ᐅహరి అవతారం అన్నమయ్య
మనోజ్ఞమైన వైష్ణవ భావ కుసుమాలకు సరళమైన పదాలతో, అద్వితీయ భావ మకరందాన్ని అద్ది ఏడుకొండల శ్రీనివాసునికి అక్షర నీరాజనం సమర్పించిన కారణజన్ముడు తాళ్లపాక అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన తెలుగు పాటను సృజించిన పద కవితా పితామహుడు అన్నమయ్య. చిన్న చిన్న పదాలతోనే ఎనలేని భావ సౌందర్యాన్ని ఒలికిస్తాయి ఆ మహనీయుని సంకీర్తనలు.
అతి చిన్న ప్రాయంలోనే సంకీర్తనా రచనకు శ్రీకారం చుట్టిన అన్నమయ్య దాదాపు 32వేల పైచిలుకు సంకీర్తనలు రాసినట్లు తాళ్లపాక చిన తిరు వేంగళనాథుడు లిఖించిన అన్నమయ్య చరిత్రద్వారా తెలుస్తోంది. మనకు దక్కినవి మాత్రం దాదాపు 13వేల సంకీర్తనలు మాత్రమే. అన్నమయ్య తాను విరచించిన సంకీర్తనల్లో భక్తితో ఆ శ్రీనివాసుని కొలిచినా, ప్రతి సంకీర్తనలోనూ జనులకు ఉపయుక్తమైన ఏదో ఒక సందేశం ఇవ్వాలన్న తపన, ఆర్తి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. భాష తాలూకు నిజమైన ప్రయోజనాన్ని, పరమార్థాన్ని గ్రహించి వాటిని ఆచరణలో చూపిన వాగ్గేయకారుల్లో అగ్రగణ్యుడు అన్నమయ్య. గ్రాంథిక భాషలో, శిష్టవ్యావహారికంలో సంకీర్తనలు రచించినా- అత్యధిక సంకీర్తనలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రాయడంలోనే ఆయన ఉద్దేశం మనకు స్పష్టమవుతుంది. అన్నమయ్య సంకీర్తనలు ఆస్వాదించటానికి పాండిత్యం అక్కరలేదు. తెలుగు భాషను ఆస్వాదించగలిగిన రసహృదయం ఉంటే చాలు!
'కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ-తెట్టెలాయె మహిమలే తిరుమలకొండ' అంటూ కీర్తించిన ఆ భాగవతోత్తముని సంకీర్తనలు ఆధ్మాత్మిక ప్రియులకు భక్తితరంగాలు. సకల వేదాల సారాన్ని, గీతా ప్రబోధాన్ని, రామాయణ భారతాల్లోని భక్తిస్ఫోరక అంశాలెన్నింటినో తన సంకీర్తనల్లో హృదయానికి హత్తుకునేలా అందించిన భక్తశిరోమణి అన్నమయ్య.
రామలక్ష్మణుల సంభాషణ, కృష్ణార్జునుల సంవాదం, గోపికా కృష్ణుల సరాగసల్లాపం... ఏదైనా- చిక్కటి పదాల అల్లికతో చక్కగా ఆ దృశ్యం మన నయనాల ముందు ఆవిష్కృతమవుతుంది. సాక్షాత్తూ సరస్వతీమాత నోటి నుండి వెలువడ్డాయా అన్నంత మధురంగా తెలుగు వెలుగులీనుతూ వుంటుంది అన్నమయ్య సంకీర్తనల్లో! అన్నమయ్య సంకీర్తనల్లో నృసింహ సంకీర్తనం అద్వితీయంగానూ, విశిష్ట వర్ణనతోనూ అలరారింది. నవ్వుతున్న నృసింహుణ్ని వర్ణించిన వాగ్గేయకారుడు అన్నమయ్యే!
సమసమాజ వాదులకీ, సంఘ సంస్కరణాభిలాషులకీ అన్నమయ్య ఆదర్శప్రాయుడు. దాదాపు ఆరు శతాబ్దాలకు పూర్వమే సంఘంలోని కట్టుబాట్లను నిరసించిన అన్నమయ్య జనులంతా ఒక్కటే అన్న సమత్వాన్ని, సోదర భావాన్ని చాటాడు. కట్టుబాట్లు, భేదభావాలు మనం సృష్టించుకున్నవే అని తెలియజెప్పాడు. జాతి భేదాలను చూపడం మానవ శరీరంలోని దుర్గుణంగా ప్రకటించాడు. జానపదులకు అత్యంత ప్రీతిపాత్రుడు అన్నమయ్య. ఆయన రాసిన జాజర పాటలు, సువ్వి పాటలు, కోలాటం పాటలు- పల్లెపట్టుల సల్లాపాన్ని సుందర పదవల్లరులతో మనముందుంచుతాయి. బావామరదళ్ల సరసాలు, వసంతంలో ప్రేయసీ ప్రియుల పున్నమి వెన్నెల సరాగాలు హృద్యంగా ఆయన పదాల్లో దోబూచులాడతాయి. మాటల్లో చెప్పలేని ఆనంద రసానుభూతికి మనల్ని లోనుచేస్తాయి. శృంగార సంకీర్తనల్లో అన్నమయ్య వర్ణనా వైచిత్రిని చూస్తే, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే దిగివచ్చి తన గురించి రాసుకున్నాడేమో అన్నంత స్నిగ్ధమనోహరంగా ఉంటాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమ అన్నమయ్య జన్మదినం. తెలుగుపద భారతికి నవ్యగీతికలతో హారతులెత్తిన అద్వితీయ వాగ్గేయకారుడు అన్నమయ్య.
ఆయన సంకీర్తనలు ఉన్నతోన్నత భావాలకు దర్పణం. ఆ తిరుమలేశుని పదాలకే సమర్పణం. తెలుగు జాతికీ, తెలుగు పాటకీ అక్షర సంతర్పణం.
'హరియవతారమీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతడు అన్నమయ్య'
- వెంకట్ గరికపాటి