ᐅబతకడం కష్టమా?
ఈ ప్రశ్నకు వేర్వేరు దృక్పథాలనుంచి వేర్వేరు సమాధానాలొస్తాయి. ప్రశ్న సరళమైనా జవాబులు మాత్రం చిత్రవిచిత్రంగా ఉంటాయి. మానవుల మనస్తత్వాలూ చిత్రవిచిత్రమైనవేగా మరి!
బతకడం సులువే అందామంటే, కాదు కష్టమని కొందరంటారు. కష్టమే అందామంటే, కాదు సులువే అని మరికొందరంటారు.
బతకడం సులభం ఎవరికంటే- మొదటి నుంచి తల్లిదండ్రులనుంచి క్రమశిక్షణ పొందినవారికి, సమయం విలువ తెలిసినవారికి, ప్రణాళికాబద్ధమైన జీవన విధానానికి అలవాటుపడినవారికి! వాళ్లు ధర్మసాధనకు ప్రధానమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. వ్యక్తి, సమాజం, దేశం వీటిని దృష్టిలో పెట్టుకుని ఉత్తమ పౌరసత్వ నిర్వహణకు కృషి చేస్తారు. సొంతలాభం కొంతైనా మానుకుని పరుల శ్రేయం కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ప్రకృతినీ, ప్రకృతిలో దాగి ఉన్న పరమాత్మనీ మానవసేవ ద్వారా ఉపాసిస్తారు. ఒక కాకి తనకు కనిపించిన ఆహారాన్ని తినేందుకు ఇతర కాకుల్ని ఎలా పిలుస్తుందో అలాగే తోటివారిని ఆహ్వానించి మరీ ఆహారం తీసుకుంటారు. అతిథి పక్కన లేకుండా ఒంటరిగా చేసే భోజనం గరళంతో సమానమని గ్రహిస్తారు. సొంత రెక్కల కష్టార్జితంతోనే తృప్తి చెంది, దురాశకు పోకుండా, అవసరాన్ని మించిన ధనార్జనకై తాపత్రయపడకుండా, సంతృప్తిని మించిన సంపద లేదన్న ప్రగాఢ విశ్వాసంతో సుఖ జీవన యానం సాగిస్తారు. జీవితమంతా విద్యార్థిగానే ఉంటూ స్వాధ్యయనం చేస్తూ భౌతిక తాపంనుంచి దైవిక తాపానికీ, దైవికతాపంనుంచి ఆధ్యాత్మిక తాపానికీ ప్రయాణిస్తుంటారు. సులభమైన, సుఖకరమైన జీవనగమనానికి మానసిక ప్రసన్నత, ప్రశాంతత ప్రధాన సాధనాలు. అటువంటి మహనీయుల ఆదర్శమయ జీవితాలు మనకు సర్వదా అనుసరణీయాలు. వారి మౌలిక సిద్ధాంతాలు మనకు అనుసరణీయాలు. దూషణ భూషణలకు సమాన స్పందన సాధు లక్షణం. సమస్యలు, కష్టాలు, బాధలనేవి జీవితంలో సహజం; అనివార్యం కూడా. అవి కేవలం తాత్కాలికమైనవి. వివేకంతో, ధైర్యంతో వాటిని అధిగమించడమే ప్రథమ ఆధ్యాత్మిక సోపానమని గ్రహించడానికి బతకడం కష్టమనే అనిపించదు. అరిషడ్వర్గాలను సుదూరంగా ఉంచిన వాడికి అనుక్షణం సలక్షణమే. సంరక్షణమే!
బతకడానికీ, తనంతట తానుగా వచ్చే మరణానికీ వెరవనివాడే నిజమైన ధైర్యశాలి. ఏదో ఓ చిన్న సమస్యనో, దుఃఖాన్నో భూతద్దం లోంచి చూసి బెంబేలెత్తిపోయి ఆత్మహత్యతో జీవితాన్ని అర్థాంతరంగా ముగించే చరిత్రహీనుణ్ని చూస్తే- సమాజం యావత్తు ఏవగించుకుంటుంది. ధైర్యశాలి జీవితాన్ని సవాలుగా తీసుకుంటాడు. మానవీయ విలువల కలువలు జీవనకాల సరోవరంలో పూయించి సర్వుల హృదయాలను రసాప్లావితం చేస్తాడు. ప్రాణికోటిలో తన శ్రేష్ఠత నిరూపించుకుంటాడు. రసమయజగత్తును సాక్షాత్కరింపజేస్తాడు.
మనం జీవించటం గొప్ప విషయం కాదు; ఎలా బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన, ఉచితమైన సమాధానాలు పొందగలుగుతున్నామా అని ఆలోచించాలి. విశ్లేషించుకోవాలి. శారీరక, మానసిక, సామాజిక, నైతిక, ఆత్మ సంబంధమైన సంతులనం పైన శ్రద్ధ వహించాలి. ఈ దేహం, దేహంలోని మస్తిష్కం హృదయం ఈ జన్మలో మనకు దొరికిన మహాద్భుత యంత్రాలు. ఈ యంత్రాలు సక్రమ పద్ధతిలో పనిచేసేందుకు మనం సర్వదా అప్రమత్తులమై ఉండాలి.
మనసు ఇంద్రియాలకు మహారాణి వంటిది. ఇంద్రియాలన్నీ మనసు చెప్పినట్లే నడచుకుంటాయి. జీవితం సుఖంగా ఉన్నదనీ, లేదనీ అనుభూతి కలిగించేది ఈ మనసు. అందుకే మనసు మనకో వరమే కాదు, శాపం కూడా! సాత్వికాహారం తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయని ఛాందోగ్యోపనిషత్తు చాలా చక్కగా వివరించింది. మనసు దేనికీ చలించకుండా అధీనంలో ఉంటే ప్రతి సమస్యా చిన్నదిగానే కనిపిస్తుంది. బతకడం చాలా సులువనే అనిపిస్తుంది. పిరికివాడికి చిన్న వానకూడా సునామీలా గోచరిస్తుంది. ధనాశతో ఉన్నవాడికి గురువు లేడు, బంధువు లేడు. కామాంధులకు భయం, సిగ్గులేవు. ఆకలి గలవానికి రుచీపచీ లేదు, వ్యాకుల మనస్కుడికి సుఖమూ నిద్రా ఉండవని భర్తృహరి ప్రవచనం. మనసులో చింత ఉంటే సుఖం ఉండదు. ఆ'చింత'ను పారదోలే 'చింతనం' ఒక్కటే అపారమైన సుఖాన్నిస్తుందని గ్రహించాలి. చిత్తశుద్ధులైన వారిని ఏ దుఃఖమూ ప్రభావితం చేయదు. అసలైన భోగం రాగం (కోరిక)లో కాదు; త్యాగంలోను, అనురాగంలోను మాత్రమే ఉంది.
జీవితానికి సరియైన నిర్వచనం తెలుసుకుని ముందుకు నడిస్తే ఎక్కడా కష్టం కనిపించదు. జీ = జీవించు, వి = వికసించి, త = తత్వం తెలుసుకుని, ము = ముక్తికై యత్నించడం. ఇదే జీవిత పరమావధి. ఇది గ్రహించి, ఐహిక బంధనాలనుంచి విముక్తి కోరుకుంటూ, కోరికల్ని ఒక్కొక్కటే ఉల్లిమీది పొరలను తీసేసినట్లు తగ్గించుకుంటూ పోతూంటే, ఇక అంతా సుఖానుభూతే. ఆనంద దర్శనమే! 'ఎందెందు వెదకి జూచిన అందందే కలదు సుఖము' ఇది అక్షరసత్యం ఎటువంటి వాడికి? ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, వశీకృతమనస్కుడైనవాడికి, జితేంద్రియుడికి, పారమార్థిక చింతకలవాడికి! సంతృప్తిని మించిన సౌఖ్యమే లేదన్న నమ్మకమున్న వాడికి! ఈ వాస్తవాన్ని తెలుసుకోలేనివాడికి జీవించడం అనుక్షణం కష్టంగానే కనిపిస్తుంది. నరకప్రాయంగా తోస్తుంది. అలాంటి వాళ్లను వాళ్ల ప్రారబ్ధానికి వదిలేయడం తప్ప ఏం చేయగలం? లేలేత ఆశల్ని దురాశల్లోకి మార్చని సులభతరమైన, సుఖప్రదమైన, శుభప్రదమైన జీవితాలను ఆహ్వానిద్దాం!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి