ᐅఅక్షయ తృతీయ
తరగని సంపదలు కావాలని కోరుకుంటారు ఎవరైనా. అందుకోసం పూజలు, వ్రతాలు చేస్తారు. నియమనిష్ఠలు పాటిస్తారు. అలాంటివారి కోరికలు తీర్చి అక్షయమైన(అధికమైన) ఫలితాలను, సంపదలను ఇచ్చేదిగా ప్రసిద్ధి పొందిన రోజు ఒకటి ఉంది. అదే 'అక్షయ తృతీయ'. వైశాఖశుక్ల తృతీయ తిథినే అక్షయ తృతీయగా పిలుస్తారు.
ఏ పని చేయడానికైనా వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం లాంటివి పరిశీలించి- అవి బాగుంటేనే ముందడుగు వేయడం భారతీయుల సంప్రదాయం. ఈరోజు అలాంటి వేటితోనూ నిమిత్తం లేకుండా ఎలాంటి శుభకార్యాన్నయినా నిరభ్యంతరంగా జరిపించుకోవచ్చని శాస్త్రవచనం.
ఈరోజు ఆచరించవలసిన విధులను 'భవిష్య పురాణం' చెబుతోంది. వాటిలో ముఖ్యమైనది గంగాస్నానం ఒకటి. త్రివేణీ సంగమ స్థలమైన హరిద్వార్‌లో గాని, రుషికుండంలో గాని ఈ స్నానం చేయాలని చెబుతారు. దీనివల్ల అనేక జన్మలనుంచి సంచితమైన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. స్నానం మనిషిని పవిత్రుణ్ని చేస్తుంది. అందులోనూ- అనేక ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్ల మూలికలకు నిలయమైన హిమవత్పర్వతాలనుంచి జాలువారే గంగానదిలో స్నానం!
శ్రీకృష్ణుడి అగ్రజుడైన బలరాముడి జయంతి ఈరోజే. అతడి ఆయుధమైన నాగలి చేత ఏర్పడిన నది నాగావళిలో స్నానంచేస్తే పుణ్యమనీ చెబుతారు. అందుకే ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని ఆలయాల్లో ఈ రోజు విశేష ఉత్సవాలు జరుగుతాయి. సోదరి, సోదరులతో(సుభద్ర, శ్రీకృష్ణులు) కలిసి ఇతడు కొలువై ఉన్నది పూరీక్షేత్రం. ఇక్కడ బలరామ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.
లక్ష్మీ ప్రసన్నతకోసం ఈరోజు లక్ష్మీపూజ చేస్తారు. ఆ పూజ నిమిత్తం ఎవరికివారు తమ స్థోమతకు తగినట్టు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరిస్తారు. ఇలా చేస్తే తమ ఇంట్లో సిరులు అక్షయంగా ఉంటాయని నమ్మకం.
ఈరోజు విసనకర్ర, మామిడిపళ్లు, పనసతొనలు దానం చేయాలని శాస్త్ర నియమం. వసంతం దాటి గ్రీష్మరుతు లక్షణాలు ప్రవేశించి ఎండలు ముదిరే సమయమిది. ఆ తాపాన్ని ఉపశమింపజేయడమే దీనిలోని ఆంతర్యం. వీటితోపాటు వేసవిలో పండే గోధుమలు, శనగలు, పెసలు దానం చేయాలని చెబుతారు. అన్నింటికన్నా అత్యంత పుణ్యప్రదం 'ఉదకుంభదానం'(ఉదక్-నీటి, కుంభం-పాత్ర/కుండ) అంటే- మంచినీటి పాత్రను దానం చేయాలని. దీని ఆంతర్యమూ గ్రీష్మ తాపోపశమనమే. దాహార్తులైన బాటసారులకు దాహార్తిని తీర్చడమే దీని ఆంతర్యం. (దీని ఆధునిక రూపమే నేడు అనేకమంది ఏర్పాటుచేసే చలివేంద్రాలు.) ఇలాంటి నియమాలు అన్నింటిలోనూ భూత దయ, ఇతర ప్రాణులపట్ల ప్రేమ, వాత్సల్యం ఇమిడి ఉన్నాయి.
త్రేతాయుగానికి ఆది అక్షయ తృతీయ దినమనే పేర్కొంటున్నాయి పురాణాలు. వాతావరణపరంగా రుతువు పూర్తికావచ్చి గ్రీష్మరుతు లక్షణాలు పుష్కలంగా పొడచూపే సమయమిది. ఆ వేడిమికి అనుగుణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగేది ఈ రోజునే. హిమాలయాల్లో ఉన్న బదరీనాథ్ క్షేత్రం ఈ రోజునే తెరుస్తారు. పూర్తి మంచు ప్రాంతమైన అక్కడ మానవులు సంచరించడానికి కాస్త వెసులుబాటు కలిగించే వాతావరణం ఏర్పడేది ఈ రోజునుంచే. కేరళ ప్రాంతీయులు సౌరమాన గణన ప్రకారం జరిపే నూతన సంవత్సరాది 'విషు' నేడే.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన 'సింహాచలం' క్షేత్రంలో వెలసిన వరాహ లక్ష్మీనృసింహ నిజరూప దర్శనం ఈ ఒక్క రోజే. ఉగ్రరూపుడైన నృసింహస్వామి, అగ్నినక్షత్రమైన కృత్తికల కలయికతో కూడిన నడి వేసవిదినం- ఆ రెండింటి వేడిని ఉపశమింపజేయడంకోసం అభిషేకాలు చేసి, కొత్తగా అరగదీసిన పచ్చి చందనంతో స్వామివారి మూర్తిని కప్పివేస్తారు. దీన్నే 'చందనోత్సవం' అని పిలుస్తారు.
తొలకరి కూరగాయల వ్యవసాయానికి కూరపాదుల విత్తనాలను ఈరోజే నాటడానికి ప్రాధాన్యమిస్తారు. ఇలా చేయడానికి కారణం ఆ విత్తులు మొలకెత్తి పెరిగేనాటికి మృగశిరకార్తె ప్రవేశించి తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దానివలన కూరలు పుష్కలంగా పండుతాయి. ఇవాళ పితృదేవతలను అర్చించి తర్పణాలు విడిచిపెట్టినవారికి అక్షయమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
- అయ్యగారి శ్రీనివాసరావు