ᐅకాలం ఆగదు
భగవత్ స్పృహ లేనివాళ్ల సంగతి సరేసరి. అది ఉంటే? అది కదిలితే? అది రగిలితే? ఇంకేమైనా ఉందా? ఉరుము కాదు, ఉప్పెన కాదు... సునామీ. ఆ సునామీ దేన్ని ముంచేస్తుంది? అది గుండెలు దాటి బయటికి వెళ్లేది కాదు. మనలోనే ఉంటుంది. కాబట్టి మననే ముంచేస్తుంది. మననే మధిస్తుంది. మననే వేధిస్తుంది. భౌతికమైన కోరికలేవీ మనిషిని ఇంత పిండి పిప్పిచేసేవి కావు. అందుకే రామకృష్ణ పరమహంస పిచ్చివాడై పోయారు. త్యాగరాజు ఏకంగా నిధి కంటే రాముని సన్నిధి చాలా సుఖమని ప్రపంచానికి చాటారు. ప్రహ్లాదుడు హరిస్మరణ కోసం మరణాన్నీ వరించాడు. కొన్ని గాయాలు హాయిగా ఉంటాయి. రుచిగా ఉంటాయి. మధురాతి మధురంగా ఉంటాయి. మందు వేసుకోవాలనీ అనిపించదు. మానిపోవాలనీ అనిపించదు.
ఏమిటిది? భక్తి. ప్రేమ. పిచ్చి... భగవంతుడంటే! మంచిది. మంచిదే. మరేం చేయాలి? ఆయన స్పృహే, హృదయంలోకి భక్తిప్రవేశమే ఇంత అందమైన రాద్ధాంతం చేస్తే- ఇక ఆయన సన్నిధి, ఆ పెన్నిధి, ఆ పరమ నిధి... దొరికితే? ఆయన వరకూ వెళ్లిపోగలిగితే? మంచిదే. కానీ ఎలా? ఎన్ని పనులు! ఎన్ని బాధ్యతలు! నిజమే, కానీ ఎంతో కాలం భగవత్ ధ్యాస, ధ్యానం లేకుండా బతికేశాం. ఇప్పుడు... కనీసం ఇప్పుడు పరమ పురుషుడంటూ ఒకడున్నాడు, ఆయనను పొందాలి, అదే జన్మోద్దేశం, అదే జన్మ రహస్యం అని గ్రహించాక కూడా- ఈ సంసారమనే ఉరితాళ్లను పట్టుకు వేలాడాల్సిన అగత్యం ఉందా? మిగిలింది కొద్ది సమయమే, కొద్ది ఆరోగ్యమే, కొద్ది శారీరక శక్తి వనరులే, కొద్ది జ్ఞాపక తెరలే... పొరలే. వాటినీ వృథా చేసుకోవద్దు మనం. ఏ పదార్థమైనా, ధనమైనా, ఏదైనా సరే- అధికంగా ఉన్నప్పుడు లెక్క చూసీచూడకుండా వాడేసుకుంటాం. అదే స్వల్పంగా ఉన్నప్పుడు? ఎంత లెక్క! ఎంత పొదుపు! ఎంత జాగ్రత్త! కాలం విషయంలో ఇప్పుడు మనమీ స్థితిలో ఉన్నాం. ప్రాపంచిక వస్తుజాలమైతే మన వద్ద మిగులు ఎంత ఉన్నదో మన అవగాహనలో ఉంటుంది. కాలం అలా కాదు. ఆయుష్షుకు వయసు కొలమానం కాదు. ఏ అర్హతలూ, ఏ అధికార ధనాధిక్యతలూ ఆయుష్షును పెంచలేవు. మనకున్న ఆయుష్షు మనకిచ్చిన కాలపరిమితి ఎంతన్నది ఎవరూ చెప్పలేరు. మన జీవితంలోని చివరి క్షణం ఏదన్నది, ఎప్పుడన్నది బతికినా, చనిపోయినా మనకు తెలీదు. కాబట్టి జీవించిఉన్న ప్రతి క్షణాన్ని అదే చివరి క్షణం అన్నంత ఆశగా, ఆర్తిగా, ఆబగా, అపురూపంగా, అమృత తుల్యంగా భావించాలి. నిజానికి అదే చివరి క్షణమైనా కావచ్చు! భగవత్ స్పృహను, ఉన్ముఖతను, ప్రేమను, ప్రేమించటాన్ని మనం కొద్దిగా రుచి చూశాం. ఇంకేం? ఇక మనకెవరి సాక్ష్యమూ అవసరం లేదు. అనుభవంలోకి వచ్చిన ఆ జ్ఞాపకమే అంత మధురాతి మధురం అయినప్పుడు అసలు విషయంలోకి ప్రవేశించేందుకు మనం ఆలోచించాల్సిన పనే లేదు. అందుకే తొందరపడదాం. తపించిపోదాం. తపస్వులమై తరిద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి