ᐅసమానత్వ భావన
మనుషులందరూ ఒక్కటే. వారిలో తేడాలు లేనేలేవు. అందరిలో ప్రవహించేది రక్తమే. ప్రసరించేది అదే సూర్యకాంతి! మరి ఎందుకు రకరకాల అసమానతలతో నేటి జనం కొట్టుమిట్టాడుతున్నారు?
జ్ఞానులు అందరిపట్లా సమభావాన్నే కలిగి ఉంటారని గీతాచార్యుడు పలికాడు. జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన పండితుడిపట్ల, గోవు, ఏనుగు, కుక్క మొదలైన వాటిపట్ల, చండాలుడిపట్ల సమదృష్టినే కలిగి ఉంటారని భగవద్గీత చెబుతోంది.
మహాత్మాగాంధీ, అబ్రహాంలింకన్, నెల్సన్‌మండేలా వంటి మహనీయులు సైతం ఈ జీవన సత్యాన్ని గుర్తెరగమని ప్రబోధించడం వారి జీవిత మజిలీల్లో పదేపదే కనబడుతుంది.
సమానత్వ భావన చాటే ఒక చక్కని గాథ మనకు సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ జీవితంలో తారసపడుతుంది.
గురు గోవింద్‌సింగ్ నాయకత్వంలో సిక్కులు ఔరంగజేబు దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న రోజుల్లో ఘోరమైన యుద్ధం జరిగింది. మొగల్ సైన్యాలు విజయం సాధించాయి. గురు గోవింద్‌సింగ్ కొద్దిమంది అనుచరులతో కలిసి కోటనుంచి బయటపడ్డాడు. మొగల్ సైన్యాల విజృంభణతో కోట వారి వశమైంది. ఎందరో సిక్కుయోధులు అమరులయ్యారు.
సిక్కువీరుల మృత కళేబరాలతో నిండిఉంది యుద్ధభూమి. పడివున్న ఆ శవాల మధ్య నుంచి నడుస్తున్నాడు గురు గోవింద్‌సింగ్.
ఆయనకు పరిచయం ఉన్న అనేక ముఖాలు మృతులైనవారిలో కనిపించాయి. ఆయనకు ముందుగా దీపం పట్టుకుని నడుస్తున్న ఆయన అనుచరులు మృతుల్లో గురు గోవింద్‌సింగ్ కుమారుడైన ఫతేసింగ్‌ను గుర్తించారు. చిన్నవయసులోనే అమరుడైన అతణ్ని తలచి, విలపించారు. గురు గోవింద్‌సింగ్ అక్కడకు చేరుకున్నాక ఫతేసింగ్ మృతదేహాన్ని ఆయనకు చూపారు. ఆయన ఒక్కక్షణం గాఢంగా నిట్టూర్చి ముందుకు కదిలాడు.
అనుచరుల్లో ఒకడు ఆయనతో 'మరణించిన యువయోధుడు ఫతేసింగ్ త్యాగాలకు గుర్తుగా అతని శరీరాన్ని ప్రత్యేకంగా ఒక బట్టతో కప్పుదాం' అన్నాడు. ఒక్కక్షణం ఆలోచించిన గురు గోవింద్‌సింగ్ 'అవును, మృతకళేబరాల్ని బట్టతో కప్పటం అనేది మంచి ఆలోచనే. అయితే మనం ఇక్కడ మృతులైన ఈ వీరులందరి శరీరాలనూ కప్పాలి. మీ దగ్గర ఎన్ని బట్టలున్నాయో చూడండి. అందరికీ సరిపోయే సంఖ్యలో బట్టలుంటే కప్పండి. నాకేమీ అభ్యంతరంలేదు. ఫతే నా కుమారుడు అని ప్రత్యేకంగా మర్యాదలు చేయవలసిన అవసరంలేదు. సిక్కులందరూ నా కుటుంబ సభ్యులే! మీరంతా సమానులే నా హృదయంలో' అన్నారు. ఆయన అనుచరులంతా నిశ్చేష్టులయ్యారు. మళ్లీ రెండు క్షణాలాగి అన్నారు గోవింద్‌సింగ్- 'చూడండి! మనమందరం మొగల్ చక్రవర్తితో ఎందుకు పోరాడుతున్నాం? సమాన న్యాయం కోసమేగదా! అటువంటప్పుడు ఫతేసింగ్‌ను వేరుగా చూడటం ఎందుకు? మనం అందరం ఆ భగవంతుని బిడ్డలమే! ప్రేమ, గౌరవాల్లో మనందరిదీ ఒకటే వాటా! ఏ భేదమూ లేదు' అని ముగించారు. అంత ఉదాత్తంగా ఉంటాయి జ్ఞానుల ఆలోచనలు అని గురు గోవింద్‌సింగ్ జీవితంలోని ఈ ఘటన మనకు తెలియజేస్తుంది. ఇదే విధంగా ఎందరో మహనీయులు కమనీయంగా సమానత్వ సాధనకోసం పాటుపడ్డారు. 'సర్వజన హితైషి'గా పేరొందిన మహ్మద్ ప్రవక్త జీవిత పర్యంతం వల్లించినది శాంతి, సమానత్వమనే దివ్యసూక్తులే! 'చాపకూడు' పేరుతో సహపంక్తి భోజనాలను నిర్వహించి సమతను, సమానతను చాటి చెప్పిన బ్రహ్మనాయుడి మేలిమి సిద్ధాంతాలనూ మరువలేం.
'నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటునిద్ర అదియునొకటే' అన్న అన్నమయ్య మాటలు మరపురానివి. సమానత్వ సాధనే ధ్యేయంగా పరిశ్రమించిన మహనీయుల జీవితాలు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి. 'అందరినీ సమానంగా ప్రేమించు... ఆనందంతో జీవితాన్ని కొనసాగించు!' అన్న జీసస్ క్రీస్తు మాటలు విశ్వమానవాళికి ఎప్పటికీ శిరోధార్యాలే.
- వెంకట్ గరికపాటి