ᐅపరశురామ జయంతి




పరశురామ జయంతి 

భక్తులకు అవతారార్చన కొంగుబంగారం. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరోదైన పరశురామావతారం విలక్షణమైంది. ఇతర అవతారాలకంటే భిన్నమైన తాత్వికత కలిగింది.
పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జననమొందినట్లు స్కంద, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి. ఇతడు జమదగ్ని, రేణుకల పుత్రుడు. చిత్రరథుడనే గంధర్వుని చూసి రేణుక మనసు చలించిందని యోగదృష్టితో గ్రహించిన జమదగ్ని- ఆమె శిరసును ఖండించవలసిందిగా పరశురాముని ఆజ్ఞాపిస్తాడు. తండ్రిమాట జవదాటని పరశురాముడు ఆ కార్యాన్ని నిర్వర్తించి తండ్రి మెప్పు పొందుతాడు. జమదగ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మంటే- తల్లిని బతికించమంటాడు. జమదగ్ని అనుగ్రహిస్తాడు. ఇంద్రాది దేవతలు దానవులవల్ల తమకు ముప్పు వాటిల్లుతున్నదని శివుడికి మొరపెట్టుకుంటారు. శివుడు పరశురాముడిలో తన తేజస్సు ప్రవేశపెట్టి 'పరశువు' అనే అస్త్రాన్ని ప్రసాదించి దానవ సంహారం చేయిస్తాడు. దానవ సంహారం పిమ్మట తపోమగ్నుడైన పరశురాముడికి శివుడు నిశ్చలభక్తిని, భార్గవాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు.

హైహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమంనుంచి కామధేనువును అపహరించగా పరశురాముడు అతణ్ని సంహరిస్తాడు. కార్తవీర్యుని పుత్రులు పరశురాముడు లేని సమయంలో జమదగ్ని తల నరికి వేస్తారు. తల్లి రేణుక దుఃఖంతో నీ తండ్రి లేడని ఇరవై ఒక్కమార్లు ఆక్రోశిస్తుంది. పరశురాముడు కార్తవీర్యుని పుత్రులనేగాక- ఇరవైఒక్క మార్లు దండెత్తి దుష్టులైన రాజులందరినీ నిర్మూలించాడంటారు. శమంతక పంచకం వద్ద ఆ రాజుల రక్తంతో తొమ్మిది మడుగులు ఏర్పరచాడనీ, సరస్వతీనదిలో స్నానంచేసి మహాయజ్ఞం ఆచరించాడనీ, ఆ యజ్ఞప్రభావం వల్ల జమదగ్ని సప్తర్షి మండలంలో ప్రకాశించాడనీ పురాణ వచనం.

పరశురాముడు క్షత్రియ సంహారం చేసి తాను సంపాదించిన భూమిని కశ్యపుడికి ధారపోసి మహేంద్రగిరికి వెళ్లి తపోమగ్నుడవుతాడు. అప్పటినుంచి భూమికి 'కాశ్యపి' అనే పేరు వచ్చిందంటారు.

పరశురాముడు భృగు వంశంలో జన్మించడంవల్ల భార్గవరాముడిగా ప్రసిద్ధుడు. వేదధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న పాలకులను పరశువుతో ఖండించడంవల్ల పరశురాముడయ్యాడు. ధర్మ రక్షణ పట్ల శ్రద్ధ తగ్గి పాలకులు స్వార్థంతో నిరంకుశులై హింసా ప్రవృత్తి కలిగి పాలిస్తున్నప్పుడు ఆ ప్రవృత్తిని నాశనం చేయడానికి ధర్మాత్మకమైన బ్రహ్మశక్తి, రక్షణాత్మకమైన క్షత్రియశక్తి పరస్పర పోషకాలుగా ఉంటాయని నిరూపించడం ఈ అవతార కర్తవ్యం. ధర్మాత్మకమైన బ్రహ్మశక్తికి ప్రతీకగా జమదగ్ని, నిరంకుశ హింసాత్మక శక్తికి ప్రతీకగా కార్తవీర్యార్జునుడు నిలిచారు. నిరంకుశ హింసాప్రవృత్తి ఉన్న పాలకశక్తే సాత్విక మేధాశక్తిని బాధిస్తున్నప్పుడు బ్రహ్మ, క్షత్రియ శక్తులు ఒకే శక్తిగా అవతరించి ధర్మరక్షణ చేస్తాయని ఈ అవతారతత్వం చెబుతోంది.

శివధనుర్భంగం చేసిన శ్రీరాముని అడ్డుకొని ఆయన జగత్ కల్యాణ స్వరూపం తెలుసుకొని భార్గవరాముడు అవతారం చాలిస్తాడు.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు