ᐅకృషితో నాస్తి దుర్భిక్షం


కృషితో నాస్తి దుర్భిక్షం 

రుషులైనా కృషి చేయనిదే సత్ఫలితాలు సాధించలేరు.జీవితంలో ప్రతిక్షణం అత్యంత విలువైనదే. జారిపోయిన క్షణాన్ని తిరిగిపొందటం ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. నిన్న ఎప్పుడూ నిన్నగానే ఉండిపోతుంది. 'నేడు' క్రమంగా నిన్నగా మారిపోతుంటుంది. ఇది జీవన వైశిష్ట్యం.
మనిషి ఎప్పుడూ కాలం తనకు ప్రసాదించిన ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవటంలో నిమగ్నుడై ఉండాలి. తెలివిగల వ్యాపారి తన ధనాన్ని ఎన్నోరెట్లు అభివృద్ధిపరచుకుంటాడు. శూరుడైన రాజు తన రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకుంటూ చక్రవర్తి కావటానికి ప్రయత్నిస్తాడు. మునివాటికల్లో నిత్యమూ తపోశక్తిని అధికం చేసుకునే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

మరి, సామాన్యుడి విషయం ఏమిటి?

ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ పగటికలలు కంటూ ఉంటాడు. కళ్లముందు కనిపించే గొప్పవన్నీ తనవి కావాలనుకుంటాడు. అందమైన గృహం, వాహనం, అప్సరసలాంటి భార్య- ఇలాంటివన్నీ తనకే కావాలనుకుంటాడు. అవి ఇతరులకుంటే అసూయ పడుతుంటాడు.

లోకంలో అత్యధికుల సమస్య ఇది.

ఏమీ కష్టపడకుండా అన్ని సౌకర్యాలూ లభించడం 'సుఖం' అనుకుంటారు. ఏ సుఖమూ శాశ్వతంగా ఉండదు. ఒకసారి 'సుఖం' అనుభవించాక, అది దూరమయ్యాక కలిగే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది.

కృషివల్ల లభించే ఫలాలు తరగని ఆనందాన్నిస్తాయి. సుఖం శరీరానికి సంబంధించింది. దానివల్ల కొంతవరకే ఆనందం కలుగుతుంది. సుఖం పాతబడిన కొద్దీ ఆనందం పలుచనవుతుంటుంది.

కాబట్టి, సుఖంతో కలిగే ఆనందం- శాశ్వతం కాదు.

కృషివల్ల కలిగే ఆనందమే నిత్యమూ, శాశ్వతమూ. బాగానే ఉంది. మరి, కృషి ఎలా చెయ్యాలి? దేని గురించి చెయ్యాలి?

ప్రతి వ్యక్తికీ విధ్యుక్త ధర్మాలు అంటూ కొన్ని ఉంటాయి.

అంటే, వారు వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు. ఆశలు అధికమైనప్పుడు తమ కర్తవ్యంపట్ల ఆసక్తి మందగిస్తుంది. ఏవి తాను చేయలేడో వాటి గురించి ఆలోచిస్తూ, 'ఆ ఫలితాలు తనకు లభిస్తే చాలు' అనే వూహలతో వూయలలూగుతుంటాడు.

ఆ విధంగా కర్తవ్య నిర్వహణలో- అంటే, తన కృషిలో విఫలమవుతుంటాడు. కొత్తగా పొందాలనుకునేవి పొందలేకపోవటం అటుంచి, ఉన్న అవకాశాన్ని చెడగొట్టుకుంటాడు.

కృషిపట్ల దృఢ విశ్వాసంతో, అంకితభావంతో, అంతర్లీనంగా ఉన్న ప్రజ్ఞతో, ఫలితాలపట్ల ఎలాంటి ఎదురు చూపులూ లేకుండా శ్రమించేవారికి తప్పక గుర్తింపు లభిస్తుంది.

ఇది ఆధ్యాత్మిక జీవితానికీ వర్తిస్తుంది.

ఈ పూజకిది ఫలితం, ఈ జపానికిది లాభం, ఈ దానానికి ఇది ఫలం లాంటి లెక్కలు మానేసి, అంతరంగస్థితుడైన 'అంతర్యామి' మీదనే అన్ని చూపులూ కేంద్రీకరించాలి. తన ప్రతి చర్యా దైవసేవగానే భావించాలి. అప్పుడది సత్కృషి అవుతుంది. దానికి 'నాస్తి' అనేదే ఉండదు.

మన సత్కృషికి సత్ఫలితాలు ఇవ్వటానికి భగవంతుడు వివశుడవుతాడు. అంటే- ఇవ్వకుండా ఉండలేడు. అందుకే కృషి ఫలితాలు రుషులకే కాదు, రాక్షసులక్కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలి.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్