! సహసాధకులు, సోదర భక్తులు... వీరు సాత్వికులు. కనీసం సాత్వికత కోసం ప్రయత్నిస్తున్నవారు. వీరిలో మన పట్ల ఈర్ష్య, అసూయ లాంటి వ్యతిరేక భావనలుండవు. ఎందుకంటే పొందవలసిన లక్ష్యం అయిన పరమాత్ముడు పరిమితుడు కాడు. ఒకరికి అందితే మరొకరు పొందేందుకు మిగలకపోయేందుకు ఆయన పూర్ణుడు. ఎందరు లక్ష్యంగా ఎంచుకున్నా, ఎందరు పంచుకున్నా తరగనివాడు. శాశ్వతంగా పూర్ణంగా ఉండేవాడు. కాబట్టి మనం ముందుగా వెళ్లి ఎంతో కొంత పంచుకుపోతామన్న భయం ఇతరులకు ఉండదు. ఎవరు ఎప్పుడు చేరుకున్నా అందరి కోసం, ఎందరి కోసమైనా ఆయన పూర్ణకుంభంగా, పూర్ణ పురుషుడిగా, పురుషోత్తముడిగా ఉండనే ఉంటాడు. గురువును మించిన శ్రేయోభిలాషి, ప్రేమమయుడు, త్యాగపూర్ణుడు మరొకరుండరు. కన్నతండ్రి అయినా కుమారుడి నుంచి ఆర్థికంగానో, సేవారీత్యానో కొంత ప్రతిఫలం ఆశిస్తాడేమో గానీ- గురువు శిష్యుడి పురోభివృద్ధి తప్ప మరోటి కోరుకోడు. తన శిష్యుడు 'గురువును మించిన శిష్యుడు' అనిపించుకోవడమే ఆయన పరమలక్ష్యం. ఇక మిగిలింది భగవంతుడు. ఆధ్యాత్మిక రంగ వృత్తానికి ఆయనే కేంద్రబిందువు. పారమార్థిక పర్వత పంక్తికి ఆయనే శిఖరశృంగం. మానవ జీవితానికి ఆయనే పరమగమ్యం. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించేందుకు గురువుతో సహా అన్నీ ఉపకరణాలు, సాధనాలు, సహకారాలే. భగవంతుడే పరమలక్ష్యం, పరమ గమ్యం, పరమోద్దేశం.... శాంతి కోసమైనా, ప్రశాంతి కోసమైనా, క్రాంతి కోసమైనా, పరమగతి కోసమైనా. లోకంలో మనం ఏ పని చేసినా లక్ష్యం అంటూ ఒకటుంటుంది. వ్యాపారమైనా, విద్య అయినా, కళలైనా, క్రీడలైనా, మరేదైనా- అది మనకు మంచి లాభసాటిగా ఉండాలి. ప్రయోజనకారిగా ఉండాలి. ఆధ్యాత్మిక రంగమైనా అంతే. ఇక్కడ లక్ష్యం అయిన భగవంతుడు అన్ని విధాలా ఉపయుక్తమైనవాడు, ఉన్నతోన్నతమైనవాడు, పరిపూర్ణుడు. కష్టానికి నష్టానికి అవకాశమే లేనివాడు. ఫలితం పట్ల అనుమానానికి ఆస్కారమే లేనివాడు. శాంతికి నిలయమైనవాడు. ఆనందానికి ఆకరమైనవాడు. ఇంతకంటే భరోసా అయినవాడు మరొకకెవరున్నారు? అందుకే అన్నిచోట్లా విఫలమైనవారు, ఓడిపోయినవారు... సముద్రంమీద ఎగిరి ఎగిరి అలసిపోయిన పక్షి చివరకు ఓడ మీదికే వచ్చివాలినట్లు- భగవంతుని సన్నిధానానికి సమర్పణ అయిపోతారు. సర్వం సహా అర్పణగా మిగిలిపోతారు.
జీవితంలో ఓడిపోయినవారు, విసిగిపోయినవారు మాత్రమే ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తారనుకుంటే- అంతకంటే అమాయకత్వం మరోటుండదు. భగవంతుడంటే ప్రేమతో, భక్తితో, జన్మసార్థక్యం మీద లక్ష్యంతో వచ్చేవారే అధికాధికం. వారే ధన్యులు, మాన్యులు. నాస్తికులు, భక్తిభావనలు అంతగా లేనివారు, పక్కా ప్రాపంచికులు కూడా చివరకు అపమార్గాల నుంచి ఈ అమృతతుల్య మార్గంలోకి చేరుకుంటారన్నదే, చేరుకోక తప్పదన్నదే భావం. ఎందుకంటే ఇక్కడి అధినాయకుడు, అధిష్ఠాన పురుషుడు, కేంద్ర బిందువు, ప్రేమ సింధువు అంతటి ఉత్తమోత్తముడు, ఉన్నతోన్నతుడు, అనిర్వచనీయుడు, అప్రమేయుడు, అసమానుడు. ఎవరైనా మంచి నాయకుడన్న భూమికనే ఎంచుకుంటారు. అందుకే ఎప్పటికైనా రాక తప్పని ఈ సౌగంధికోద్యానవనంలోకి ఇప్పుడే రావాలనే సంకల్పం చేసుకుంటే- సమయం వృథా కాదు. వేదాలు, రుషులు ఉద్ఘోషించే పరమగమ్యం మన ఎదుటే ఉంది. మన లోపలే ఉంది. అమాయకంగా కళ్లు విప్పార్చుకుని ప్రాపంచిక సుఖభోగాల విషసర్పాలకై వెతుకుతూ ఉండిపోవద్దు. ప్రశాంతంగా కళ్లు మూసుకుని అంతర్ముఖులమవుదాం. ఆంతర్యంలోకి వెళ్లిపోదాం. హద్దులు లేని ఆనందపూర్ణ ఆధ్యాత్మిక భూమికల నేలుదాం.
- చక్కిలం విజయలక్ష్మి