ᐅభక్తి పరమార్థం



భక్తి పరమార్థం 

మనిషి కోరికల పుట్ట. 
ఇష్టదైవం ముందు నిలబడి, వీధి బిచ్చగాడి కన్న ఘోరంగా ఆశలపళ్లెం చేతపట్టుకుని అడుక్కుంటూ ఉంటాడు.
భగవంతుడి ముందు బిచ్చగాడిగా కాదు, భక్తుడిగా నిలబడాలి మనం. అసలింతకీ ఏమిటీ భక్తి? ఏమిటి దీని అవసరం?

మనిషి తన జీవితకాలంలో ప్రాపంచిక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. తన సుఖ సౌఖ్యాలు, తనవారికి సిరి సంపదలు కూడబెట్టడం, అధికారం, హోదాకోసం అడ్డదారులు తొక్కటం.. ఈ రంధిలో పడి- చూస్తుండగానే జీవితం ముగిసిపోతుంది.

మనిషికి తప్ప మరో ప్రాణికి ఆత్మజ్ఞానం పొందగల అవకాశం లేనేలేదు. ఒక్క భారతీయ ఆధ్యాత్మికతలోనే పరిపూర్ణమైన ఆత్మజ్ఞాన విజ్ఞానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల వారికీ వారివారి అవగాహన స్థాయికి తగినట్లు ఈ విజ్ఞానాన్ని సుబోధకంగా ఆధ్యాత్మిక వేత్తలు అందిస్తూనే ఉన్నారు.

ఆత్మజ్ఞానం పొందటానికి ప్రధాన అర్హత జిజ్ఞాస.

అర్జునుడు జిజ్ఞాస ద్వారానే గీతాబోధ పొందగలిగాడు. ఆత్మజ్ఞానంలో మూలసూత్రం శరీరం ఆత్మకాదనే ఆధ్యాత్మిక సత్యం. ఈ సత్యం ఒంటబట్టనంతకాలం, మనిషి మాయామోహాల్లోనే బతుకుతుంటాడు. అనేక తప్పులు చేస్తూనే ఉంటాడు.

అసలు భగవంతుడనే వాడున్నాడా? ఆధ్యాత్మిక మిథ్యావాదనలన్నీ మోసపూరితమేనా? కొందరు భావిస్తున్నట్లు అనేక ఆదాయ మార్గాల్లో ఆధ్యాత్మికత కూడా ఒకటిగా వర్ధిల్లుతున్న మాట కాదనలేని సత్యం కాదా?

ఇలాంటి వాదనలు, వేదనలు కొందర్ని నాస్తికులుగా మారుస్తున్నాయి. మనిషికి భగవంతుడితో అనుబంధం కలిగించేది భక్తి. భక్తి అంటే నిస్వార్థంగా, పరిపూర్ణమైన ప్రేమను భగవంతుడికి అర్పించటం. అలా అర్పించటానికి ఎలాంటి వేషాలూ అక్కర్లేదు. ఏ మాలలూ ధరించనవసరం లేదు. మనసులో ఉన్న మాలిన్యమంతా బయటకు నెట్టేసి, విశ్వాసమనే దీపం వెలిగించి, ఆత్మతో పరమాత్మ రూపాత్మక, భావనాత్మక, అనుభూతి పరమైన అనుసంధానానికి చేసే నిత్య ప్రయత్నమే భక్తికి పరాకాష్ఠ.

భక్తి అనే పేరుతో నిత్య వ్యవహారాలను విస్మరించి, కేవలం దైవ సంబంధ కార్యకలాపాలతో కాలక్షేపం చేయటమూ సరికాదు. కర్తవ్య కర్మలను సవ్యంగా సక్రమంగా నిర్వర్తిస్తూనే మనసు భగవంతుడి పట్ల అనురక్తితో పొంగేలా అంకితభావంతో ఉండాలి.

భక్తికి ప్రదర్శనల అవసరం లేదు.

కేవలం మన తృప్తికోసమే అనేక పద్ధతుల్ని పాటిస్తున్నాం. పద్ధతులన్నీ పాటిస్తూ, భక్తిని విస్మరిస్తే- అది నేతి బీరకాయలో లేని నెయ్యిలా ఉంటుంది.

అనేక యజ్ఞయాగాలు, పూజా పునస్కారాలు, వ్రతాలు ద్వారా సాధించలేని దైవసాన్నిధ్యం, పరమాత్మ అనుగ్రహం, నిర్మల భక్తిద్వారా సాధించవచ్చని అనేక భక్త విజయగాథలు చెబుతున్నాయి.

భక్తివినా సన్మార్గం లేదని త్యాగబ్రహ్మ గానం చేశాడు. భుక్తికోసం పడే పాట్లకన్న, భక్తికోసం పడే పాట్లతోనే జీవితం సార్థకమవుతుంది.

అదే భక్తికి పరమార్థం.


- కాటూరు రవీంద్రత్రివిక్రమ్