ᐅదేహ రక్షణ




దేహ రక్షణ 

జీవకోటిలో నరజన్మ దుర్లభమైనదంటారు ఆదిశంకరులు వివేక చూడామణిలో. అంటే, జీవి మానవ శరీరాన్ని పొందగలగడం ఒక మహత్తరమైన అవకాశం అన్నమాట. సకల ధర్మాల సాధనకూ శరీరమే మూలమంటాడు కాళిదాసు. వేదాంతులు దేహాన్ని నిందిస్తుంటారు. ఈ దేహం చీమునెత్తురులతో కూడుకున్నదనీ, నశించిపోయేదనీ దానికోసం పాకులాట దేనికనీ అంటుంటారు. శరీరాన్ని నీటిబుడగతో పోలుస్తారు. నీటిపైన బుడగలు చిత్రంగా ఏర్పడతాయి. కాసేపు కొన్ని శక్తులు అన్ని వైపులకూ లాగిపట్టి ఆ బుడగకు అస్తిత్వాన్ని ప్రసాదిస్తాయి. ఆ శక్తులు ప్రసాదించినంతకాలం బుడగ నిలిచి ఉండి, తరవాత అంతరిస్తుంది. దీన్నే 'బుద్బుదం' అంటారు. ఎన్నో ప్రకృతి శక్తులు వివిధ కక్ష్యల్లో కలిసి పనిచేయడంవల్ల శరీరం నిలబడుతోంది. వాటి ఐక్యతలో మార్పు వచ్చినప్పుడు ఈ శరీరం తన స్థితిని కోల్పోతుంది. ఈ వైచిత్రిని గమనించి- దేహం రూపంలో మనకు ప్రకృతి శక్తులు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని విజ్ఞుల భావం.
దేహం అశాశ్వతమైనదైనా దాన్ని నిర్లక్ష్యం చేయడం సనాతన ధర్మానికి విరుద్ధం. నేటి సమాజంలో కొందరు క్షణికావేశంలో ప్రాణాలు త్యజిస్తున్నారు. ఆత్మహత్య మహాపాపమని, జీవికి తనను తాను అంతం చేసుకునే హక్కులేదని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని సామెత. అంటే శరీరం మనతో ఉన్నప్పుడే కర్తవ్యనిర్వహణ చేయాలి. మనం పళ్లు కొంటాం. రేపటికి అవి కుళ్లిపోతాయనే అనుమానం వస్తే ఈ రోజే తినేస్తాం తప్ప, రేపెలాగూ కుళ్లిపోయేవే కదా అని ఈరోజు పారేయడం లేదు.

ఇతర దేహాలకన్నా మానవదేహం బ్రహ్మాండానికి ప్రతిరూపంగా రూపుదాల్చి ఉంటుంది. అందుకే 'పిండాండ'మన్నారు. అంటే మనిషి మొత్తం సృష్టికే బీజం వంటివాడన్నమాట. చెట్టు తత్వమంతా విత్తనంలో దాగి ఉన్నట్లు సృష్టి తత్వమంతా మానవ నిర్మాణంలో పొదిగి ఉందంటారు పెద్దలు. శారీరకమైన ఈ జన్మ పాపం వల్లనే కలిగింది అనుకునేకన్నా 'అమృతస్యపుత్రా'- మేం అమృతులం, సృష్టియజ్ఞం కొనసాగడానికి పరమేశ్వర కార్యాల్లో నియుక్తులమైనామని భావించడం మేలు.

శరీరం దానంతట అది రాలిపడిపోవాలి తప్ప, బలవంతంగా విడిచిపెట్టకూడదు. త్రేతాయుగం, ద్వాపరయుగాల సంధికాలంలో భయంకరమైన కరవు వచ్చిందట. ఆహారం దొరక్క జనం నశించిపోసాగారు. అలాంటి దారుణ పరిస్థితుల్లో విశ్వామిత్రుడు ఎక్కడా కందమూలాలైనా లభించక ఒక చండాల వాటికలో ప్రవేశించాడు. ఒకరి ఇంటిముందు తోలు వలిచి వేలాడగట్టిన కుక్క మాంసం చూశాడు. ప్రాణాలు పోయే స్థితిలో ప్రాణరక్షణకు ఆ మాంసం తినాలనుకున్నాడు. ఆ అర్ధరాత్రి మాంసాన్ని దొంగిలించబోయాడు. అలికిడికి లేచిన చండాలుడు విశ్వామిత్రుని వారించాడు. 'చూడబోతే మునిలా ఉన్నావు నీకిదేం పని?' అని నిలదీశాడు. విశ్వామిత్రుడు తన ఆకలి స్థితి వివరించాడు. చండాలుడు 'కుక్క మృగాల్లోకెల్ల కుత్సితమైనది. దీన్ని తిని ఎందుకు ధర్మహాని చేస్తావు. మరో మార్గం చూసుకో' అన్నాడు. ప్రాణరక్షణకోసం అది తప్పు కాదని, తాను తన తపస్సుతో దోషాన్ని పోగొట్టుకోగలననీ వివరించాడు. 'అగస్త్యుడు రాక్షస మాంసం తినలేదా అతని తేజం నశించలేదుగదా' అన్నాడు. కాని, చండాలుడు లోకహితం కోసం చేసిన పాపానికి కీడు లేదన్నాడు. విశ్వామిత్రుడు దేహరక్షణకు తాను చేస్తున్నది పాపంకాదని చండాలుని ఒప్పించి మాంసం స్వీకరిస్తాడు. శరీరం మానవుడికి దైవదత్తమైన ఉపకరణం. దాన్ని నిలబెట్టుకొని ఉత్తమ స్థితి పొందాలని ఈ ఉదంతం చెబుతుంది.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు