ᐅపరమ సుందరుడు



పరమ సుందరుడు 

వాల్మీకి రామాయణంలో సుందరకాండకు ఒక ప్రత్యేకత ఉంది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ- ఇలా మిగతా కాండలన్నీ సార్థక నామధేయాలు కలిగి ఉన్నాయి. సౌందర్యమంతా రాసిపోసినట్టు, రాముడి ఆజ్ఞను శిరసావహించి, హనుమ సీతాన్వేషణకు బయలుదేరి సీతను చూసి లంకను కాల్చిరావటం విశేషమైన ఒక కథాంశం. ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడు అతిసుందరుడని వాల్మీకి మహర్షి చెప్పటం మరో విశేషం! సౌందర్యం అంటే బాహ్యసౌందర్యం కాదని, ఆత్మసౌందర్యమేనన్నది కవిహృదయం. సుఖం ఇంద్రియాలపై ఆధారపడి ఉంటుంది. ఆనందం హృదయానికి సంబంధించింది. కాబట్టి, ఏ వస్తువువల్ల ఉల్లం పల్లవించి ఆనందం అనుభూతం అవుతుందో- అదే అందమైన వస్తువు. ఇందుకు సీతారామాంజనేయులే నిదర్శనం.
రాముడు సీతను పోగొట్టుకుని అడవిలో అలమటిస్తున్నాడు. సీత రావణనీత అయి అశోకవనంలో శోకిస్తున్నది. హనుమంతుడు జీవాత్మ రూపిణి అయిన సీతకు, పరమాత్మ స్వరూపుడైన రాముడికి ఒకరి జాడ ఒకరికి తెలియజేసి రెండు హృదయాల్లో ఆనందం నింపాడు. అంచేత, హనుమంతుణ్ని 'సుందరే సుందరః కపిః' అని కవి సంబోధించటంలో ఓ చమత్కారం ఉంది.

పరమాత్మనుంచి వేరుపడ్డ జీవాత్మ తిరిగి పరమపదాన్ని చేరుకోవాలని ఆరాటపడక తప్పదు. అలాగే, పరమాత్మ కూడా జీవాత్మను అక్కున చేర్చుకోవటానికి ఆత్రంగా ఎదురుచూస్తూనే ఉంటాడు. ప్రకృతి ప్రభావంవల్ల జీవుడైన జీవాత్మ తన ఆది ఆత్మ స్థితిని గ్రహించలేడు. జీవుడికి ఆ ఎరుక చెప్పగల ఒక 'ఘటకుడు' కావాలి. ఆ ఘటకుడికి మరొక పేరు గురువు లేక ఆచార్యుడు. సుందరకాండలో కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు కడు ప్రశంసనీయంగా, సమర్థంగా ఆ పాత్ర నిర్వహించగలిగాడు. ఆత్మసౌందర్యంతోపాటు ఈ ఆచార్య సౌందర్యం, బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉంది. సుందరాచార్యుడు గురు దర్శకుడు కాబట్టి, రామభద్రుడు సీత దగ్గరకు ఆంజనేయుణ్ని దూతగా పంపించాడు. ఆ తరవాత రామాయణంలో మిగిలిందల్లా మూడే ముక్కలు- కట్టె, కొట్టె, తెచ్చె.

భగవంతుడు జీవుని పొందటానికి గురువును ఆశ్రయించాలి. ఏకంగా భగవంతుణ్ని చేరటం అసాధ్యం- అన్న ఆధ్యాత్మిక తత్వాన్ని వాల్మీకి తెలియజేయటానికి సులభసుందరమైన పద్ధతి అవలంబించాడంటే అతిశయోక్తి కాదు. సుందరకాండ రామాయణానికే తలమానికమైంది. ఆంజనేయుడు పరమసుందరుడయ్యాడు. పరమ గురువూ ఆయనే.

-వి.రాఘవేంద్రరావు