ᐅకుటుంబం... ప్రేమ కదంబం




కుటుంబం... ప్రేమ కదంబం 

ప్రపంచం భారతదేశాన్ని గౌరవించే అనేక కారణాల్లో మన కుటుంబ వ్యవస్థ ప్రధానమైనది. మన 'కుటుంబం'లో ఉన్నది బంధనం కాదు, బంధం. కుటుంబం అంటే ఆత్మీయమైన అనుబంధాలను తీగల్లా అల్లిబిల్లిగా అల్లుకున్న అందమైన పొదరిల్లు. పూవులతో రంగుల హంగులు కూర్చుకున్న హరివిల్లు. అందులోంచి ఏ తీగను విడదీయాలన్నా మొత్తం పొదరిల్లే అస్తవ్యస్తమైపోతుంది. కుటుంబంలోని ఏ బంధమైనా అంతే.
కుటుంబం అంటే కొందరు వ్యక్తుల సమూహం. వావివరసలతో, పేగుబంధాలతో జీవితాంతం విడిపోని కొందరు వ్యక్తుల సామూహిక జీవనం. కోపాలు తాపాలు వారిని విడదీయలేవు. కష్టాలు వారిని మరింత దగ్గర చేస్తాయి. సుఖసంతోషాలు వారి మధ్య మాధుర్యాన్ని మరింత పెంచుతాయి. ఏదైనా కుటుంబ సభ్యులకు తెలియకుండా చేయకూడదనే నిబంధనలోని భద్రత తెలిసినది కుటుంబం. నా కోసం అందరున్నారనే భరోసాతో గుండెమీద చేయి వేసుకుని నిద్రపోగలిగినది కుటుంబం. 'అందరికోసం నేనుండాలి. ఉన్నాను. ఉంటాను' అనే బాధ్యత తెలిసినది కుటుంబం. కుటుంబం అన్నంతమాత్రాన ఏ నలుగురో పదుగురో కలిసి జీవించే, ఇతరులెవరితోనూ కలవని, ఇతరులెవరినీ కలుపుకోని ఓ స్వార్థపూరితమైన వ్యక్తుల గుంపు అని కాదు అర్థం. కలిసికట్టుగా, ఐకమత్యంగా సహజీవనం చేసే, ఒకే తాటిమీద నడిచే ఒక క్రమశిక్షణాబద్ధమైన సైన్యం...కుటుంబం! అలా భాసించే కుటుంబం, మిగిలిన ప్రపంచంపట్ల బాధ్యతను స్వీకరించే బలాన్ని, స్త్థెర్యాన్ని కలిగి ఉంటుంది. ఏకాకిని అనుకున్నప్పుడు మనిషి ఏమీ చేయలేడు. అతని బలం బలగమే. నాకు నా వారున్నారనే ధైర్యమే అతనికి కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. బలాన్ని సమకూర్చుతుంది... ఏం చేయడానికైనా, తన కోసమే అయినా, ఇతరుల కోసమే అయినా! 'మేము, మనము' అనుకునే ఆ ఆత్మీయ, ఆత్మవిశ్వాస భావనతో దగ్గరయ్యే ఆ ఐదు వేళ్ల కూడలి, ఆ ఉక్కుపిడికిలి కొండల్ని పిండిచేయగలదు. ఎవరికోసం బతుకుతున్నామో, ఎందుకోసం బతుకుతున్నామో అర్థంకాని వ్యవస్థ బంధాలకు పటుత్వాన్నివ్వదు. అది కుటుంబ జీవనంలోనే సాధ్యపడుతుంది. సంతోషం ఒకరితో పంచుకుంటే పెరుగుతుంది. దుఃఖం ఒకరితో పంచుకుంటే తరుగుతుంది. ఈ రెండూ చేసేందుకు మనకు కుటుంబసభ్యులనే శాశ్వత స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. ఆ భరోసా మనకుంది. భారతీయులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల్లో కుటుంబ జీవనం ఉన్నా ఇంతటి సంస్కారంతో, శాస్త్రీయమైన, ఉన్నత విలువలు కలిగిన కుటుంబ వ్యవస్థ లేదు. పరస్పర శ్రేయోకామనే మన దేశ కుటుంబ వ్యవస్థకు శాశ్వతత్వాన్ని, ఎనలేని కీర్తిప్రతిష్ఠల్ని సముపార్జించిపెట్టింది. నిజానికి భారతదేశం అంతా ఒక కుటుంబం! విభిన్న వ్యక్తులు, వ్యక్తిత్వాల సమాహారం ఒక కుటుంబమైతే- విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల మేళవింపు, సహజీవన సొంపు... భారతదేశం.

తల్లి, తండ్రి, సంతానం, అన్నదమ్ములు, బంధుమిత్రులు... ఒక అందమైన, ఆత్మీయమైన సమూహం. ప్రేమానురాగాల సమాహారం. నిజమే... ప్రతిమానవ కుటుంబం ఒక శివ కుటుంబం కావాలి. వేదాలు కూడా దీన్ని సమర్థించాయి. పాత్రసంబంధాలు, ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకు కుటుంబ వ్యవస్థను మించింది లేదు. కుటుంబసహితంగా ఆచరించే ధార్మిక కార్యాలు సత్ఫలితాలనే కాదు- శతాధిక ఫలాలనిస్తాయి.

- చక్కిలం విజయలక్ష్మి